జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా నిలిచింది. వారికి సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా నిలిచింది. వారికి సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. 

తమవంతు సహకారం అందిస్తూ దాతృత్వం చాటుతున్నారు. అమర జవాన్ల కుటుంబాల బాధ్యత తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. జవాన్ల పిల్లల చదువు, ఉద్యోగంతో పాటు కుటుంబం బాధ్యత కూడా తీసుకుంటామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

‘పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిని రిలయన్స్‌ కుటుంబం తీవ్రంగా ఖండిస్తోంది. దేశ ఐక్యతను ఏ చెడు శక్తి విడగొట్టలేదు. అమర జవాన్ల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఈ విపత్కర పరిస్థితుల్లో జవాన్ల కుటుంబాలకు, భద్రతాబలగాలకు అండగా ఉంటాం’ అని ఫౌండేషన్ తెలిపింది. 

‘అమర జవాన్ల గౌరవార్థం వారి కుటుంబాల బాధ్యత తీసుకునేందుకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ సిద్ధం. వారి పిల్లలకు చదువు, ఉద్యోగాల బాధ్యత మాది. దాడిలో గాయపడిన జవాన్లకు చికిత్స అందించేందుకు మా ఆసుపత్రి కూడా సిద్ధంగా ఉంది. దీంతో పాటు భద్రతా బలగాలకు సేవ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వాటిని మా భుజాలపై మోస్తాం’ అని రిలయన్స్‌ ఫౌండేషన్‌ భరోసా ఇచ్చింది.

ఇదిలా ఉంటే జనవరిలో భారత్ నుంచి ఎగుమతులతోపాటు వాణిజ్య లోటు పెరిగింది. జనవరిలో భారత ఎగుమతులు 3.74శాతం పెరిగాయని.. అదే సమయంలో వాణిజ్య లోటు 14.73బిలియన్‌ డాలర్లకు చేరిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

గతేడాది జనవరిలో 25.41బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరగ్గా.. ప్రస్తుత సంవత్సరం జనవరిలో ఎగుమతులు 26.36బిలియన్‌ డాలర్లకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వశాఖ వెలువరించిన సమాచారంలో పేర్కొంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, లెదర్‌, జెమ్స్‌, జ్యూయలరీ రంగాల ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది.