న్యూఢిల్లీ: అంగరంగ వైభవంగా జరిగిన నరేంద్ర మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు కార్పొరేట్ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, తన సతీమణి నీతా అంబానీ, చిన్న కొడుకు అనంత్ అంబానీతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రిలయన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నాథ్వానీ విడిగా వచ్చారు. 

ఇంకా టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి, స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌, అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తదితరులు హాజరయ్యారు. 

ఇంకా టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, హెచ్‌డీఎఫ్‌సీ చెందిన దీపక్‌ పరేఖ్‌, ఎస్సార్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ రుయా, వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బీకే గోయెంకా, భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూప్‌నకు చెందిన రాకేశ్‌ భారతీ మిట్టల్‌, రాజన్‌ భారతీ మిట్టల్ తదితరులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న కార్పొరేట్ ప్రముఖులు.

టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అందరికంటే ముందుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అంతేకాదు అప్పటికే వేడుకకు హాజరైన వివిధ రంగాల ప్రముఖులు, అతిథులతో ఇష్టాగోష్టిగా రతన్ టాటా, చంద్రశేఖరన్ ముచ్చటించారు. టాటా గ్రూప్ టాప్ ఎగ్జిక్యూటివ్, టీవీ బారొన్ రజత్ శర్మ, టాటా గ్రూప్ ఇతర ఎగ్జిక్యూటివ్‌లు కూడా రతన్ టాటా, చంద్రశేఖరన్‌లతో ముందు వరుసలో కూర్చుండి పోయారు.

ఇంకా వేడుకకు హాజరైన ప్రముఖులంతా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో చర్చల్లో మునిగిపోయారు. వీడియోకాన్‌ ప్రతినిధి రాజ్‌కుమార్‌ ధూత్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఎండీ టీఎస్‌ కల్యాణరామన్‌ అయ్యర్‌, నేపాల్‌ సీజీ గ్రూప్‌ చైర్మన్‌ బినోద్‌ చౌదురి కూడా కొలువుదీరారు. 

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌, నీతి ఆయోగ్‌ సభ్యులు రమేష్‌ చంద్‌ సైతం పాల్గొన్నారు. పలువురు కార్పొరేట్‌ ప్రముఖులు మోదీతోపాటు ఆయన మంత్రి వర్గ బృందానికి అభినందనలు తెలిపారు.