ముంబై: 123 సంవత్సరాల క్రితం నాటి బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి చెందిన బ్రాడీపేటలోని శాఖ మూతపడే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. గత జనవరి, ఫిబ్రవరిలో వెలుగు చూసిన నీరవ్ మోదీ కుంభకోణం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన మార్కెట్ విలువలో సగానికి పైగా కోల్పోయింది. 

ఈ నేపథ్యంలోనే బ్రాడీ హౌస్ శాఖలో పనితీరుపై పూర్తి స్థాయి నియంత్రణ విధించే అవకాశం ఉన్నది. తద్వారా దేశవ్యాప్తంగా తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఉద్యోగులతోపాటు భారీ ఖాతాలను మరోచోటికి మారుస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై పీఎన్‌బీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు.

ఆభరణాలతో పరారయ్యేందుకు ఇలా మొహుల్ చోక్సీ యత్నం
మెహుల్ చోక్సీ, ఆయన సోదరుడు చేతన్ చోక్సీలు సుమారు రూ.110 కోట్లు విలువ చేసే ఆభరణాలను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకుపోవాలని చూశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు ఆధారంగా తెలుస్తున్నది. 

రూ.13,600 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ, గీతాంజలి జెమ్స్ అధినేత కూడా అయిన మెహుల్ చోక్సీలు ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. బ్యాంక్ ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ కేసును నమోదు చేయగా, అంతకంటే ముందే జనవరి తొలివారంలోనే నీరవ్, చోక్సీ  కుటుంబ సభ్యులతోసహా దేశం విడిచి పారిపోయారు. 

దుబాయిలో ఆభరణాలతో పరారీకి ఇద్దరి ప్రయత్నాలు
దుబాయ్ (యూఏఈ)లోని గీతాంజలి వెంచర్స్ డీఎంసీసీ కార్యాలయానికి చేరుకున్న చేతన్ చోక్సీ అక్కడి నుంచి 16 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.110 కోట్లు) విలువైన ఆభరణాలను తీసుకెళ్లాలని చూశారు. కానీ దీన్ని అక్కడి సిబ్బంది అడ్డుకున్నట్లు ఈడీ తమ చార్జిషీటులో పేర్కొన్నది. 

ఇదంతా ఫిబ్రవరిలోనే జరిగిందని స్పష్టం చేసింది. ఆ సమయంలో కార్యాలయం లాకర్‌లో 13 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలున్నాయని, రిటైల్ ఔట్‌లెట్లలో మరో 3 మిలియన్ డాలర్ల విలువైన నగలున్నాయని డీఎంసీసీ ఉపాధ్యక్షుడు డియాన్ లిల్లీ వైట్ చెప్పినట్లు ఈడీ తెలిపింది. చాలావరకు నిధులను చోక్సీ విదేశాలకు మళ్లించారని, విమానాల్లోనే ఎక్కువగా ఎగుమతి లావాదేవీలను జరిపారని పేర్కొన్నది. 

ఫ్యుజిటివ్ ట్యాగ్ కోసం ఈడీ ఇలా యత్నాలు

మెహుల్ చోక్సీపై పారిపోయిన ఆర్థిక నేరగాడి ముద్రను వేసేలా ముంబై ప్రత్యేక కోర్టును ఈడీ ఆశ్రయించనున్నది. తద్వారా రూ.6,000 కోట్లకుపైగా చోక్సీ ఆస్తులను వెంటనే జప్తు చేయాలని భావిస్తున్నది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు.. గత నెల 28న ఈడీ నమోదు చేసిన చార్జిషీటు, నేరారోపణల ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలోనే త్వరలో ఫ్యుజిటివ్ ట్యాగ్ కోసం కోర్టుకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.