Reliance Retail acquires Kelvinator :కెల్వినేటర్ కంపెనీని రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తద్వారా భారత్‌లో హోమ్ అప్లయన్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు సిద్దమయ్యింది.
KNOW
భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న వినియోగ వస్తువులు (హోమ్ అప్లయెన్సెస్) మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు రిలయన్స్ రిటైల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా మార్కెట్లో ఉంటూ ప్రజల నమ్మకాన్ని పొందిన కెల్వినేటర్ కంపెనీని రిలయన్స్ రిటైల్ అధికారికంగా కొనుగోలు చేసింది.

ఈ ఒప్పందం ద్వారా ఇండియన్ వినియోగ వస్తువుల మార్కెట్‌లో రిలయన్స్ తన నాయకత్వాన్ని మరింతగా విస్తరించనుంది. కెల్వినేటర్ బ్రాండ్ తన గ్లోబల్ రీచ్, అధునాతన సాంకేతికత, విశ్వసనీయ పనితీరు, నాణ్యతతో వినియోగదారులకు దగ్గరై మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గత శతాబ్దం 70, 80 దశకాల్లో “ది కూలెస్ట్ వన్” అనే ట్యాగ్‌లైన్‌తో భారత మార్కెట్‌లో హిట్టైన ఈ బ్రాండ్‌ను ఇప్పుడు తిరిగి మార్కెట్‌లోకి తీసుకురానుంది రిలయన్స్.
రిలయన్స్ రిటైల్ తన విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్ ద్వారా కెల్వినేటర్ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఇలా దేశవ్యాప్తంగా వినియోగదారులకు దీన్ని మరింత చేరువ చేయనుంది.
ఈ ఒప్పందంపై రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ… “భారత వినియోగదారులకు గ్లోబల్ స్థాయిలో ఉన్న నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే కెల్వినేటర్ ను దక్కిచుకున్నాం… ఇది కీలకమైన మలుపు” గా పేర్కొన్నారు.
ఈ కొనుగోలుతో భారత హోమ్ అప్లయన్స్ రంగంలో రిలయన్స్ రిటైల్ పోటీదారులకు గట్టి సవాల్ విసిరే స్థాయిలో నిలబడనుంది. వినియోగదారుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో వారి అవసరాలను ముందే అంచనా వేయాలని భావిస్తోంది. తక్కువ ధరల్లో అధిక నాణ్యత గల ఉత్పత్తులు అందించేందుకు రిలయన్స్ కృషి చేస్తోందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ వ్యూహాత్మక విలీనం ద్వారా రిలయన్స్ కంపెనీ భవిష్యత్తులో విస్తృతమైన మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఇలా మార్కెట్లో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటామని రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
