న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాలు ఏవైనా కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెలలోనే కొనేయండి. ఎందుకంటే వచ్చే నెల నుంచి వాటి ధరలు అమాంతం పెరగనున్నాయి. ఇటీవల ముగిసిన పండుగ సీజన్‌లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడానికి తమ లాభాలను తగ్గించుకుని విక్రయించిన సంస్థలకు నిరాశే ఎదురైంది. దీంతోపాటు ఉత్పాదక వ్యయం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటం, కస్టమ్ డ్యూటీ పెరిగినా దీని ప్రభావాన్ని వినియోగదారులకు బదలాయించకుండా ప్రస్తుత పండుగ సీజన్‌లో ధరలను యథాతథంగా ఉంచాయి. వస్తువులు అమ్ముడు పోక ఫలితంగా లాభాలు దారుణంగా పడిపోయాయి. కానీ రోజురోజుకు ఈ భారం తడిసి మోపెడవుతున్నది. దీంతో సమీక్ష చేసుకున్న కన్జూమర్ డ్యూరబుల్ మేకర్స్ ప్రస్తుతానికి ఉత్పత్తి వ్యయాలను భరించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల నుంచి మాత్రం టీవీలు, గృహోపకరాల ఉత్పత్తుల ధరలను 7-8 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే పలు సంస్థలు ధరలను పెంచాయి. ఇదే జాబితాలోకి పానాసోనిక్ చేరింది. గత కొన్ని రోజులుగా రూపాయి బలపడుతున్నప్పటికీ ఉత్పాదక వ్యయంపై కలిగే ప్రభావాన్ని పరిశీలించిన తర్వాతేనే ధరలను 5 శాతం నుంచి 7 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ తెలిపారు. పండుగ సీజన్ ముగిసిన తర్వాత ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు హెయిర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. ఇదే సమయంలో తక్కువ లాభంతో వ్యాపారం నిర్వహించడం చాలా కష్టమని భావించి వెంటనే ధరల పెంపుకు మొగ్గుచూపినట్లు ఆయన చెప్పారు.

ఓనంతో ప్రారంభమైన పండుగ సీజన్ దసరా, దీపావళి వరకు కొనసాగింది. ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలు మూడోవంతుకు పడిపోయాయి. సెప్టెంబర్‌లోనే ధరలు 3-4 శాతం వరకు పెంచడంతో అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడిందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియన్స్ మాన్యుఫ్యాక్షరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) తెలిపింది. డిమాండ్ లేకపోవడంతో రెండు నెలల క్రితం ధరలను పెంచినా ఎలాంటి ప్రభావం చూపలేదని, ఈ పండుగ సీజన్‌లో మార్కెట్ వాటాను పెంచుకోవడానికి సంస్థలు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు. వరదలతోకేరళలో ఓనం పండుగ అమ్మకాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయన్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి టీవీ ధరలను పెంచే ఉద్దేశమేది తమకు లేదని సోనీ ప్రకటించింది. రూపాయి క్షీణించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వినియోగదారుల వస్తువులు, ఎలక్ట్రానిక్స్ రంగం, వాషింగ్ మెషిన్లు విభాగాలు నిలకడైన వృద్ధిని నమోదు చేసుకున్నాయి. వీటిలో టీవీ, ఏసీల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోగా, రిఫ్రిజిరేటర్ అమ్మకాలు ఫ్లాట్‌గా ముగిశాయి.