Asianet News TeluguAsianet News Telugu

కింగ్ ఫిషర్ ఖాతాలో మోసం.. పలు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తాను రుణాలు చెల్లించేందుకు సిద్ధమైనా బ్యాంకులు అంగీకరించలేదని వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా వివిధ బ్యాంకులను మోసగించే రీతిలోనే ఆయన సారథ్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యవహరించింది.

RBI levies Rs 50 lakh fine on PNB for lag in reporting Kingfisher Airlines' account fraud
Author
New Delhi, First Published Aug 4, 2019, 11:02 AM IST

నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకుల పట్ల భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తోంది. ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) మీద శనివారం ఆర్‌బీఐ రూ.50లక్షల జరిమానా విధించింది.

దీంతోపాటు మరో ఆరు వాణిజ్య బ్యాంకుల పైనా ఆర్బీఐ కఠినంగా వ్యవహరించడంతోపాటు భారీ జరిమానా విధించింది..కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ ఖాతాలో చోటుచేసుకున్న మోసం గురించి వెల్లడించడంలో ఆలస్యమే ఆర్బీఐ చర్యకు కారణమని పీఎన్‌బీ తెలిపింది.

‘పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ గతేడాది జూలై 10వ తేదీన  సమర్పించిన ఫ్రాడ్ మానిటరింగ్ నివేదిక-1 ద్వారా కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో జరిగిన మోసాన్ని వెల్లడించడంలో ఆలస్యం చేసిందని ఆర్‌బీఐ గుర్తించింది’ అని పీఎన్బీ పేర్కొంది. 

బ్యాంకింగ్ రెగ్యులేటరీ చట్టం కింద ఈ జరిమానా విధించినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఖాతాలోని మోసాన్ని వెల్లడించడంలో ఆలస్యం చేసినందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మీద కూడా రూ.50లక్షల జరిమానా పడింది. ఇంకా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ విషయంలోనే ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌కు రూ.1.5 కోట్ల జరిమానా పడింది. 

ఆర్‌బీఐ ఆదేశం అందిన 14 రోజుల్లోగా ఈ జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తెలిపింది. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌లకు రూ.కోటి చొప్పున జరిమానా విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.

మోసాల వెల్లడి విషయంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల ఎస్బీఐకి రూ.50 లక్షల జరిమానా పడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌లకు రూ.50 లక్షల చొప్పున ఆర్‌బీఐ జరిమానా విధించింది.
 
కార్పొరేషన్‌ బ్యాంకుకు రూ.కోటి, అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలకు రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు, యూబీఐలకు రూ.1.5 కోట్ల చొప్పున, ఓబీసీకి రూ. కోటి జరిమానాను ఆర్బీఐ విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios