Asianet News TeluguAsianet News Telugu

‘డైమండ్’తో షో: పీఎన్బీకి ఇలా నీరవ్ మోదీ బురిడి!

వజ్రాల వ్యాపారం చేస్తున్నామని నమ్మబలికి.. వారం ‘షో’ చేసి పీఎన్బీని నమ్మించారు నీరవ్ మోదీ ఆయన మేనమామ మెహుల్ చోక్సీ.. ఒక్కసారి అండర్ టేకింగ్, లెటర్ ఆఫ్ క్రెడిట్ పొందే వరకు ఈ నాటకం సాగించారు. అంతా అయిపోయాక ఇటు వారిద్దరూ దేశం విడిచి పారిపోయారు. అమెరికాలోని నీరవ్ మోదీ సంస్థలు దివాళా పిటిషన్ దాఖలు చేశాయి.

PNB fraud: US bankruptcy court examiner nails Nirav Modi's aides
Author
Mumbai, First Published Aug 31, 2018, 10:58 AM IST

పసుపు నారింజ వర్ణ శోభితమైన ఓ చక్కటి జిగేల్మనే వజ్రం ఓ ప్రభుత్వ రంగ బ్యాంకును నిలువునా ముంచే మహామోసంలో ఓ కీలక పాత్ర పోషించింది. దాని బరువు కేవలం మూడు క్యారెట్లు. దీన్ని రూపొందించింది నీరవ్ మోదీ సంస్థ ఫైర్ స్టార్ డైమండ్స్. దీని సాయంతోనే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో స్కాం చేశాడు. 

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా అండర్ టేకింగ్ ముసుగులో పీఎన్బీకి ఈ రూ.14,000 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే.  ఈ స్థాయిలో నీరవ్, చోక్సీలు బ్యాంకును ఎలా మోసగించారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.

కానీ ఓ అమెరికా దివాలా పరిశీలకుడి నివేదిక ద్వారా నీరవ్ అతితెలివి, పీఎన్బీ అమాయకత్వం బయటపడింది. అసలు సంగతికొస్తే తన వద్దనున్న వజ్రాలను వివిధ దేశాల్లోని తన డొల్ల కంపెనీల మధ్యే అటుఇటు తిప్పుతూ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నదని పీఎన్బీ అధికారుల ముందు నీరవ్ ‘షో’ చేశాడు. 2011లో దాదాపు ఐదారు వారాలు జరిగిన ఈ తంతు సాయంతో పీఎన్బీ నుంచి లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ), లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ)లను ఇట్టే పొందాడు.

ఈ నెల 25న దాఖలైన ఈ నివేదిక ప్రకారం 20కిపైగా గుల్ల కంపెనీల ద్వారా విదేశాల నుంచి భారత్‌లోకి వజ్రాలు, రత్నాలను నీరవ్ దిగుమతి చేసుకుంటున్నట్లు తేలింది. వజ్రాలు, రత్నాలను సానబెట్టడంలో గొప్ప నైపుణ్యం కల కుటుంబ వ్యక్తి అయిన నీరవ్ మోదీ (47).. కేట్ విన్‌స్లెట్, ప్రియాంకా చోప్రా వంటి హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలకు నగలు అంటగడుతూ ప్రాచుర్యంలోకి వచ్చాడు. 

ఈ క్రమంలోనే న్యూయార్క్ సిటీ, మకావూ, సింగపూర్, బీజింగ్, లండన్‌లలో లగ్జరీ బొటిక్‌లను తెరిచిన నీరవ్.. ప్రధానంగా ఒకే ఒక ఫ్యాన్సీ ఎల్లో ఆరెంజ్ కట్ డైమండ్‌తో పీఎన్బీని ముగ్గులోకి దింపాడని దివాలా పరిశీలకుడు జాన్ జే కార్నీ తన నివేదికలో పేర్కొన్నారు.

2011 ఆగస్టులో అమెరికాలోని ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ ద్వారా హాంకాంగ్‌లోని ఫ్యాన్సీ క్రియేషన్స్ కంపెనీకి చేరిన ఈ వజ్రం.. రెండు వారాల తర్వాత సోలార్ ఎక్స్‌పోర్ట్ ద్వారా మళ్లీ ఫైర్‌స్టార్‌కు చేరింది. వారం వ్యవధిలోనే హాంకాంగ్‌కు వచ్చింది.

రెండు వారాల తర్వాత యూఏఈలోని వరల్డ్ డైమండ్ డిస్ట్రిబ్యూషన్‌కు తిరిగి అమ్ముడైంది. ఈ సంస్థలన్నీ నీరవ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న సంస్థలు, గుల్ల కంపెనీలే. 1,83,000 డాలర్ల విలువైన ఈ వజ్రాన్ని గరిష్ఠంగా 1.16 మిలియన్ డాలర్లకు అమ్మినట్లు లెక్కలు చూపారు. ఈ క్రమంలోనే పీఎన్బీ నుంచి ఎల్‌వోయూ, ఎల్‌వోసీలను కొల్లగొట్టారు. 

ఇలా తక్కువ విలువ కలిగిన ఎన్నో వజ్రాలను తమ షెల్ కంపెనీల ద్వారా ఎక్కువకు అమ్మినట్లు చూపి మొత్తం రూ.14,000 కోట్లను జేబులో వేసుకుని మామా అల్లుళ్లు పారిపోయారు. అల్లుడు నీరవ్ మోదీ లండన్ లో తల దాచుకుంటే, మెహుల్ చోక్సీ భారతదేశంతో అప్పగింతల ఒప్పందం లేని అంటిగ్వాలో తిష్ట వేసేందుకు పౌరసత్వం పొందాడు. ఇది మన కార్పొరేట్ అవినీతి పరుల బాగోతం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దాదాపు 120 రోజుల పాటు జరిపిన అమెరికా దివాలా పరిశీలకుడి దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అమెరికా కేంద్రంగా నీరవ్ మోదీ అనుయాయులు ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ అండ్ ఫాంటసీ సీఈఓ మిహిర్ భన్సాలీ, ఫైర్ స్టార్ (అమెరికా) సీఎఫ్ఓ అజయ్ గాంధీతోపాటు ఏ జఫ్ఫే తదితర సంస్థలు ఈ మోసంలో భాగస్వాములని తేలింది. ఫిబ్రవరిలో కుంభకోణం బయటపడగానే అమెరికాలోని ఫైర్ స్టార్ డైమండ్ అండ్ ఫాంటసీ, ఏ జప్పే సంస్థలు దివాళా పిటిషన్ దాఖలు చేశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios