న్యూఢిల్లీ: ఈ నెల 19న జరుగబోయే రిజర్వ్‌బ్యాంక్ బోర్డు సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ ఊర్జిత్ పటేల్ రాజీనామాకే మొగ్గుచూపుతున్నారా? అవుననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. 

ప్రభుత్వంతో విభేదించి అలసిపోవడమే కాక, వైరిపూరిత వాతావరణంలో పనిచేయడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని పటేల్ తన సన్నిహితుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ప్రధానంగా మూడు అంశాల్లో రిజర్వ్ బ్యాంకుపై ఒత్తిడి తెస్తున్నది. మొదటిది.. ద్రవ్యలోటును నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంకు వద్ద వున్న రిజర్వులలో అధిక మొత్తాన్ని కేంద్రానికి బదలాయించడం. 

రెండవది.. హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు వ్యవస్థలోకి నిధుల ప్రవాహం పెంచడం. 3వది మొండిబకాయిలతో బలహీన పడిన బ్యాంకులపై అమలు చేస్తున్న పీసీఏ నిబంధనలను సడలించి బ్యాంకులకు ఆదాయం పెంచే చర్యలను తీసుకోవడం. పైవాటిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుండడంతో డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రిజర్వ్‌బ్యాంక్ స్వయంప్రతిపత్తికి ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించడంతో కేంద్రానికి రిజర్వ్‌బ్యాంకుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 

దీంతో రిజర్వ్‌బ్యాంక్ చట్టంలోని సెక్షన్ 7 కింద ప్రభుత్వం ఆదేశాలను జారీచేసేందుకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో గవర్నర్ ఊర్జిత్ పటేల్ మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు సమాచారం. ఎక్కువగా అంతర్ముఖీనుడా ఉండే ఊర్జిత్ పటేల్ అధికారంతో వచ్చే దర్పాలన్నింటికీ దూరంగా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌కు ఇచ్చే హెరిటేజ్ బంగ్లాలోకి కూడా ఆయన మారలేదు.

అలాగే ఇంటి దగ్గర నౌకర్లను ఆయన నియమించుకోలేదని ఇటీవలే ఆర్టీఐ సమాచారంతో బయటపడింది. విరాల్ ఆచార్య కూడా అంతే ప్రభుత్వ బంగళాలో కాకుండా తలిదండ్రులే వద్దే ఉంటున్నారు. 

ఒకవేళ ఊర్జిత్ పటేల్ రాజీనామా నిర్ణయం తీసుకుంటే అదే దారిలో విరాల్ ఆచార్య కూడా నడిచే అవకాశాలే ఎక్కవగా కనిపిస్తున్నాయి. స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సెలవు పెట్టి వచ్చిన విరాల్ ఆచార్య ప్రస్తుతం కేంద్రానికి ఆర్బీఐకి మధ్య జరుగుతున్న వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్నారు. పెద్దనోట్ల రద్దు వంటి ప్రభుత్వం నిర్ణయాన్ని పటేల్ మౌనంగా ఆమోదించి అమలు చేశారు. 

దీంతో ఆర్థికవ్యవస్థ మందగించింది. ప్రభుత్వం ఆర్థికవ్యవస్థకు పునరుత్తేజాన్ని కల్పించాలని భావిస్తున్నది. ఎన్నికలకు ముందు, అందునా ఆర్థిక సేవల రంగం వివిధ స్కామ్‌లతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్‌బ్యాంక్ ఉన్నతాధికారులు ఇద్దరు రాజీనామా చేయడం అంటే ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే. ప్రభుత్వం తీసుకున్న అనేక విధాన నిర్ణయాలకు ఊర్జిత్ పటేల్ వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. 

రద్దయిన పెద్ద నోట్లలో 99 శాతం పైగా తిరిగి రావడంతో జీర్ణించుకోలేని ఆర్థికశాఖ లెక్కింపును పదేపదే లెక్కించాలంటూ చేసిన ఆదేశాలూ పటేల్‌ను ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో మొదటి నుంచి అసహనంగానే ఉన్న ఊర్జిత్ పటేల్ 19న తుది నిర్ణయం తీసుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయి.