న్యూఢిల్లీ: సార్వత్రిక ఓట్ల సంరంభంలో తొలి దశ గురువారంతో ముగియనున్నది. వచ్చే ఐదేళ్లూ పాలనా పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయో తెలియాలంటే వచ్చేనెల 23 వరకూ వేచి చూడాల్సిందే. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ భారత భవిష్యత్‌ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను చిస్తున్నారు.

జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే ఉద్యోగ సృష్టిపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని రఘురామ్ రాజన్ చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే ఇవి రెండూ ఒకటేనన్నారు. 

‘తక్షణం ఎమర్జెన్సీ ఏమీ లేకున్నా మనం దశాబ్దాల నుంచీ ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం. జాతి భద్రత మన ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించలేకపోతే మనం చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని రాజన్ పేర్కొన్నారు. 

అపుడు మన మిలటరీ ఆయుధ సంపత్తిని నవీకరించుకోవడానికి కూడా వనరులు ఉండకపోవచ్చునని రాజన్ అభిప్రాయ పడ్డారు.  నిరుద్యోగ యువత తమ ఆందోళనలను బయటకు వెళ్లగక్కడం మొదలుపెడితే అది అంతర్గత రాజకీయ అనిశ్చితికి దారి తీస్తుందని హెచ్చరించారు. 

అందుకే ఏ దేశానికైనా బలమైన ఉద్యోగ సృష్టి ద్వారా లభించే ఆర్థిక వృద్ధి లేకుంటే జాతి భద్రతకు అర్థం ఉండదని రాజన్ తేల్చి చెప్పారు. ఉద్యోగాలను సృష్టించేందుకు ఎక్కువ అవకాశం ఉన్న రంగం నిర్మాణ రంగం అని రఘురామ్ రాజన్ తెలిపారు. 

అందుబాటు గృహాలు, రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, వాణిజ్య నిర్మాణాలు.. ఇవన్నీ కూడా మధ్య స్థాయి నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాలిచ్చేవేనని రఘురామ్ రాజన్ అన్నారు. మన నిర్మాణ రంగం కాస్త వెనకబడి ఉందని గుర్తు చేశారు.భూసేకరణ, రుణ లభ్యత విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయని రాజన్ పేర్కొన్నారు.

వచ్చే ప్రభుత్వం భూసేకరణ విషయంలో పలు రాష్ట్రాలు అవలంబిస్తున్న అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవాలని రఘురామ్ రాజన్ సూచించారు. వేగంగా, పారదర్శకంగా భూసేకరణ జరిగేలా చూడాలని, తద్వారా భారీ మౌలిక ప్రాజెక్టులకు నిధుల లభ్యత ఇబ్బందులు తొలగించేలా చూడవచ్చునన్నారు. 

భూ సేకరణలో డిజిటల్‌ మాప్పింగ్‌, టైట్లింగ్‌లను తీసుకురావాలన్న విషయమై చాలా ఏళ్లుగా ఈ అంశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని రాజన్ చెప్పారు. అటు ఉద్యోగాలైనా.. ఇటు వృద్ధి అయినా.. మనం మరింత మెరుగుపడాల్సి ఉందన్నదానిలో సందేహం లేదని రాజన్ కుండ బద్ధలు కొట్టారు.

ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు మందగమనం పాలవడం చూస్తే.. వినియోగ సామర్థ్యం తక్కువగా ఉందని తెలుస్తోందని రఘురామ్ రాజన్ అన్నారు. 
ఇటీవల 2.7 లక్షల ఓటర్లపై నిర్వహించిన సర్వే ప్రకారం.. మెరుగైన ఉద్యోగాలనే 47 శాతం మంది కోరుకున్నారని రాజన్ తెలిపారు. 

ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని భావిస్తున్నా.. ఓటర్లు మాత్రం ఆందోళనలో ఉన్నారని అర్థమవుతోందన్నారు. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి ఊతమిచ్చే రంగాల్లో వృద్ధి పెరగాల్సి ఉన్నదని, ఇది కొత్త తరం సంస్కరణలతోనే సాధ్యం అని రాజన్ వివరించారు. 

ప్రపంచ బ్యాంకు పరిగణించే ‘డూయింగ్‌ బిజినెస్‌’ ప్రమాణాలపై దృష్టి పెట్టడానికి బదులు మనం వాస్తవంగా వ్యాపారాలకు కావాల్సిన వాటిపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రఘురామ్ రాజన్ హితవు చెప్పారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన ప్రమాణాలన్నీ ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల ఆధారంగా తయారు చేసినవని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ప్రైవేట్ రంగంలోనూ సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉన్నదని రఘురామ్ రాజన్ నొక్కి చెప్పారు. బ్యాంకులు నిర్మాణ రంగానికి రుణాలను ఇవ్వడానికి దూరంగా ఉన్నాయని గుర్తు చేశారు. రెరా చట్టంతో పాటు మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి నిర్మాణ రంగానికి రుణాలు లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు.

గతం నుంచి కొత్త ప్రభుత్వం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని రఘురామ్ రాజన్ వివరించారు. ఏ సంస్కరణ చేపట్టినా రాష్ట్రాల నుంచి సహకారం అందితేనే అమలవుతుందన్నారు. నిర్ణయం తీసుకునేటపుడు విధాన పొరబాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు.

సంస్కరణల విషయంలో రాష్ట్రాలనూ కలుపుకుపోయి సహకార సమాఖ్య వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలకాలని రఘురామ్ రాజన్ సూచించారు. ప్రభుత్వ పథకాలను హేతబద్ధీకరించాలన్నారు. ద్రవ్యపరంగా బడ్జెట్‌ బలంగా ఉండేలా చూసుకున్నప్పుడే లక్ష్యాలను చేధించగలమని స్పష్టం చేశారు.