ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అదరగొట్టింది.
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి అదిరిపోయే, ఆకర్షణీయ లాభాలను ప్రకటించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) శుభారంభాన్నిచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్లు పురోగతి ఫలితాలతో తమ చూపు మున్ముందుకేనని టీసీఎస్ సంకేతాలిచ్చింది. అన్ని వ్యాపార విభాగాలు, విపణులు మెరుగైన పనితీరు కనబర్చడంతో అంచనాలకు మించి రాణించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటమూ కొంత కలిసొచ్చొంది. మొత్తానికి ఈ ఐటీ దిగ్గజం ప్రకటించిన ఫలితాలు అటు మిగిలిన ఐటీ కంపెనీలకు సానుకూలతలను తెచ్చిపెట్టడమే కాక ఇటు మదుపర్లలోనూ, మార్కెట్ వర్గాల్లోనూ ఉత్సాహాన్ని నింపింది.
నికర లాభంలో 23.4 శాతం పెరుగుదల
ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 23.4 శాతం పెరిగి రూ.7,340 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ రూ.5,945 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం కూడా 15.8 శాతం వృద్ధితో రూ.29,584 కోట్ల నుంచి రూ.34,261 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ లాభం 6.3 శాతం పెరగగా నికర లాభంలో 6.8 శాతం వృద్ధి నమోదైంది. టీసీఎస్ రూ.7,014.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని, ఆదాయం రూ.34,005.60 కోట్లు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
లాభాలు, ఆదాయంలోనూ అంచనాలను మించి..
ఇప్పుడు టీసీఎస్ ప్రకటించిన ఫలితాల ప్రకారం చూస్తే లాభం, ఆదాయం రెండూ అంచనాలకు మించి నమోదయ్యాయి. వేతనాల పెంపు, వీసా వ్యయాలు, స్థానిక నియామకాల నిమిత్తం వెచ్చించిన పెట్టుబడులతో నిర్వహణ మార్జిన్లపై ప్రభావం పడినా.. రూపాయి క్షీణత ఆ ప్రభావాన్ని పరిమితం చేసిందని కంపెనీ తెలిపింది.
అన్ని విభాగాల్లో దూకుడు
టీసీఎస్ ఎండీ, సీఈఓ రాజేశ్ గోపీనాధన్ మాట్లాడుతూ ఏప్రిల్- జూన్ త్రైమాసిక ఫలితాలతో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభించామనే సంకేతాలు ఇచ్చామని చెప్పారు. అన్ని విభాగాలు దూకుడుమీద ఉన్నాయని తెలిపారు. తమ బ్యాంకింగ్ సేవల విభాగం అద్భుతంగా పుంజుకున్నదని, మిగిలిన విభాగాలు వాటి వృద్ధి పథాన్ని కొనసాగించాయని చెప్పారు. ఈ త్రైమాసికంలో చేజిక్కించుకున్న వాటితో పాటు ఇప్పటికే తమచేతిలో ఉన్న భారీ ఆర్డర్లు, డిజటల్ విభాగంలో పెరుగుతున్న గిరాకీ అండతో భవిష్యత్‌లో మరింత వృద్ధి దిశగా వెళ్లేందుకు కంపెనీ సిద్ధమయ్యిందని గోపీనాథన్ ప్రకటించారు.
ఇలా డాలర్ మెరుపులు
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే టీసీఎస్ ఆదాయం డాలర్ రూపేణా 1.6 శాతం పెరిగి 505.10 కోట్ల డాలర్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రకారం ఆదాయంలో 4.1 శాతం వృద్ధి నమోదైంది. గత 15 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి. ఇక డిజిటల్ విభాగంలో వార్షిక ప్రాతిపదికన 44.8 శాతం ఆదాయం పెరిగింది. మొత్తం ఆదాయంలో ఈ విభాగ వాటా 25 శాతం వరకు ఉంటుంది. 10 కోట్ల డాలర్ల విభాగంలో కొత్తగా రెండు క్లయింట్లు, 50 లక్షల డాలర్ల విభాగంలో 13 క్లయింట్లు వచ్చాయి. కానీ నిర్వహణ మార్జిన్ మాత్రం జనవరి - మార్చి త్రైమాసికంతో పోలిస్తే 0.4 శాతం తగ్గుముఖం పట్టి 25 శాతానికి పరిమితమైంది.
రూపాయి షేర్‌కు రూ.4 మధ్యంతర డివిడెండ్
రూపాయి విలువ గల ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండు చెల్లించాలని టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఈ నెల 25కల్లా ఈ డివిడెండ్ చెల్లింపులు జరుగనున్నాయి. ఉత్తర అమెరికా వ్యాపారం గణనీయంగా పుంజుకుంది. వార్షిక ప్రాతిపదికన 7 శాతం వృద్ధి నమోదైంది. బ్రిటన్‌లో వ్యాపారాదాయం 18.7 శాతం పెరగగా, ఐరోపా వ్యాపారంలో 8.2%, ఆసియా పసిఫిక్ వ్యాపారంలో 10.8 శాతం చొప్పున వృద్ధి ఉంది.
35 శాతం పెరిగిన మహిళా ప్రాతినిధ్యం
జూన్ చివరినాటికి కంపెనీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది సంఖ్య 4,00,875కి చేరింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 35.6 శాతానికి పెరిగింది. ఐటీ సేవల విభాగంలో వలసల రేటు 0.1 శాతం తగ్గి 10.9 శాతానికి పరిమితమైంది. బీపీఎస్ విభాగంతో కలుపుకొని మొత్తం వలసల రేటు 11.7 శాతానికి తగ్గింది. గతేడాదితో పోలిస్తే బీఎఫ్‌ఎస్‌ఐ విభాగ ఆదాయం 4.1 శాతం పెరగగా, రిటైల్, సీపీజీలో 12.8% విద్యుత్, యుటిలిటీ విభాగంలో 30.9% మేర వృద్ధి నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన ఈ మూడు విభాగాల ఆదాయం వరుసగా 3.7%, 3.6%, 5.2% చొప్పున పెరిగాయి.
ఇక ఇన్ఫోసిస్ వంతు
ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో టీసీఎస్ రికార్డు లాభాన్ని నమోదు చేసి అదరగొట్టడంతో మదుపర్ల చూపు దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌పై పడింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెలువరించనుంది. మొదటి త్రైమాసికం సాధారణంగానే ఐటీ కంపెనీలకు సానుకూలం కావడం ఇన్ఫోసిస్‌కు కలిసిరానుంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత విక్రయాలు దాదాపు 6 శాతం పెరిగే అవకాశం ఉంది. త్రైమాసికం లాభంపై వేతనాల పెంపు, అధిక వీసా ఖర్చుల ప్రభావం పడొచ్చు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా డాలర్, స్టెర్లింగ్ పౌండ్, యూరోలు బలంగానే ఉండటంతో ఇన్ఫోసిస్ అమ్మకాల వృద్ధి అంతంతమాత్రమే కానున్నది.
