అసలే కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక వేత్తలు ఆచితూచి స్పందించాలని సూచిస్తున్న తరుణంలో బ్యాంక్ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ విడుదల చేసిన నివేదిక సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆర్బీఐ వద్ద ఉండాల్సిన దాని కంటే ఎక్కవ నిధులే ఉన్నాయని పేర్కొన్నది. ఆ నిధుల నుంచి రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తాజా నివేదిక చెబుతోంది.

ఆర్బీఐ వద్ద అదనపు మూలధనం ఉన్నట్లు నిధుల బదిలీ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటయ్యే కమిటీ గుర్తిస్తుందని బ్యాంక్ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ అంచనా వేస్తోంది. ఈ మేరకు సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నివేదిక ఇలా
‘ఆర్‌బీఐ ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఈసీఎఫ్‌)ను పరిశీలించేందుకు ఏర్పాటయ్యే కమిటీ రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద రూ. 1-3లక్షల కోట్ల అదనపు మూలధనాన్ని గుర్తిస్తుందని అంచనా వేస్తున్నాం.

ఇందులో నుంచి రూ. లక్ష కోట్లను ఆర్బీఐ భారత ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చు. భారత్‌ మినహా బ్రిక్స్‌ దేశాల సగటు ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఈ మొత్తం 75శాతం ఎక్కువ’ అని బ్యాంక్ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్ తన నివేదికలో పేర్కొంది.

ఆర్బీఐ, కేంద్రానికి మధ్య విభేదాల కారణాలివి
పాత పెద్ద నోట్ల రద్దు, బ్యాంకింగ్ రంగంలో ప్రమాదకర స్థాయికి చేరిన మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం మధ్య ద్రవ్యవ్యవస్థలో తలెత్తిన విపత్కర పరిస్థితులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆర్బీఐకి నడుమ విభేదాలు సృష్టించిన విషయం తెలిసిందే.

బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బాకీలు తీవ్రమయ్యాయి. ఆమోదయోగ్య స్థాయిని దాటిపోయిన బ్యాంకులపై ఆర్బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) చర్యలకు దిగిన సంగతి విదితమే. దీంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు నిధుల కొరత ఏర్పడగా, మౌలిక రంగ ప్రాజెక్టులకు పెట్టుబడుల బెడద వచ్చిపడింది.

రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కొరతపై గడ్కరీ ఆందోళన ఇలా
లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు స్తంభించిపోయాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆర్బీఐ పీసీఏ నిబంధనలు తమకు రుణాలను కరువు చేశాయని కార్పొరేట్ల నుంచీ మోదీ సర్కార్‌పై ఒత్తిడి పెరిగింది.

ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ మిగులు నిల్వలపై కేంద్రం కన్నేసింది. నగదు బదిలీ అంశమై  ఆర్బీఐ ఇందుకు ససేమిరా అనడంతో కేంద్రంతో విభేదాలు పొడచూపాయి. ఎప్పట్నుంచో ఉన్న అసంతృప్తిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య బయటపెట్టడం పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేసింది.

ఉర్జిత్ పటేల్ స్వరం పెంపు, విపక్షాల విమర్శలతో తగ్గిన కేంద్రం
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ సైతం స్వరం పెంచడం, ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ప్రయోగించాలని కేంద్రం చూడటం, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ నెల 19న జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది.

ఈ సందర్భంగానే ఆర్బీఐ మిగులు నిల్వల అంశాన్ని తేల్చేందుకు సెంట్రల్ బ్యాంక్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేంవర్క్ (ఈసీఎఫ్)పై ఓ నిపుణుల కమిటీని ప్రతిపాదించారు. ఈ కమిటీ సభ్యులను కేంద్రం, ఆర్బీఐ కలిసి ఎన్నుకోవాల్సి ఉండగా, ఈ వారంలో కమిటీ కూర్పు జరుగుతుందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. 

ఆర్బీఐ మిగులు నిధులు 3.5 శాతానికి పరిమితం చేయొచ్చు
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగ మొండి బకాయిల తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ మిగులు నిల్వల నిధిని 3.5 శాతానికి పరిమితం చేసినా.. ఇందులో నుంచి రూ.1.05 లక్షల కోట్లనైనా కేంద్రానికి ఇవ్వవచ్చని, దానివల్ల ఆర్బీఐకి ఒనగూరే నష్టం ఏదీ ఉండబోదన్నది. ఈ నిల్వల తరలింపు తర్వాత కూడా బ్రిక్స్ దేశాల రిజర్వ్ బ్యాంకుల సగటు నిల్వల కంటే ఆర్బీఐదే ఎక్కువగా ఉంటుందని తెలియజేసింది.

విదేశీ వాణిజ్య రుణాల నిబంధనలు సరళతరం
ఇదిలా ఉంటే విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) కోసం ఆర్బీఐ సోమవారం హెడ్జింగ్ నిబంధనలను సరళతరం చేసింది. ప్రస్తుతం 100 శాతంగా ఉన్న హెడ్జింగ్ ప్రొవిజన్‌ను 70 శాతానికి తగ్గించింది.

ఈ సవరణ 3-5 ఏండ్ల కాలపరిమితి కలిగిన ఈసీబీల మెచ్యూరిటీకి వర్తిస్తుందని ఓ నోటిఫికేషన్‌లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అంశంపై మరిన్ని నిర్ణయాలను కేంద్రంతో చర్చించి తీసుకుంటామని కూడా తెలియజేసింది. ఈసీబీ ఫ్రేంవర్క్ ట్రాక్ 1 కింద ఈ సవరణలు జరిగాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.42 వేల కోట్లు
వచ్చే ఏడాది మార్చిలోగా ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌యూ)లకు కేంద్రం నుంచి రూ.42,000 కోట్ల ఆర్థిక సాయం అందనున్నది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఐదు బ్యాంకులకు రూ.11,336 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన విషయం తెలిసిందే.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లకు ఈ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల మరో విడుత నిధుల విడుదల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయంలో భాగంగా డిసెంబర్ 2-3 వారాల్లో మరో రూ.42,000 కోట్ల నిధులు అందే వీలున్నదని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.

ఎస్బీఐ, పీఎన్బీలకు మరింత సాయం అక్కర్లేదట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ, పీఎన్బీలకు మరింత ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అవసరం లేదన్నారు. ఇప్పటిదాకా పీఎన్బీకి రెండుసార్లు నిధులు వచ్చినట్లు పేర్కొన్నారు.

మొండి బకాయిల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్న బాసెల్-3 అంతర్జాతీయ పెట్టుబడుల నిబంధనల గడువును 2020 మార్చిదాకా ఆర్బీఐ ఇప్పటికే పొడిగించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూరుస్తామని గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.