ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కారు ప్రయాణంలొ కేంద్ర ప్రభుత్వానికి సీట్ బెల్టు లాంటిదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. 

ఆర్బీఐకి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మాజీ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోకపోతే ప్రమాదాలు జరుగవచ్చన్న ఆయన ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని గౌరవించాల్సిందేనని ఓ జాతీయ వార్తా చానెల్‌తో అన్నారు. 

ఓ కారులో ప్రభుత్వం డ్రైవర్‌గా అనుకుంటే ఆర్బీఐ సీట్ బెల్టు లాంటిదన్నారు.  'ఈ బెల్టును పెట్టుకోకపోతే ప్రమాదాలే. ఒక్కోసారి ప్రమాద తీవ్రత భయంకరంగానూ ఉండవచ్చు' అని అన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ ప్రాముఖ్యతను, దాని అవసరాన్ని ప్రభుత్వానికి రాజన్ చెప్పకనే చెప్పారు. ఆర్బీఐ సంస్థాగత స్వయంప్రతిపత్తిని గౌరవించాలన్న రాజన్.. ప్రభుత్వం సానుకూలంగా లేనిపక్షంలో దాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ సెంట్రల్ బ్యాంక్‌కు ఉందని గుర్తుచేశారు.

సిద్ధూలా కాదు.. ద్రవిడ్‌లా ఆడాలి
రాహుల్ ద్రవిడ్‌లా రక్షణాత్మకంగా ఆడాలిగానీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలా విమర్శలకు దిగరాదని ఆర్బీఐ బోర్డుకు రాజన్ సూచించారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య కేంద్రం తీరును క్రికెట్ పరిభాషలో విమర్శించిన నేపథ్యంలో రాజన్ కూడా అదే తరహాలో ఆయనకు హితవు పలుకడం గమనార్హం. 

ఆర్బీఐ టెస్టులు ఆడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం టీ-20 మాదిరి నిర్ణయాలతో వెళ్తున్నదని విరాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ బ్యాంకింగ్ రంగ పర్యవేక్షణలో ఆర్బీఐ తీరును తప్పుబట్టిన సంగతీ విదితమే. ఈ క్రమంలోనే రెండింటి మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. 

ఇక ఈ నెల 19న ఆర్బీఐ బోర్డు కీలక సమావేశం జరుగనున్న క్రమంలో రాజన్ తనదైనశైలిలో తన మాజీ సహచరులకు సూచనలూ చేశారు. సంస్థాగత రక్షణకే పెద్దపీట వేయాలిగానీ, ఇతరుల ప్రయోజనాలకు కాదని స్పష్టం చేశారు.

బోర్డు సభ్యుల మార్పుపై ఆందోళన 
ఆర్బీఐ బోర్డులో సభ్యుల మార్పుపై ఒకింత ఆందోళన వ్యక్తం చేసిన రాజన్.. పాతవారు చాలా సమర్థులన్నారు. ఈ తరహా విభేదాలను పెద్దవి కాకుండా చేసేవారన్నారు. ఆర్బీఐ బోర్డు సభ్యులుగా పనిచేసిన రతన్ టాటా, కుమార మంగళం బిర్లా, ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, అజీం ప్రేమ్‌జీ, జీఎం రావు, కేపీ సింగ్, సురేశ్ కృష్ణల గురించి రాజన్ పైవిధంగా స్పందించారు. 

అయితే ప్రస్తుత బోర్డులోనూ ఎన్ చంద్రశేఖరన్, దిలిప్ సంఘ్వీ, మనీష్ సభర్వాల్ వంటి సమర్థులే ఉన్నారన్న ఆయన రిజర్వ్ బ్యాంక్, కేంద్రం మధ్య మాటల యుద్ధం ఇంకా పెరుగడం తాను ఊహించలేనన్నారు.

ఎప్పటికైనా ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు శిక్ష 
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసి పారిపోవచ్చు.. కానీ చట్టం నుంచి వీరు తప్పించుకోలేరు. ఎప్పటికైనా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు శిక్ష తప్పదు. 

అయితే ఇలాంటి వారి పేర్లనూ ఎందుకు బయటకు రానివ్వడం లేదో తనకూ అర్థం కావడం లేదన్నారు రాజన్. మోసగాళ్లను శిక్షించకపోతే.. మరిన్ని మోసాలను ప్రోత్సహించినట్లే అన్నారు. కాగా, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణాలపై మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈల వ్యాపారానికి ఉన్న అవకాశాలను పెంచాలన్నారు. ముద్ర రుణాల మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) అంచనాలను మించి ఉండటం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ప్రమాదకరస్థాయికి చేరిన ఎన్‌పీఏలపైనా ఆందోళన వ్యక్తం చేశారు.