భారతీయ మీడియా రంగంలో సంచలనం : డిస్నీ, రిలయన్స్ విలీనం .. రూ 11,500 కోట్ల డీల్ , ఛైర్మన్‌గా నీతా అంబానీ
దేశీయ మీడియా రంగంలో భారీ విలీనం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాల్ట్ డిస్నీ ఇండియా సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయోకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
దేశీయ మీడియా రంగంలో భారీ విలీనం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాల్ట్ డిస్నీ ఇండియా సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయోకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి 70,352 వేల కోట్ల రూపాయల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి. ఈ వెంచర్‌లో రిలయన్స్ రూ.11,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి మీడియాలో ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తుండగా.. దానికి తెరదించుతూ ఇరుసంస్థలు తాజాగా ప్రకటన విడుదల చేశాయి.
ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయోకామ్ 18 , స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయోకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దక్కనున్నాయి. ఈ వెంచర్‌కు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా , వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
ఈ జాయింట్ వెంచర్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ స్పందించారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికినట్లయ్యిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ మీడియా రంగంలో అత్యుత్తమ సంస్థగా వున్న డిస్నీతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా వుందని ముఖేష్ అంబానీ తెలిపారు.
దీని వల్ల తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు చౌక ధరల్లో కంటెంట్ అందించడానికి వీలు పడుతుందని పేర్కొన్నారు. డిస్నీని రిలయన్స్ గ్రూప్‌లో భాగస్వామిగా చేయడానికి, ఆహ్వానిస్తున్నట్లుగా ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్‌తో ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా ఈ జాయింట్ వెంచర్ అవతరించనుందని, నాణ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ కంటెంట్‌ను అందించడం వీలుపడుతుందని వాల్ట్ డిస్నీ సీఈవో జాబ్ ఐగర్ పేర్కొన్నారు.
ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి వుంది. 2024 చివరిలో కానీ, 2025 తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. స్టార్ ఇండియాలోని 70 ఛానెళ్లు, రిలయన్స్‌కు చెందిన వయోకామ్ 18లోని 38 ఛానెళ్లు ఈ ఒప్పందం ద్వారా ఒకే గొడుగు కిందకు రానున్నాయి. వీటికి అదనంగా డిస్నీ హాట్ స్టార్, జియో సినిమా పేరుతో రెండు స్ట్రీమిండ్ ఫ్లాట్‌ఫామ్‌లు వుండనున్నాయి. రిలయన్స్ , డిస్నీ విలీనం తర్వాత కొత్త జాయింట్ వెంచర్ భారతదేశంలో 75 కోట్ల మంది వీక్షకులను కలిగి ఉంటుందని అంచనా.