ముంబై: దేశంలో మొండి బాకీల వల్ల బ్యాంకింగ్‌ రంగానికి నెలకొన్న ముప్పు తొలిగిపోలేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నదని పెద్ద బ్యాంక్‌ 'భారతీయ రిజర్వు బ్యాంక్‌' (ఆర్బీఐ) తాజాగా వెల్లడించిన ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులే ఇందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది.

ఆర్బీఐ వార్షిక నివేదిక-2017-18 ప్రకారం మార్చినెలాఖరు నాటికి బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు 12.1 శాతానికి ఎగిశాయని భారతీయ రిజర్వు బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో 2018-19లోనూ బ్యాంకుల మొండి బాకీల నిష్పత్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ నివేదిక హెచ్చరించింది. 


2015 మార్చి నాటికి బ్యాంకుల స్థూల మొండిబాకీలు రూ.3,23,464 కోట్లు నమోదయ్యాయి. గత మార్చి నెలాఖరు నాటికి మొండి బాకీల విలువ రూ.10,35,528 కోట్లకు ఎగిశాయని ఆర్‌బీఐ తెలిపింది. మూడేళ్ల కాలంలోనే మొండి బాకీలు రూ.6.2 లక్షల కోట్ల మేర పెరగడం విశేషం.

ఈ పరిస్థితులు బ్యాంకుల మూలధన కల్పనపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. భారీ మొండి బాకీలతో నష్టాల్లో ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆర్బీఐ ఇప్పటికే పలు దిద్దుబాటు చర్యలను చేపట్టిందని ఈ నివేదక గుర్తు చేసింది. మొండి బాకీల పరిష్కారానికి విధివిధానాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసిన ఆర్బీఐ.. పారిశ్రామికోత్పత్తి పెరగడంతో పాటు సానుకూల వర్షాలు వృద్ధి రేటుకు మద్దతునివ్వొచ్చని పేర్కొంది. దీంతో వృద్ధికి తోడ్పాటు లభించొచ్చని వ్యాఖ్యానించింది. వ్యవసాయ రంగం మెరుగైన ప్రగతిని కనబర్చడంతో పాటు తయారీ, గనుల రంగం పుంజుకోవడం ద్వారా జీడీపీకి మద్దతు లభించయనున్నదని పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరంలో రూ.64,106 కోట్ల రికవరీ
మార్చితో ముగిసిన గత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థలు రూ.64,106 కోట్ల మొండి బాకీలను రికవరీ చేశాయని ఈ నెల 24న సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ పిటిషన్‌కు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. అంతకు ముందు 2016-17లో రూ.53,250 కోట్లు, 2015-16లో రూ.40,903 కోట్ల చొప్పున బ్యాంక్‌ రికవరీలు నమోదైనట్లు ఆర్బీఐ తెలిపింది. 

మరోమారు బ్యాంకుల విలీనం
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులాంటి బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలను మరింత వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే పెద్దనోట్ల రద్దు, నగదు కొరత వంటి విషయాల్లో చేతులు కాల్చుకొని ప్రజల్లో ప్రతిష్ట పోగొట్టుకున్న సర్కారు.. తాజాగా మరిన్ని బ్యాంకులను విలీనం చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే తీవ్ర మొండి బాకీలు, అంతకంతకు పెరుగుతోన్న మొండి బాకీలతో సతమతం అవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను పూర్తిగా నిర్వీర్యం చేసేలా సర్కారు ఆలోచనలు సాగుతున్నట్టుగా సమాచారం. ఇందుకోసం మోడీ సర్కార్‌ మరోమారు బ్యాంకుల విలీనంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగంలోని 21 బ్యాంకులను ఏ విధంగా విలీనం చేస్తే లాభదాయకంగా ఉంటుందో కసరత్తు చేసి జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కేంద్రం ఆర్‌బీఐని కోరినట్టుగా సమాచారం.