వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కొత్తగా అమలులోకి రానున్న పీఎఫ్ నిబంధనల ప్రకారం.. రూ. 2.5 లక్షలకు పైన ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే పీఎఫ్ మొత్తంపై ట్యాక్స్ పడనుంది.  

పీఎఫ్​ ఖాతాదారులకు అలర్ట్​. మరో రెండు మరో మూడు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రానుంది. దీనితో కొత్త రూల్స్​ కూడా అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా పీఎఫ్​ ఖాతాల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాలో అధికంగా జమ చేసేవారిపై పన్ను విధించి ఉద్దేశంతో ఈ మార్పులను తీసుకురానుంది ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్పులను నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పీఎఫ్​ ఖాతాలను రెండుగా విభజించ‌నుంది. అందులో ఒకటి పన్ను వర్తించేది కాగా.. రెండోది పన్ను మినహాయింపు ఉండేది.

2021 ఆగస్ట్ 31న సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్‌లో రూ. 2.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం పన్ను పడుతుంది. అంటే రూ.2.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. యజమానులు పీఎఫ్ కంట్రిబ్యూట్ చేయనప్పుడు ఈ పరిమితి సంవత్సరానికి రూ.5 లక్షలుగా ఉంటుంది. రూ.2.5 లక్షలకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ కలిగిన వారు పీఎఫ్ ఖాతాను రెండు విభాగాలుగా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే రూ.2.5 లక్షల వరకు ఒక అకౌంట్‌లో, మిగతా డబ్బులు మరో అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాల్సి రావొచ్చు. అప్పుడు ఈ అదనపు అకౌంట్‌పై ట్యాక్స్ పడుతుంది. 

కొత్త పీఎఫ్ నిబంధనలు

- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్​ ఖాతాలు.. ట్యాక్సబుల్​, నాన్​ ట్యాక్సబుల్ అనే క్యాటగిరీలుగా విడిపోతున్నాయి.

- 2021 మార్చి 31 నాటికి క్లోజ్ అయిన అకౌంట్లకు కూడా ఈ నింబంధనలను వర్తిస్తాయని కూడా ప్రభుత్వం పేర్కొంది.

- కొత్త నిబంధ‌నల ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల కన్నా ఎక్కువగా.. ఉద్యోగి వాటా జమ అయితే వారు ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. భారీగా ఆదాయం గడించే వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అదనపు పన్ను భారం పడనుంది.

- ఇక పన్ను పరిధిలోకి వచ్చే ఖాతాదారులకు.. ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలు కూడా నిలిచిపోనున్నాయి. తక్కువ ఆదాయం వచ్చే వారికి సహాయం చేసేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

- కొత్త పీఎఫ్ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి.

- ఏడాదికి రూ.2.5 లక్షలకు మించిన ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఆదాయంపై కొత్త పన్ను విధించేందుకు ఐటీ నిబంధనలకు కొత్త సెక్షన్ 9డీని తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ద్వారా సులభంగా పన్ను పరిధిలోకి వచ్చే వారిని గుర్తించొచ్చని కేంద్రం గతంలో పేర్కొంది.