Asianet News TeluguAsianet News Telugu

ఇక మోదీ సర్కార్‌కు సంకటం: మళ్లీ పెట్రో మంట ఖాయం!

సార్వత్రిక ఎన్నికల ముంగిట ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్, నాన్-ఒపెక్ దేశాలు అంగీకారానికి రావడం కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కు సంకట స్థితే. కేంద్ర ప్రభుత్వానికి ఇంధన సెగ తప్పకపోవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Opec to cut output, government may face heat before 2019 polls
Author
Delhi, First Published Dec 9, 2018, 11:18 AM IST

ధరల పతనాన్ని అడ్డుకునేందుకు ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్, రష్యా తదితర నాన్-ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. దీంతో వచ్చే ఏడాది తొలి ఆరు నెలలు (జనవరి-జూన్) ప్రస్తుత ఉత్పత్తితో పోల్చితే రోజుకు 12 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గిపోనున్నది.

దీంతో చమురు దిగుమతి దేశాలకు, ముఖ్యంగా ఎన్నికలకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలే బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సంక్షోభం, ఆర్బీఐతో విభేదాల సమస్యలతో సతమతమవుతున్న బీజేపీ సర్కారుకు ఒపెక్ ప్రభావంతో ఇంధన ధరలు పెరిగితే తిప్పలు తప్పవనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) సభ్య దేశాలు, నాన్-ఒపెక్ దేశాలు నిర్ణయించడంతో భారత్‌కు మళ్లీ ఇంధన ధరల ఇక్కట్లు తప్పేలా లేవు.

దాదాపు రెండు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్షీణిస్తున్న క్రూడాయిల్ ధరల పతనాన్ని అడ్డుకునేందుకు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్, రష్యా తదితర నాన్-ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా మార్కెట్‌లోకి చమురు సరఫరా తగ్గి, డిమాండ్ పెరిగి ధరలు పుంజుకుంటాయని ఆయా దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

రోజువారీగా 1.2 మిలియన్ (12 లక్షల) బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని శుక్రవారం వియన్నాలో జరిగిన సమావేశంలో ఒపెక్, నాన్-ఒపెక్ సభ్య దేశాలు తీర్మానించిన సంగతి విదితమే. నిజానికి ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన అమెరికా వద్దంటున్నా.. మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చేందుకు ఒపెక్, నాన్ ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోతకు సిద్ధమయ్యాయి. 

దీంతో వచ్చే ఏడాది జనవరి-జూన్‌లో ప్రస్తుత ఉత్పత్తితో పోల్చితే రోజుకు 12 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గిపోనున్నది. ఇందులో ఒపెక్ దేశాలు 8 లక్షల బ్యారెళ్లు, నాన్-ఒపెక్ 4 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తికి కోత పెట్టనున్నాయి. ఈ మొత్తం భారత రోజువారీ ఇంధన వినియోగంలో పావు శాతానికి సమానం. 

ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతులతోనే తీరుతున్నాయి. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లోని ముడి చమురు ధరలు దేశీయ ఇంధన ధరల్ని అత్యధికంగా ప్రభావితం చేస్తుంటాయి. నిన్నమొన్నటిదాకా పెట్రోల్, డీజిల్ ధరలు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిల్లో పలుకడానికి గల కారణమూ ఇదే.

పైగా 2014, నవంబర్ 12 నుంచి 2016, జనవరి 31 వరకు ప్ర భుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా తొమ్మిదిసార్లు పెంచడంతో వినియోగదారులపై లీటర్ పెట్రోల్‌పై రూ. 9.94, డీజిల్‌పై రూ. 11.71 మేర భారం పడింది.

విదేశీ విపణిలో బ్యారెల్ క్రూడ్ ధర 100 డాలర్ల దరిదాపుల్లోకి కదలడంతో దేశీయ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలూ రూ.100 వైపు పరుగులు పెట్టాయి. కానీ ఇప్పుడు అదే క్రూడ్ విలువ 60 డాలర్ల సమీపానికి దిగడంతో.. దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు శాంతించాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఊపిరిపీల్చుకోగలిగింది. 

గ్లోబల్ మార్కెట్ తీరు చమురు ఉత్పత్తి దేశాలను కలవరపెడుతున్న నేపథ్యంలో ఉత్పాదక దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగానే ఉత్పత్తి తగ్గుదల నిర్ణయం వెలువడింది. 15 దేశాల ఒపెక్ ఉత్పాదక సామర్థ్యం.. మొత్తం ప్రపంచ క్రూడ్ సరఫరాలో 40 శాతంగా ఉన్నది. దీనివల్ల చమురు దిగుమతి దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు వణుకు పుట్టిస్తున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం.. భారత్‌కు బాగా కలిసొచ్చింది. కాగల కార్యం గంధర్వులే తిర్చారన్న ఇంధన ధరల సెగను గ్లోబల్ క్రూడ్ ధరల క్షీణతే అడ్డుకున్నది. అయితే అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఒపెక్ ఉత్పత్తి కోత నిర్ణయం ఇప్పుడు కేంద్రానికి నిద్ర పట్టకుండా చేస్తున్నది. 

పార్లమెంట్ ఎన్నికలు మరో 6-7 నెలల్లో జరుగనుండగా, పెట్రో ధరలు మళ్లీ భగ్గుమంటే మోదీ సర్కార్ విజయావకాశాలనే దెబ్బతీసే వీలున్నది. ఒపెక్ నిర్ణయంతో శుక్రవారం ఒక్కరోజే బ్యారెల్ క్రూడ్ ధర 5 శాతం పుంజుకుని 63 డాలర్లకు చేరింది. ఇక ఉత్పత్తి తగ్గితే అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ మార్కెట్లలో ధరలు దూసుకుపోవడం ఖాయం. 

పెట్రో ధరల దెబ్బకు ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనల్ని గతంలో మనం చూశాం. అందుకే రాజకీయ పార్టీలకు ఇది అత్యంత సున్నితాంశం. ముఖ్యంగా ఎన్నికల వేళ పెట్రో ధరల్ని అస్సలు తేలిగ్గా తీసుకోవు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పెట్రో ధరలు ఆయుధంలా మారకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.1.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకున్న విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు చమురు మార్కెటింగ్ సంస్థలూ రూపాయి చొప్పున ధర తగ్గించాయి. దీనికితోడు బీజేపీ పాలిత రాష్ర్టాలు మరో రూ.2.50 తగ్గింపును ప్రకటించడంతో ధరలు చాలాచోట్ల అదుపులోకి వచ్చాయి. కానీ ఒపెక్ తాజా నిర్ణయంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

Follow Us:
Download App:
  • android
  • ios