Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్‌కు షాక్: టీసీఎస్ మినహా అన్ని ‘బ్లూచిప్స్’కు నష్టాలే

సార్వత్రిక ఎన్నికల తీరు, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం తదితర అంశాలతో అనిశ్చితి మధ్య సాగిన స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా కోతకు గురైంది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తప్ప టాప్ 10 సంస్థలన్నీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.60 లక్షల కోట్లు నష్టపోయాయి. 
 

Nine Of Top 10 Firms Lose Rs 1.60 Lakh Crore In Market Cap
Author
Mumbai, First Published May 13, 2019, 11:17 AM IST

ముంబై: గత వారం టాప్-10 విలువైన కంపెనీల్లో తొమ్మిది సంస్థలు నికరంగా రూ.1.60 లక్షల కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టపోయింది. కానీ, ఐటీ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ మాత్రం లాభపడింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.99,212.9 కోట్లు కోల్పోయి రూ.7,92,680.96 కోట్లకు చేరుకున్నది. దీంతో రూ.8,01,340.52 కోట్ల మార్కెట్ విలువతో టీసీఎస్ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.19,634 కోట్లు తగ్గగా, హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.13,573.5 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.10,974 కోట్లు, ఐటీసీ రూ.7,232.6 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ.4,409 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.3,364.07 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.1,233.88 కోట్లు, ఎస్‌బీఐ రూ.981.71 కోట్లు కోల్పోయాయి.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 23న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, వీటికితోడు అంతర్జాతీయ దేశాల్లో వేగంగా మారుతున్న పరిస్థితులు, చమురు ధరలు కూడా తమవంతు పాత్ర పోషించనున్నాయని ఎపిక్ రీసర్చ్ సీఈవో ముస్తాఫా నదీమ్ తెలిపారు. 

ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, లుపిన్, బజాజ్ ఆటో, హిందాల్కోలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత విడుదలైన పారిశ్రామిక ప్రగతి గణాంకాలు సోమవారం మార్కెట్ కదలికలపై ప్రభావం చూపనున్నాయి. మార్చి నెలకు పారిశ్రామిక వృద్ధిరేటు 21 నెలల కనిష్ఠ స్థాయి 0.1 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఉత్పాదక రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితులు ఇందుకు అద్దం పడుతున్నాయి. 

గత వారంలో సెన్సెక్స్ 1,500 పాయింట్లు లేదా 3.85 శాతం పడిపోయి 37,462.99 వద్ద స్థిరపడింది. ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ దేశాల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ గణాంకాలు, కార్పొరేట్ల త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు స్టాక్‌మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలతో గడిచిన వారంలో భారీగా పతనమైన సూచీలు ఈ వారంలోనూ ఈ ప్రభావం కొంతమేర ఉండవచ్చునని, ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు కూడా ప్రభావం చూపే అంశాలని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 

ప్రస్తుతం అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం, ఎన్నికల మధ్య కీలక మ్యాచ్ జరుగుతున్నదని, కార్పొరేట్ల ఫలితాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయని సామ్‌కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ ఫౌండర్, సీఈవో జిమ్మత్ మోదీ అన్నారు. సోమవారం విడుదలకానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు స్టాక్ మార్కెట్లకు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios