ఏప్రిల్ 18 నుంచి బ్యాంకులను  గంట ముందుగానే తెరవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆదేశించింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు సోమ‌వారం నుంచి బ్యాంకులు రోజూ ఉదయం 9 గంటల నుండి పనిచేయడం ప్రారంభించాయి. ఆర్బీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు సామాన్యులకు ఎంతో మేలు చేయనున్నాయి. 

బ్యాంకింగ్ కస్టమర్లకు శుభవార్త. సోమ‌వారం నుంచి బ్యాంకు కస్టమర్లకు అదనపు పని గంటలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులు తెరిచే సమయాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మార్చింది. సోమవారం నుంచి అంటే ఏప్రిల్ 18, 2022 నుంచి మార్చిన ఈ సమయాలు అమల్లోకి తీసుకొచ్చింది. మార్చిన సమయాలతో సోమవారం నుంచి బ్యాంకులు ఉదయాన్నే 9 గంటలకే తెరుచుకున్నాయి. అయితే బ్యాంకు క్లోజింగ్ సమయాలను మాత్రం ఆర్‌బీఐ మార్చలేదు.

కరోనా వైరస్ మహమ్మారితో.. బ్యాంకులు తెరిచే సమయాలను ఆర్‌బీఐ తగ్గించింది. ప్రస్తుతం పరిస్థితులన్ని సాధారణ స్థాయికి రావడంతో.. ఈ కొత్త ఫెసిలిటీని సోమ‌వారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పాటు తన నియంత్రణలో నడిచే మార్కెట్ల ట్రేడింగ్ సమయాలలో కూడా ఆర్‌బీఐ మార్పులు చేసింది. కొత్త ట్రేడింగ్ సమయాలు కూడా సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఆర్‌బీఐ నియంత్రణలో నడిచే మార్కెట్లు, కాల్ మనీ, గవర్న్‌మెంట్ పేపర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్ల రెపో, రూపీ వడ్డీ రేట్ల డెరివేటివ్స్ అన్నింటికి ఈ మార్చిన సమయాలు అమల్లోకి వచ్చాయి. సోమవారం నుంచి ఉదయం 9 గంటలకే ఈ మార్కెట్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇన్ని రోజులు ఉదయం 10 గంటలకు వీటి ట్రేడింగ్ మొదలయ్యేది. ఆర్‌బీఐ నియంత్రణలో నడిచే మార్కెట్ల ట్రేడింగ్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు సాగనుంది.

బ్యాంకింగ్ సేవల వినియోగం పెరిగిపోవడంతో తరుచుగా బ్యాంక్‌లు కిక్కిరిసిపోతున్నాయి. వినియోగదారులు తమ పనిని పూర్తి చేయడానికి గంటల తరబడి లైన్‌లో నిలబడవలసి వస్తోంది. అలాగే చాలా మందికి ఆఫీసు సమయం, బ్యాంకులు తెరిచే సమయం ఒక్కటే కావడంతో బ్యాంకు పనిని పూర్తి చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి 9 గంటలకు బ్యాంకు ప్రారంభం కానుండటంతో వారికి మేలు చేకూరనుంది. తొందరగా బ్యాంకింగ్ పనులు ముగించుకుని ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సామాన్య పౌరులు ఎక్కువ సేపు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగస్థులకే ఎక్కువ లబ్థి చేకూరనుంది.

కరోనా వైరస్ వ్యాప్తికి ముందుగానే బ్యాంకులు ఉదయం 9 గంటలకు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆర్‌బీఐ గతంలోనే నిర్ణయించింది. కానీ కరోనా వ్యాప్తితో, బ్యాంకు సమయాన్ని మళ్లీ మార్చారు. బ్యాంక్ ప్రారంభ సమయాన్ని 10 గంటలుగా నిర్ణయించారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గడం.. ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను సడలించడంతో ఇప్పుడు బ్యాంకులు మునుపటి సమయానికి అంటే ఉదయం 9 గంటలకు మళ్లీ ప్రారంభం కానున్నాయి.