Asianet News TeluguAsianet News Telugu

మాకెందుకీ ‘కొలవెరి ఢీ’: ఐసీఐసీఐ కుంభకోణంపై బ్యాంకర్లలో టెన్షన్

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు చేయడంతో బ్యాంకర్లలో గుబులు మొదలైంది. ప్రత్యేకించి రుణాలు మంజూరు చేసే విషయంలో ఆచీతూచీ వ్యవహరించాల్సి ఉంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు. 

RBI Watch: Amid ICICI-CBI saga, bankers ask, Why this Kolaveri di
Author
Mumbai, First Published Jan 29, 2019, 11:00 AM IST

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌పై సీబీఐ ఛార్జిషీటు నమోదు చేయడం బ్యాంకర్లలో గుబులు మొదలైంది. న్యాయపరిధిలో ఉన్న కేసుపై ఏం మాట్లాడలేక పోయినా.. ఈ పరిణామంతో రుణాలను మంజూరు చేసే విషయమై నిర్ణయాలు తీసుకునేటపుడు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది.

ఓ బ్యాంకరైతే ‘వై దిస్‌ కొలవరి డి’ అంటూ వాపోయారు కూడా. చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ అధిపతి వేణుగోపాల్‌ దూత్‌ పేర్లూ ఛార్జిషీటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరితోనే వదిలిపెట్టలేదు.

బ్యాంక్‌ బోర్డు లేదా కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌లో ఉన్న కేవీ కామత్‌, సందీప్‌ భక్షి (ప్రస్తుత ఎండీ, సీఈఓ), గోల్డ్‌ మాన్‌ శాక్స్‌ ఇండియా ఛైర్మన్‌ సంజయ్‌ ఛటర్జీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ ఇండియా సీఈఓ జరీన్‌ దారువాలా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ ఎన్‌.ఎస్‌. కన్నన్‌, టాటా క్యాపిటల్‌ ఎండీ రాజీవ్‌ సబర్వాల్‌, బ్యాంక్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె. రామ్‌కుమార్‌, మాజీ బోర్డు సభ్యుడు హెచ్‌. ఖుస్రోఖాన్‌ తదితరుల పేర్లు కూడా ఛార్జిషీటులో చోటు చేసుకున్నాయి. 

అసలు కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌లను కేసులోకి ఎందుకు లాగారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. దూత్‌ కంపెనీలో చందా కొచ్చర్‌ భర్త వ్యాపార లావాదేవీలకు ప్రతిగా కొచ్చర్‌ దూత్‌కు రుణాలిచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో తొలుత వీరిచుట్టూ కేసు తిరిగిన విషయం తెలిసిందే.

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉదంతమే కాదు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర విషయంలోనూ జరిగిన పరిణామాల నేపథ్యంలోనూ బ్యాంకర్లు ఆచీతూచీ వ్యవహరించాల్సి వస్తోంది. డీఎస్‌కే రుణ కేసు విషయంలో ఆ బ్యాంక్‌ ఉన్నతాధికారులైన ఆర్‌.పి. మరాఠే, సుశీల్‌ మునాత్‌, ఆర్‌.కె. గుప్తాలు అరెస్టయినప్పుడు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ వారికి మద్దతుగా నిలిచింది.

కేసు కూడా వేసింది. అయితే కేసు సాగే కొద్దీ.. బ్యాంకు చర్యలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఉన్నాయని కేసును ఉపసంహరించుకున్నాయి. చందాకొచ్చర్‌ విషయంలోనూ తొలుత ఐసీఐసీఐ బ్యాంకు, బోర్డు ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత క్రమంగా వెనక్కి తగ్గాయి.

తొలుత సెలవులోకి వెళ్లినా ఏమీ పట్టించుకోని ఐసీఐసీఐ బోర్డు.. ఆ తర్వాత కొచ్చర్‌ను తొలగించాల్సి వచ్చింది కూడా. బ్యాంకులు తీసుకునే నిర్ణయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటే.. పలు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం తమ ప్రతిష్ఠకు కూడా భంగమేనని ఆర్బీఐ కూడా ఆందోళన చెందుతోంది. 

మొండి బకాయిలతో సతమతమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్న తరుణంలో.. ఇలాంటి కేసులు బ్యాంకింగ్ వ్యవస్థను తిరిగి అగాధంలోకి నెడతాయేమోనన్న భయం ప్రభుత్వంలోనూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదు కానీ ఆ కొంత మంది చేసే తప్పుల వల్ల మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థపైనే ప్రభావం పడుతుండడమే మింగుడుపడని విషయమని ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios