పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీకి మరో షాక్ తగిలింది. దీంతోపాటు నీరవ్‌ భార్య అమీ మోదీపై పీఎంఎల్‌ఏ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. మరోవైపు పీఎన్‌బీ కేసులో నీరవ్ భార్య అమీ పాత్రపై అనుమానాలతో ఈడీ చేసిన అభ్యర్థన మేరకు ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్‌నూ కోర్టు ఈ సందర్భంగా జారీ చేసింది.

గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట రూ.13 వేల కోట్ల మేరకు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, ఆయన ఇతర కుటుంబ సభ్యులు అక్రమాలపై ‘నిఘా’ మొదలైందని తెలియగానే విదేశాలకు పరారయ్యారు.

నీరవ్ మోదీ గతేడాది జనవరి ఆరో తేదీన దేశాన్ని విడిచి పెట్టారు. తర్వాత ఐదు రోజులకు నీరవ్ బాటలో ఆయన భార్య అమీ మోదీ విదేశాలకు చెక్కేశారు. కాగా, నీరవ్‌కు సంబంధించిన కొన్ని వస్తువులను వేలం వేయడానికి పీఎంఎల్‌ఏ నుంచి ఈడీకి అనుమతి లభించింది.

దీంతో నీరవ్ మోదీకి చెందిన 173 పెయింటింగ్స్, 11 వాహనాలను ఈడీ అమ్మేయనున్నది. ఈ మేరకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి కూడా లభించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖర్లో వీటిని బహిరంగ వేలం వేయనున్నట్లు చెప్పాయి.

నీరవ్ మోదీ పెయింటింగ్స్ రూ.57.72 కోట్ల విలువను కలిగి ఉంటాయని అంచనా. అలాగే స్వాధీనం చేసుకున్న కార్లలో రోల్స్ రాయిస్, పోర్షే, మెర్సిడెజ్ వంటి లగ్జరీ వాహనాలు, టయోటా ఫార్చ్యునర్ ఉన్నాయి. ఇదిలావుంటే నీరవ్‌పై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ చేస్తున్న దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన 68 పెయింట్ల వేలానికీ కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

ఇదిలా ఉంటే లండన్ నగరంలోని ఓ మెట్రో బ్యాంక్ శాఖలో కొత్త ఖాతా తెరిచేందుకు నీరవ్ వచ్చినట్లు చెబుతున్న స్కాట్లాండ్ పోలీసులు.. ఆ బ్యాంక్‌లోని క్లర్క్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అక్కడకెళ్లి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పీఎన్బీ కేసు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రచారం జరిగిన నేపథ్యంలో దానిపై అవగాహన ఉన్న సదరు క్లర్క్ నీరవ్ సమాచారం అందించారు.

కాగా, ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లండన్‌లో ఉన్న నీరవ్ మోదీని అప్పగించాలంటూ బ్రిటన్ హోం శాఖకు విజ్ఞప్తి చేసింది.
దీన్ని ఈ నెలారంభంలో అక్కడి హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ ధ్రువీకరించడంతో వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఇటీవలే అరెస్ట్ వారెంట్‌నూ జారీ చేసిన సంగతి విదితమే. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే నీరవ్‌ను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. 

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జీ మ్యారీ మల్లోన్ ఎదుట పోలీసులు బుధవారం నీరవ్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నీరవ్ బెయిల్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీలో రిమాండ్‌కు ఆదేశించింది. 

భారత్ తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్).. నీరవ్ చేసిన మోసానికి బ్రిటన్ చట్టాల ప్రకారం కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని, జీవిత ఖైదు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని కోర్టులో వాదించింది. ఈ క్రమంలోనే నీరవ్‌కు బెయిల్ ఇవ్వరాదని కోరింది.

గతేడాది జనవరిలో నీరవ్ లండన్‌కు వచ్చాడని, తన పాస్‌పోర్టునూ భారత ప్రభుత్వం ఆ సమయంలోనే రద్దు చేసిందని, ఇతర దేశాల పాస్‌పోర్టులపై తిరుగుతున్నాడని కోర్టుకు సీపీఎస్ వివరించింది. మొత్తం మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, యూఏఈ, సింగపూర్, హాంకాంగ్ దేశాల నివాస గుర్తింపు కార్డులూ ఉన్నాయన్నది. ఈ క్రమంలో బెయిల్ వస్తే మళ్లీ నీరవ్ పారిపోవచ్చని జడ్జి అనుమానాలను వ్యక్తం చేశారు.

