Asianet News TeluguAsianet News Telugu

ఇక ఆన్‌లైన్‌లోనే పండుగలు: ఈసారి పక్కా రూ.22 వేల కోట్ల సేల్స్!

రోజులు మారుతున్నాయి. అంటే టెక్నాలజీ పుణ్యమా? అని ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో ఆన్ లైన్, డిజిటల్ వ్యాపార లావాదేవీలకే పెద్ద పీట. ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ రిటైల్ సంస్థల ద్వారా రూ.22 వేల కోట్ల మేరకు విక్రయాలు సాగొచ్చని రెడ్ సీర్ అనే అధ్యయన సంస్థ అంచనా వేసింది.

RedSeer expects strong growth in online shopping during festive season
Author
New Delhi, First Published Sep 10, 2018, 7:45 AM IST

వచ్చే పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ అదిరిపోయేలా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ సంస్థలపై సుమారు రెండు కోట్ల మంది ఆయా వస్తువులను కొనుగోలు చేసే వీలుందని రెడ్‌సీర్ కన్సల్టింగ్ ఓ నివేదికలో తెలిపింది.

ఈ క్రమంలోనే ఆన్ లైన్ అమ్మకాలు ఈసారి దాదాపు రూ.22 వేల కోట్లను తాకవచ్చని పేర్కొన్నది. విజయదశమి, దీపావళి పండుగల కళంతా కూడా ఆన్‌లైన్లోనే కనిపిస్తుందన్నది. 2016లో ఈ పండుగల సీజన్‌లో కోటి మంది ఆన్‌లైన్ కొనుగోళ్లను జరిపారని, 2017లో వీరి సంఖ్య కోటిన్నర దాటిపోయిందన్న రెడ్‌సీర్.. 2018లో 2 కోట్లకు చేరవచ్చన్న ధృడమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో పండుగ సీజన్‌కు బోలెడన్ని డిస్కౌంట్లు, ఇతరత్రా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని, దీంతో సహజంగానే కస్టమర్లు ఏటేటా పెరిగిపోతున్నారని చెప్పింది. కాగా, పండుగలకు ముందు ప్రతిసారి ఈ రెండు సంస్థలు ఫెస్టివ్ మేళాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సంస్థల నుంచి ఆఫర్ల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్య వరకు వచ్చే అవకాశాలున్నాయి. 

ఇదిలాఉంటే ఈ ఏడాది మే-జూలై మధ్య స్థూల సరుకుల విలువ (జీఎంవీ) 62 మిలియన్ డాలర్లుగా ఉంటే, గతేడాది జరిగిన ఐదు రోజుల ఫెస్టివ్ సేల్‌లో ఏకంగా 280-300 మిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం. ఆన్‌లైన్ మెగా సేల్స్‌కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో దీన్నిబట్టి అర్థమవుతున్నది. సంప్రదాయ మార్కెట్‌తో పోల్చితే ధరలు తక్కువగా ఉండటం, కొన్ని ముందస్తుగా ఆన్‌లైన్ మార్కెట్‌లోనే అందుబాటులో ఉండటం, ఇంట్లోగావచ్చు లేదా మరేదైనాచోటుగావచ్చు.

ఉన్నదగ్గర్నుంచే షాపింగ్ చేసే వెసులుబాటు ఉండటం వంటివి చాలామందిని ఆన్‌లైన్ షాపింగ్‌కు దగ్గర చేస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులనూ ఆన్‌లైన్ షాపింగ్ తప్పిస్తుండటం ఈ-కామర్స్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నది. ఇకపోతే ఎప్పట్లాగే ఈసారీ మొబైల్ ఫోన్ల అమ్మకాలు భారీగా ఉండొచ్చని రెడ్‌సీర్ అంచనా వేస్తున్నది. మొత్తం అమ్మకాల్లో 52 శాతం వాటా ఇవే ఉంటాయంటున్నది. 15 శాతం ఫ్యాషన్ విభాగం ఉండొచ్చని చెబుతున్నది.

ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాలో కొన్ని ప్రతిపాదనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటి పరిష్కారార్థం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నది. పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డీఐపీపీ) కార్యదర్శి నాయకత్వంలో ఏర్పాటవుతున్న ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్, సమాచార-సాంకేతిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నీతి ఆయోగ్, ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రతినిధులకూ కమిటీలో స్థానం ఉండనున్నది. 

కమిటీ తొలి సమావేశం ఈ వారంలోనే జరిగే వీలున్నది. పెట్టుబడులు, రాయితీలు, కొనుగోలుదారుల డాటా స్టోరేజ్ వంటి పలు అంశాలకు సంబంధించి ముసాయిదాలో ప్రతిపాదనలున్నాయి. అయితే వీటిపై అభ్యంతరాలు వస్తున్నాయని చెప్పిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు.. ఈ కమిటీతో అవి తొలగిపోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు నేపథ్యంలో తమ నికర ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20) పడిపోగలదన్న అంచనాను వాల్‌మార్ట్ వెలిబుచ్చింది. 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను అమెరికా రిటైల్ దిగ్గజమైన వాల్‌మార్ట్ గత నెలలోనే హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, ఈ డీల్ నేపథ్యంలో ప్రభుత్వంతో సంప్రదింపుల్లో భాగంగా అన్ని పన్ను బకాయిలను చెల్లించేందుకు వాల్‌మార్ట్ అంగీకరించడంతో ఆదాయం పన్ను (ఐటీ) శాఖకు రూ.10,000 కోట్లకుపైగా పన్ను రాబడి అందనున్నది. వీటన్నిటి దృష్ట్యానే రాబోయే రెండేండ్ల వాల్‌మార్ట్ ఆదాయం ప్రభావితం కావచ్చన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios