Asianet News Telugu

నో ప్రాబ్లం:ఆస్తులమ్మైనా అప్పులు తీరుస్తా.. అనిల్ అంబానీ


మదుపరులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని రిలయన్స్ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ స్పష్టం చేశారు. తన ఆస్తులు అమ్మి అయినా అప్పులు తీరుస్తానని భరోసానిచ్చారు. రుణ సంస్థలేవీ ఒక్క పైసా సాయం అందివ్వడం లేదని తెలిపారు. కోర్టు తీర్పుల జాప్యంతో రూ.30,000 కోట్లు నిలిచిపోయాయని, అయినా ఆస్తులమ్మే  రూ.35,000 కోట్లు చెల్లించానని అనిల్ అంబానీ తెలిపారు. 

Reliance Group has serviced Rs 35,000 crore debt obligations in past 14 months: Anil Ambani
Author
Mumbai, First Published Jun 12, 2019, 10:29 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై: బయట ఒక్క పైసా అప్పు కూడా పుట్టడం లేదని, అయినా ఆస్తులు విక్రయించైనా రుణ, పెట్టుబడి బకాయిలు చెల్లిస్తామని మదుపర్లకు రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ భరోసా ఇచ్చారు. సాధ్యమైనంతమేరకు రుణాలను తగ్గించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు).. ఇలా ఏ రుణ సంస్థ రుణ సహకారం అందివ్వకున్నా.. గత 14 నెలల్లో రూ.35,000 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో అనిల్ అంబానీ మాట్లాడుతూ ఆస్తులు అమ్మయినా ఈ నిధులు  సమకూర్చామని  చెప్పారు. మున్ముందు చెల్లించాల్సిన బకాయిలను కూడా సమయానుగుణంగా చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నిధుల సమీకరణకు ప్రతికూల పరిస్థితుల ఉన్నందున ఆస్తుల అమ్మకం ద్వారానే ఈ చెల్లింపులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. 

ఆర్‌కామ్‌ సహా గ్రూపు కంపెనీల రుణ సంక్షోభ పరిణామాలతో గత కొన్ని నెలలుగా అనిల్‌ అంబానీ గ్రూపు షేర్లు బాగా నష్టపోయిన సంగతి తెలిసిందే. స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన ఏడు రిలయన్స్‌ గ్రూపు సంస్థల షేర్లు జనవరి నుంచి దాదాపు 65 శాతం వరకు మార్కెట్‌ విలువను కోల్పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మదుపర్లలో ఆందోళనను తగ్గించే ఉద్దేశంతో పైవిధమైన హామీని అనిల్‌ అంబానీ ఇచ్చారు.

వదంతులు, ఊహాగానాల వల్లే గత కొన్ని వారాలుగా రిలయన్స్‌ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయని అనిల్‌ అంబానీ చెప్పారు. ఈ పరిణామం వాటాదార్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. అందుకే గ్రూపు చెల్లించాల్సిన, చెల్లించిన బకాయిలపై ఆయన స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించారు.

2018 ఏప్రిల్‌ నుంచి 2019 మే 31 మధ్య రిలయన్స్‌ గ్రూపు అసలు కింద రూ.24,800 కోట్లు చెల్లించిందని రిలయన్స్ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చెప్పారు. అలాగే రూ.10,600 కోట్ల వడ్డీని కూడా చెల్లించినట్లు చెప్పారు. రూ.35,000 కోట్లు చెల్లించామని అనిల్‌ చెబుతున్న ఈ బకాయిలు రిలయన్స్‌ కేపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాలకు చెందినవి. 

రిలయన్స్‌ గ్రూపు రుణ సంక్షోభ సమస్య మరింత జఠిలమయ్యేందుకు నియంత్రణ సంస్థలు, కోర్టు తీర్పులు కూడా కొంత కారణమని అనిల్ అంబానీ తెలిపారు. న్యాయస్థానాల్లో తుది తీర్పుల ఆలస్యం వల్ల గ్రూపునకు రావాల్సిన రూ.30వేల కోట్ల మేర నిధులు దాదాపు ఐదు నుంచి పదేళ్లుగా  నిలిచిపోయాయని తెలిపారు. 

కారణాలేమైనా తుది తీర్పులు వెలువడటం అనిల్ అంబానీ కంపెనీల చెల్లింపులు పదే పదే ఆలస్యం అవుతూ వచ్చాయి. బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్‌లు, బీమా కంపెనీలు, భవిష్యనిధి సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇలా ఆర్థిక సేవల సంస్థల్లో ఏవీ కూడా రిలయన్స్‌ గ్రూపులోని ఏ ఒక్క సంస్థకు అదనపు నిధుల సహాయం అందించడం కానీ, రుణాలివ్వడం కాని చేయలేదని అనిల్ అంబానీ చెప్పారు. 

దీని వల్ల అంతిమంగా రుణాలిచ్చిన సంస్థలు, వాటాదార్ల ప్రయోజనాలకే ఇబ్బంది ఏర్పడుతుందని అనిల్ అంబానీ అన్నారు. తక్కువ అప్పు, అధిక మూలధనం, మెరుగైన ఈక్విటీ ప్రతిఫలం, వాటాదార్ల విలువకు ప్రయోజనం అందించే సంస్థగా రిలయన్స్‌ గ్రూపును మళ్లీ తీర్చదిద్దగలమనే నమ్మకం ఉందని చెప్పారు.

తాజాగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపునకు రూ.లక్ష కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఇందులో ఆర్‌కామ్‌కు చెందినవే రూ.49,000 కోట్లు. ప్రస్తుతం ఆర్‌కామ్‌పై దివాలా ప్రక్రియ నడుస్తోంది. ఈ రూ.లక్ష కోట్లలో రూ.35,400 కోట్లను ఇప్పటివరకు చెల్లించింది.

రిలయన్స్‌ పవర్‌ అనుబంధ విద్యుత్‌ పంపిణీ వ్యాపారాన్ని అదానీ గ్రూపునకు విక్రయించడంతో దాదాపు రూ.18,000 కోట్లు రిలయన్స్‌ గ్రూపునకు వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారంలో వాటాను నిప్పన్‌ గ్రూపునకు విక్రయించడం ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించింది. బిగ్‌ ఎఫ్‌ఎమ్‌లో మెజార్టీ వాటాను జాగరణ్‌ గ్రూపునకు విక్రయించడం ద్వారా రూ.1,200 కోట్లు వచ్చాయి.

బీమా వ్యాపారాన్ని కూడా అనిల్ అంబానీ విక్రయానికి పెట్టారు. దీనికి సంబంధించి ఇంకా ఒప్పందాలేవీ కుదుర్చుకోలేదు. గతేడాది అనిల్‌ సోదరుడు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియోతో స్పెక్ట్రమ్‌ విక్రయం నిమిత్తం రూ.23,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఈ విక్రయ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios