Nifty 50 @ 20,000: చరిత్రలో తొలిసారిగా 20 వేల పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టీ ఇండెక్స్..కారణాలు ఇవే..
G20 సమావేశాల అనంతరం మార్కెట్ బలంగా దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలో దేశీయ ఇండెక్స్ NSE నిఫ్టీ 50 నేటి ట్రేడింగ్ సెషన్‌లో అపూర్వమైన 20,000 పాయింట్ల మార్క్‌కు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రికార్డులు నమోదు అయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలలో అద్భుతమైన ర్యాలీ కనిపించింది. సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడగా, తొలిసారిగా నిఫ్టీ 20,000 పాయింట్లను దాటింది. నేటి ట్రేడింగ్ లో, దాదాపు అన్ని రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి. బ్యాంక్, ఫైనాన్షియల్, ఐటీ, ఆటో, రియల్టీ, మెటల్, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి సహా నిఫ్టీలో చాలా సూచీలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 563 పాయింట్లు ఎగబాకి 67162 వద్ద సెటిల్ అయ్యింది. కాగా నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 19997 పాయింట్ల వద్ద సెటిల్ అయ్యింది. హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 30కి చెందిన 24 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నేటి టాప్ గెయినర్స్‌లో హెచ్‌సిఎల్‌టెక్, టాటామోటార్స్, విప్రో, ఎన్‌టిపిసి, సన్‌ఫార్మా, ఎస్‌బిఐ ఉన్నాయి. టాప్ లూజర్లలో INFY, TITAN, HINDUNILVR, BHARTIARTL ఉన్నాయి.
20 వేల పాయింట్ల నిఫ్టీ ప్రయాణం ఇదే..
దేశీయ ఇండెక్స్ NSE నిఫ్టీ 50 నేటి ట్రేడింగ్ సెషన్‌లో అపూర్వమైన 20,000 వేల మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ 50 సూచీ జూన్ 28, 2023న మొదటిసారిగా 19,000 స్థాయిని జయించింది. గత ఆరు నెలల్లో, ఇండెక్స్ 16 శాతం కంటే ఎక్కువ పెరిగింది, అయితే నిఫ్టీ 50 గత నెలలో దాదాపు 2.5 శాతం పెరిగింది. 52 వారాల కనిష్ట స్థాయి 16,747 నుండి, బెంచ్‌మార్క్ 19.4 శాతం పెరిగి 75 రోజుల్లో 20,000 పాయింట్లకి చేరుకుంది.
నిఫ్టీ 20,000 పాయింట్లను తాకడం గత మార్కెట్ డైనమిక్స్‌కు ప్రతిబింబం అని నిపుణులు చెబుతున్నారు. బలమైన కార్పొరేట్ ఆదాయాలతో పాటు సానుకూల గ్లోబల్ సూచనలు, గణనీయమైన విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఫలితంగా సూచీలు బలంగా కదిలినట్లు అంచనా వేశారు. ఐటీ, బ్యాంకింగ్ రంగాల ద్వారా కూడా సూచీ వేగంగా కదిలినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ బలమైన ర్యాలీ కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. 20,000 వంటి మైలురాళ్లను సాధించడం వెనుక ఆర్థిక సరళీకరణ విధానాలు, గ్లోబల్ లిక్విడిటీ, నిర్మాణాత్మక సంస్కరణలు, డిజిటలైజేషన్‌తో సహా చారిత్రక కారకాలు ఆధారపడి ఉన్నట్లు చెబుతున్నారు.