న్యూఢిల్లీ: గత 14 రోజులుగా కేంద్ర ముడి చమురు సంస్థలు పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర ముడి చమురు సంస్థలు శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. 

లీటర్ పెట్రోల్ మీద 56 పైసలు, డీజిల్ మీద 64 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ నెల ఏడో తేదీ నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.7.11, డీజిల్ ధర రూ.7.67 పెరిగింది. 

ఫలితంగా శుక్రవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.81 నుంచి రూ.78.37కు, లీటర్ డీజిల్ ధర రూ.76.48 నుంచి రూ.77.06లకు చేరుకున్నది. కరోనాతో విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలు అల్లాడుతుంటే ఊరటనివ్వాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్‌దే.

కానీ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడానికి కారణాలేమిటి? ఒకసారి పరిశీలిద్దాం..అంతర్జాతీయ విపణిలో తగ్గిన ధరల ప్రభావం దేశీయ ధరలపై ప్రభావం చూపకపోవడానికి కారణాలేమిటో తెలుసుకుందాం..

కరోనా మహమ్మారితో భారీ స్థాయిలో ఉద్యోగులు ఉపాధి కోల్పోయి బాధితులైన ప్రస్తుత తరుణంలో గోటిచుట్టూ రోకటిపోటులా ఇంధన ధరలు పెరిగిపోవడానికి మరింత భారంగా మారింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణారంగంతోపాటు ఇతర రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నది. అసలు ఇంధన ధరలు పెరిగి పోతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

కేంద్ర చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు దేశీయ చమురు ధరలను అనుసంధానించాయి. అయితే, అంతర్జాతీయ విపణిలో తగ్గిన ధరల ప్రభావం దేశీయంగా కనిపించడం లేదు. గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పతనం అయ్యాయి. 

మన దేశీయ మార్కెట్లలో ఆ స్థాయిలో తగ్గుదల మాత్రం కనిపించలేదు. పైగా గత 13 రోజులుగా క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ధరలు పెరుగుతున్నాయి. దాదాపు 95 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దీనికి తోడు బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఈ నెల ఒకటో తేదీ నుంచి మళ్లీ తగ్గుతున్నాయి. 

భారతదేశంలో చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణ వదులుకోవడం వాస్తవ పరిస్థితుల్లో కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఆ భారం వినియోగదారుడితో పంచుకోవడంలో అర్థం పరమార్థం ఉంటుంది. కానీ అదే ధరలు అంతర్జాతీయంగా పతనమైన సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం పన్నులను పెంచడంతో సర్కారుకు అదనపు ఆదాయం లభిస్తుంది. 

also read పెరిగిన బంగారం ధరలు... రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం.. ...

చివరకు ఉన్న ధరలను కొనసాగించడమే కస్టమర్‌కు పెద్ద ఊరడింపు అన్న పరిస్థితి కలుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఇంధన ధరలపై నియంత్రణు వదులుకున్న తర్వాత కూడా అంతిమంగా అత్యధిక లాభం ప్రభుత్వాలకే వెళుతున్నది. కొంత చమురు సంస్థలకు వెళుతుంది. 

గతంలో చమురు ధరలను ప్రభుత్వం పూర్తిగా నియంత్రించేది. వీటితోపాటు కిరోసిన్, ఎల్పీజీ ధరలు ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. 2002లో తొలిసారి విమానాలకు వినియోగించే ఏటీఎఫ్‌పై ప్రభుత్వం నియంత్రణను వదులుకుంది. 2010లో పెట్రోల్, 2014లో డీజిల్‌పై ప్రభుత్వం తన నియంత్రణను వదిలేసింది. కిరోసిన్, ఎల్పీజీ గ్యాస్ ధరలు మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి.

భారతదేశంలోని చమురు సంస్థలన్నీ అన్నిరకా ముడి చమురును ప్రాసెస్ చేయలేవు. ముడి చమురులోనూ సోర్ గ్రేడ్, స్వీట్ గ్రేడ్ అనే రకాలున్నాయి. సోర్ గ్రేడ్ చమురులో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండగా, స్వీట్ గ్రేడ్ చమురులో 0.5 శాతం కంటే తక్కువ ఉంటుంది. స్వీట్ గ్రేడ్‌ను బ్రెంట్ క్రూడ్ అని అంటారు.

ఫిబ్రవరిలో ముడి చమురు ధర బ్యారెల్ ధర 55 డాలర్లు కాగా, మార్చి ప్రారంభం నాటికి 35 డాలర్లకు పతనమైంది. మార్చిచివరికల్లా 20 డాలర్లలకు పతనమైనా మళ్లీ పుంజుకుని 37 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తక్కువ ఉన్న 82 రోజులుగా దేశీయంగా ఎటువంటి మార్పులు జరుగలేదు. ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రతిరోజూ చార్జీలు పెంచి వేస్తున్నది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు ఎక్సైజ్ సుంకం పెంచి వేసింది. మార్చి మొదటి వారంలో ఒకసారి, మే ఐదో తేదీన రెండోసారి పెంచింది. మే 5వ తేదీన లీటర్ పెట్రోల్ మీద రూ.13, లీటర్ డీజిల్ మీద రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు పన్నులు పెంచాయి. 

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం పెంచినా పెంపు భారం ప్రజలపై పడబోదని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పెట్రోల్ ధరలు పెరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఎక్సైజ్ సుంకం పెంపు ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది.

ఫిబ్రవరి మొదటి వారం నాటికి పెట్రోల్ మీద 107 శాతం, డీజిల్ మీద 69 శాతం పన్నులు వసూలు చేశారు. వీటిల్లో ఎక్సైజ్ సుంకం, వ్యాట్ ఉన్నాయి. తొలిసారి మార్చి నెలలో పన్నులు పెంచాక పెట్రోల్ మీద 134 శాతం, డీజిల్ మీద 88 శాతానికి చేరుకున్నది. 

రెండోసారి మే 5వ తేదీన పెంచిన తర్వాత పెట్రోల్ మీద 260 శాతం, డీజిల్ మీద 256 శాతం ఎక్సైజ్ సుంకం పెరిగింది. ఇటలీ, జర్మనీల్లో 65 శాతం, బ్రిటన్‌లో 62 శాతం, జపాన్‌లో 45 శాతం, అమెరికాలో 20 శాతం మాత్రమే పన్నులు ఉన్నాయి.