బెంగళూరు: భారత్‌లో రోజుకోజుకీ డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్నాయి. ఈ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకొనేందుకు ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా ఓ అడుగు ముందుకు వేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ), వీసా భాగస్వామ్యంతో భారత్‌లో తన తొలి  క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టింది. 

డిజిటల్ పేమెంట్స్ వాలెట్ ‘పేటీఎం’ తర్వాత ఇలా క్రెడిట్‌ కార్డు ప్రవేశపెట్టిన సంస్థ ఓలా కావడం గమనార్హం. 2022 నాటికి కోటి ఓలా క్రెడిట్‌ కార్డులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 

వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఓలా యాప్‌ ద్వారా ఈ క్రెడిట్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. లైఫ్‌టైం వ్యాలిడిటీతో వస్తున్న ఈ క్రెడిట్‌ కార్డులతో ఎక్కువ మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌, రివార్డ్‌ పాయింట్స్‌ను అందిస్తోందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ విధమైన చెల్లింపు విధానంతో వినియోగదారులకు ఒక ఉత్తమమైన సేవలు లభిస్తాయని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్ చేసుకోవచ్చు.

వినియోగదారులకు అత్యున్నత సేవలు అందించేందుకు ఓలా సిద్ధంగా ఉందని కంపెనీ సీఈవో, సహా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.  2015లో ఓలా మనీ వ్యాలెట్‌, 2016లో ఓలా క్రెడిట్‌ సదుపాయాలను సంస్థ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

ఆర్థికపరమైన సేవల్లో భాగంగా వ్యాలెట్‌, పోస్ట్‌ పెయిడ్‌ బిల్లింగ్‌, ఓలా రైడ్స్‌నకు మైక్రో ఇన్సూరెన్స్‌,  తదితర సేవలను సమీప భవిష్యత్‌లో అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు  కంపెనీ ప్రతినిధులు తెలిపారు.