ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను క్రమబద్ధీకరించడంతో గత ఏడాది (2017-18) కాలంలో 1000 ఏటీఎంలు మూత బడ్డాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదికలో తెలిపింది. 2016-17లో దేశంలో 2.08 లక్షల ఏటీఎంలు సేవలందిస్తూ ఉండగా 2017-18కు వాటి సంఖ్య 2.07 లక్షలకు తగ్గింది. చివరకు సంబంధిత బ్యాంకు శాఖల వద్ద ఉండే ఏటీఎంల సంఖ్య కూడా 1.09 లక్షల నుంచి 1.06 లక్షలకు చేరుకున్నదని ఆర్బీఐ తన నివేదికలో వివరించింది.

ఇక ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు లక్ష నుంచి 98,545కు పరిమితం అయ్యాయి. 2017-18లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు 1.48 లక్షల నుంచి 1.45 లక్షలకు తగ్గాయని ‘ట్రెండ్స్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ ఇన్‌ 2017-18’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ తెలిపింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు మాత్రం 58,833 నుంచి 60,145కు పెరగడం గమనార్హం.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఏటీఎంల సంఖ్య 2.04 లక్షల (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు మినహాయించి)కు పడిపోయిందని ఆర్బీఐ పేర్కొంది. ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు పెరిగిపోవటంతోనే బ్యాంకులు ఏటీఎంలను గణనీయంగా తగ్గించుకున్నాయని తెలిపింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పాయింట్స్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టెర్మినళ్ల ఏర్పాటు గణనీయంగా పెరిగిపోయిందని నివేదిక పేర్కొంది. 

మరోవైపు ఇటీవలి సంవత్సరాల్లో వైట్‌ లేబుల్‌ ఏటీఎంల సంఖ్య పెరిగిపోయిందని, 2017-18లో వీటి సంఖ్య 15,000 మార్కును చేరిందని ఆర్బీఐ తెలిపింది. 2013-14లో ప్రీ పెయిడ్‌ చెల్లింపుల విధానం ద్వారా లావాదేవీలు కేవలం రూ.8,100 కోట్లయితే 2017-18 నాటికి 1.42 లక్షల కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా లావాదేవీలు రూ.157.90 కోట్లు పెరిగి రూ.2.67 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపింది.

బ్యాంకుల స్థూల మొండి బాకీలు (ఎన్‌పీఏలు) గత ఆర్థిక సంవత్సరం (2017-18) ముగిసే నాటికి 11.2 శాతం మేరకు పెరిగి రూ.10.39 లక్షల కోట్లకు చేరినట్లు నివేదికలో తెలిపింది.ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బాకీలు రూ.8.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర మొండి బాకీలు (ఎన్‌పీఏలు) తగ్గాయి. ఈ ఏడాది మార్చిలో రూ.9.62 లక్షల కోట్ల మొండి బాకీలు ఉండగా.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఇవి రూ.23,000 కోట్లకు పైగా తగ్గాయని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.60,726 కోట్ల బకాయిలను వసూలు చేశాయని తెలిపారు.

రికవరీపై దృష్టి, పెద్ద మొండి పద్దులను రైటాఫ్‌ చేయటంతో ప్రైవేట్‌ బ్యాంకులు స్థూల మొండి బాకీలను గణనీయంగా తగ్గించుకున్నాయని ఆర్బీఐ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జెమ్స్‌ అండ్‌ జువెలరీ విభాగంలో స్థూల మొండి బాకీలు భారీగా పెరిగాయని తెలిపింది. ఇందుకు నీరవ్‌ మోదీ కుంభకోణమే ప్రధాన కారణమని తెలిపింది. 2017-18లో 80 శాతం మోసాలు రూ.50 కోట్లకు అంతకుపైబడినవేనన్నది. ఒత్తిడిలో ఉన్న ఆస్తులకు పరిష్కారం కనుగొనటంతోపాటు వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కొత్త ముసాయిదా రూపకల్పనపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.

మొండి పద్దులు భారీగా పెరిగిపోవటం, వీటి కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేపట్టటం, మూలధన అవసరాల కోసం ఏదైనా మినహాయింపులు ఇవ్వటం.. బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని ఆర్బీఐ హెచ్చరించింది. క్యుములేటివ్‌ డిఫాల్ట్‌ రేట్లు (సీడీఆర్‌), రికవరీ రేట్ల ఆధారంగా వివిధ క్రెడిట్‌ ఎక్స్‌పోజర్స్‌ కోసం బాసెల్‌-3 నిబంధనలు రిస్క్‌ వెయిట్స్‌ను సిఫారసు చేస్తాయని తెలిపింది. 

అంతర్జాతీయ సగటు కంటే సీడీఆర్‌, లాస్‌ గివెన్‌ డిఫాల్ట్‌ (ఎల్‌జీడీ) రేట్లు ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకుల మూలధనం తక్కువగా ఉంటే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేమని తెలిపింది. అంతేకాకుండా కట్టడి చేయాలని చూస్తే బ్యాంకులతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని పేర్కొంది.
 
11 ప్రభుత్వ రంగ బ్యాంకులపై సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) తీసుకోవటంతో ఆ బ్యాంకుల్లో మొండి పద్దులు అంతంత మాత్రంగా పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. మొండి పద్దులు భారీగా పెరిగిపోవటంతో ఈ బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పీసీఏతోగా ఈ బ్యాంకులు రికవరీపై ప్రధానంగా దృష్టిసారించాయని తెలిపింది. దీంతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడిందని తెలిపింది.


పోస్టల్ బ్యాంకులో 19 లక్షల ఖాతాలు ప్రారంభం
ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఇప్పటి వరకు దాదాపు 19 లక్షల ఖాతాలు తెరిచింది. ఈ బ్యాంకు కార్యకలాపాలు 2017 జనవరిలో ప్రారంభమయ్యాయి. ఈ బ్యాంకులో ఈ ఏడాది ఈ నెల 20 వరకు దాదాపు 9,75,806 లావాదేవీలు జరిగినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఢిల్లీ, గుజరాత్‌, తదితర రాష్ర్టాల్లో ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయి.

పబ్లిక్‌ ఇష్యూకు ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు
పబ్లిక్‌ ఇష్యూకు ఆరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే సమయంలో కేఐఓసీఎల్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థిక వ్యవహారాలు చూసే కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఐపీఓకు రానున్న ఆరు ప్రభుత్వ రంగ సంస్థల్లో టెలికమ్యూనికేషన్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా (టీసీఐఎల్‌), రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌సీ), టీహెచ్‌డీసీ ఇండియా, వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (వాప్కోస్‌), ఎఫ్‌షీఐ ఆరావళి జిప్సం అండ్‌ మినరల్స్‌ (ఎఫ్‌ఏజీఎంఐఎల్‌) ఉన్నాయి. ఇక కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ (కేఐఓసీఎల్‌) ఎఫ్‌పీఓతో రానుంది.