Asianet News TeluguAsianet News Telugu

ఇదో హెచ్చరిక: జాన్సన్ బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్ ముప్పు

ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ.. చిన్నారుల అందాలకు సొగసులద్దే జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి ఉత్పత్తయ్యే టాల్కం పౌడర్ భవిష్యత్‌లో వారి ప్రాణానికే ముప్పుగా పరిణమించనున్నది.

Nearly $4.7 billion awarded in Johnson & Johnson baby powder lawsuit

వాషింగ్టన్: ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ.. చిన్నారుల అందాలకు సొగసులద్దే జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి ఉత్పత్తయ్యే టాల్కం పౌడర్ భవిష్యత్‌లో వారి ప్రాణానికే ముప్పుగా పరిణమించనున్నది. అమెరికాలో పేరొందిన ఈ సంస్థ ఉత్పత్తి చేసిన టాల్కం పౌడర్ వల్ల మహిళలు అండాశయ కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారనేది ఆ ముప్పు. ఈ సమస్యతో బాధపడుతూ 22 మంది మహిళలు చేసిన న్యాయ పోరాటం ఫలించింది.

సెయింట్ లూయిస్‌లోని సర్క్యూట్ న్యాయస్థానం సదరు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై 4.7 బిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. పిటిషన్లు దాఖలు చేసిన 22 మంది మహిళలకు, వారి కుటుంబాలకు ఈ జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి చేస్తున్న టాల్కం పౌడర్‌కు వ్యతిరేకంగా బాధితులు విజయం సాధించిన కేసిది. టాల్కం పౌడర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ ఖనిజ లవణాలతో కూడిన పొడిని, ఆస్బెస్టాస్‌ను కలగలిపి విక్రయిస్తోంది. ఆస్బెస్టాన్ క్యాన్సర్ కారకమని ఈ కేసు విచారణ సందర్భంగా వైద్య నిపుణులు రుజువు చేశారు కూడా. 

బాధిత మహిళలు, వారి కుటుంబాలకు సదరు పౌడర్ వల్ల నష్టం జరిగినందున 4.14 బిలియన్ల డాలర్లు, పరిహారం కింద 550 మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ యాజమాన్యం మాత్రం ఈ కేసు విచారణ జరిగిన తీరు అనుచితంగా ఉన్నదని చెప్పుకొచ్చింది. మిస్సోరీలో మరణించిన పలువురు మహిళల పేరిట దాఖలైన పిటిషన్‌ను విచారించడం తగదని వ్యాఖ్యానించింది. సంస్థ అధికార ప్రతినిధి కరోల్ గూడ్రిచ్ మాట్లాడుతూ ‘మా ఉత్పత్తుల్లో అండాశయ క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ లేనే లేదు. సర్క్యూట్ న్యాయస్థానం తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేస్తాం’ అని తెలిపారు.

జాన్సన్ అండ్ జాన్సన్ 40 ఏళ్లకు పైగా తమ ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ పొడిని కలుపుతున్న సంగతిని దాచిపెడుతూ వచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది మార్క్ లానియర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్, షోవర్ టు షోవర్ ఉత్పత్తుల్లో సంస్థ వాడుతున్న ప్రధాన పదార్థం ఆస్బెస్టాస్ అని తేలింది. పిటిషన్లు దాఖలు చేసిన పలువురు మహిళల అండాశయాల్లో ఆస్బెస్టాస్, టాల్కం పౌడర్ కణాలు స్పష్టంగా బయటపడ్డాయని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. 

ఇప్పటివరకు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై 9000 మందికి పైగా మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పౌడర్ అండాశయ క్యాన్సర్ కారకమని వారు ఆరోపించారు. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ యాజమాన్యం మాత్రం తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు కలుపడం లేదని పదేపదే చెబుతోంది. తాజాగా జరిగిన విచారణలో పిటిషన్లు దాఖలు చేసిన 22 మంది మహిళల్లో ఆరుగురు మరణించారు.

పిటిషనర్లలో ఐదుగురు మిస్సోరి వాసులు కాగా, అరిజోనా, న్యూయార్క్, నార్త్ డకోటా, కాలిఫోర్నియా, జార్జియా, కారోలినాస్, టెక్సాస్ రాష్ట్రాల పౌరులు. మిస్సోరికి చెందిన గెయిల్ ఇంఘాం (73) కూడా ఒక పిటిషనర్. ఆమె మూడోదశ అండాశయ క్యాన్సర్ వ్యాధి సోకడంతో 1985 నుంచి 1990వ దశకం ప్రారంభం వరకు చికిత్స పొందారు.

కొన్ని దశాబ్దాలుగా జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్‌ను గెయిల్ ఇంఘాం వాడుతూ వచ్చారు. కానీ అందులో అండాశయ క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ వల్ల పొంచి ఉన్న ముప్పును యావత్ ప్రజలకు తెలిపేందుకే పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకించి మహిళలు తమ పిల్లలకు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వాడవద్దని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios