న్యూఢిల్లీ: ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో మరో చేదు గుళిక వంటి వార్త. కుప్పల్లా పెరిగిపోతున్న మొండి బాకీల దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కుదేలవుతున్నాయి.

2016 నవంబర్‌ ఎనిమిదో తేదీన కేంద్రం పెద్ద నోట్ల రద్దు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశీయ బ్యాంకింగ్ రంగ సంస్థలకు అక్షరాల రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 2014-15 నుంచి ఆయా సంస్థల నుంచి రూ.100 కోట్లకు పైగా రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన 416 మంది మొండి బకాయి దారులు చెల్లించాల్సిన మొత్తం ఇది. 

సరాసరిగా ఒక్కోక్కరు రూ.424 కోట్లకు పైగా రుణాలు చెల్లించాల్సి ఉంది. ద్రవ్యలోటుతో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వానికి రిజర్వు బ్యాంక్ అందించనున్న డివిడెండ్‌ రూ.1.76 లక్షల కోట్లకు ఇది సమానం. 

సమాచార హక్కు చట్టం ప్రకారం రిజర్వు బ్యాంక్‌ను అడిగిన ప్రశ్నకు ఈ విషయం తెలిసింది. 2015-2018 మధ్య ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య బ్యాంకులు నికరంగా రూ.2.17 లక్షల కోట్లు నష్టపోయాయి. వీటిలో తొలి ఏడాది 109 మంది రుణ గ్రహీతలకు చెందిన రూ.40,798 కోట్ల రుణాలను రద్దుచేసిన ప్రభుత్వరంగ బ్యాంకులు.. 2016 మార్చి 31 నాటికి 199 మంది మొండి బకాయిదారుల రూ.69,976 కోట్లు రద్దు చేశాయి.

భారీగా రుణాలను రద్దు చేస్తున్నా బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఏడాది ఏడాదికి అంతకు పెరుగుతున్నాయి. నల్లధనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.

ఇదే సమయంలో మొండి బకాయిలు అంతకంతకు పెరిగాయి. అంతకుముందు 343 మొండి బకాయి దారులు ఉండగా, ఆ తర్వాత మరో 144 మంది జత అయ్యారు. పెద్ద నోట్ల రద్దు చేసిన నాటి కంటే ముందు రూ.69,926 కోట్లుగా ఉన్న రుణాల రద్దు ఆ తర్వాత ఏకంగా రూ.1,27,797 కోట్లకు పెరిగాయి. 
అంటే నికరంగా మొండి బాకీలు రూ.57,821 కోట్లు పెరిగినట్లు అయ్యాయి. గతేడాది మార్చి 31 నాటికి రుణాలు తీసుకొన్ని ఎగ్గొట్టిన వారి సంఖ్య 525కి చేరారు. ఇదే సమయంలో మొండి బకాయిలు రూ.1.27 లక్షల కోట్ల నుంచి రూ.2.17 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

2014 సెప్టెంబర్ నాటి కంటే ముందువున్న మొండి బకాయిల వివరాలు మాత్రం సెంట్రల్ బ్యాంక్ వెల్లడించలేదు. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు ఉన్నది బ్యాంకుల వ్యవహారం. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి తిరిగి వసూలు చేయడంలో మాత్రం విఫలమయ్యాయి. 
బ్యాంకులు కేవలం 15-20 శాతం వరకు మాత్రమే రుణాలను రికవరీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో రుణాలు తీసుకున్న వారు తిరిగి కట్టలేక చేతులెత్తేసిన వారి నుంచి రుణాలను వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నా నిరాశే మిగిలింది.