ఇక నీరవ్ తరఫున బారిష్టర్ జార్జ్ హెప్‌బుర్న్, ఆనంద్ దూబేలు వాదిస్తుండగా, దూబే విజయ్ మాల్యా కేసులోనూ వాదిస్తుండటం గమనార్హం. బెయిల్ కోసం 5 లక్షల పౌండ్ల పూచీకత్తును నీరవ్ లాయర్లు ఆఫర్ చేశారు. మరోవైపు విజయ్ మాల్యా కేసు తరహాలోనే ఈ కేసూ తయారవుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9, 000 కోట్ల రుణాల ఎగవేత కేసులో మూడేళ్ల క్రితం 2016 మార్చిలో లండన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి మాల్యా (63), 2017 ఏప్రిల్‌లో ఇలాగే అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పొందగా, ఇప్పటివరకు దానిపైనే దర్జాగా తిరిగేస్తున్నాడు. 

గత నెల భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ ఆదేశంపైనా ఉన్నత న్యాయస్థానాల్లో  మాల్యా అప్పీలు చేసుకుంటున్నసంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నీరవ్ మోదీ అరెస్ట్‌ చేయడాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. 

భారత్‌కు నీరవ్‌ను త్వరగా అప్పగించేలా చర్యలు తీసుకుంటామని విదేశాంగశాఖ తెలిపింది. నిరుడు జనవరిలో దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ.. ఏడాదికిపైగా తప్పించుకు తిరుగుతున్నాడు. నీరవ్‌ మోదీని పట్టుకునేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఇంటర్‌పోల్‌నూ ఆశ్రయించాయి. 

ఎప్పట్నుంచో లండన్‌లోనే ఉన్నాడంటున్న దర్యాప్తు సంస్థల అనుమానాలు ఇటీవలే రుజువయ్యాయి. లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లోగల సెంటర్ పాయింట్ టవర్ బ్లాక్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్‌లో నివాసముంటున్న నీరవ్.. అక్కడే జ్యుయెల్లరీ బొటిక్‌నూ నడిపిస్తున్నాడని తేలింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు విదేశాలకు వెళ్లి తలదాచుకుంటున్నాడు. 

కొద్ది రోజుల క్రితం నీరవ్ మోదీ బ్రిటిష్‌ మీడియా కంట పడ్డాడు. లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌ వీధిలో నీరవ్‌మోదీని టెలిగ్రాఫ్‌ పాత్రికేయుడు గుర్తించి పలు ప్రశ్నలు సంధించాడు. అన్నింటికి నీరవ్‌ ‘నోకామెంట్‌’ అంటూ సమాధానమిచ్చాడు. అనంతరం పాత్రికేయుడి నుంచి తప్పించుకునేందుకు నీరవ్‌ ప్రయత్నించాడు. తొలుత ఓ క్యాబ్‌ ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ క్యాబ్‌ డ్రైవర్‌ నిరాకరించాడు. అనంతరం మరో క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ నెల 29వ తేదీ వరకు నీరవ్‌కు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో లండన్‌లోని అత్యంత రద్దీగల హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్ జైలులో ఉంచనున్నారు. అక్కడ నీరవ్‌కు ప్రత్యేక సెల్ ను ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. 

ప్రస్తుతం 20 వేల పౌండ్ల (రూ.18 లక్షలు) నెలసరి జీతంతో లండన్‌లోని డైమండ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నట్లు నీరవ్ కోర్టుకు తెలిపాడు. పన్నులను చెల్లిస్తున్నానని, నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్‌నూ చూపారు. అయితే తప్పించుకోవడంలో భాగంగానే, అక్కడి పౌరుడినని చాటుకునేలా నీరవ్ ఇదంతా చేశాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, తెల్ల షర్టు, ట్రౌజర్స్‌తో నీరవ్ కోర్టులో కనిపించాడు.