ముడి చమురు-సహజవాయువు అన్వేషణ క్షేత్రం కోసం తన బ్రిటిష్‌ భాగస్వామి బీపీ పీఎల్‌సీతో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) బిడ్‌ వేసింది. ఎనిమిదేళ్లలో ఈ రెండు సంస్థలు బిడ్‌ వేయడం ఇదే తొలిసారి. 32 ఆయిల్ క్షేత్రాలను వేలానికి అందుబాటులో ఉంచగా, వేదాంతా 30 బిడ్లు వేసింది.

ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ 20 బిడ్లు వేసింది. ఓపెన్‌ యాక్‌రేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ) రెండోదశ కింద 14 క్షేత్రాలు, మరో 18 చమురు-సహజవాయువు క్షేత్రాలు, మరో 5 కోల్‌ బెడ్‌ మీధేన్‌ (సీబీఎం) క్షేత్రాలకు ఓఏఎల్‌పీ 3వ దశ కింద బిడ్లు దాఖలు చేసేందుకు ఈనెల 15తో గడువు ముగిసింది. 

వేదాంత 30, ఓఎన్‌జీసీ 20, ఆయిల్‌ ఇండియా (ఓఐఎల్‌) 16 క్షేత్రాలకు బిడ్‌ వేశాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), గెయిల్‌ ఇండియా, సన్‌పెట్రో తలా రెండు క్షేత్రాలకు బిడ్‌ దాఖలు చేశాయి. 

కృష్ణా-గోదావరి బేసిన్‌లోని ఒక్క క్షేత్రం కోసం ఆర్‌ఐఎల్‌-బీపీ బిడ్‌ దాఖలు చేశాయి. దేశంలో చమురు అన్వేషణకు బిపీ బిడ్‌ దాఖలు చేయడం ఇదే తొలిసారి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు-సహజవాయువు అన్వేషణ క్షేత్రాల్లో 30 శాతం వాటాను 7.2 బిలియన్‌ డాలర్ల (డాలర్‌ ప్రస్తుత విలువ ప్రకారం సుమారు రూ.50,400 కోట్లు)కు 2011లో కొనుగోలు చేయడం ద్వారా బీపీ మన దేశంలోకి ప్రవేశించింది.

ఇప్పటివరకు అన్వేషణ చేపట్టని 2.8 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల పరిధిలో, కంపెనీల ప్రవేశానికి 2017 జులైలో కేంద్రప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అప్పుడు బీపీ ఆసక్తి వ్యక్తీకరించిన క్షేత్రం కోసమే ఇప్పుడు ఆర్‌ఐఎల్‌-బీపీ బిడ్‌ వేశాయని సమాచారం.
 
ఓఏఎల్‌పీ 2 కింద కేటాయిస్తున్న క్షేత్రాల్లో రూ.40,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతంలో పేర్కొన్నారు. ఓఎల్‌ఏపీ తొలి దశ కింద 55 క్షేత్రాల్లో రూ.60,000 కోట్ల పెట్టుబడులకు అంగీకరించారు. మూడోదశ కింద రూ.49,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.