మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ అనుకున్నది సాధించారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటానని ప్రకటించిన 10 రోజులకు కీలక పరిణామం జరిగింది. ట్విట్టర్ బోర్డుతో ఎలాన్ మస్క్ చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ డీల్ కుదుర్చుకున్నారు. 

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేశారు. ట్విట్టర్ మొత్తాన్ని 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. ఒక్కో ట్విట్టర్ షేర్‌కు 54.20 డాలర్లు ఇచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్ షేర్ ధర 51.70 వద్ద ఉంది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో వాటాలు కొనుగోలు చేయడం, ఆ తర్వాత దీనిని పూర్తిగా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచడం, షేర్ హోల్డర్లు కూడా మొగ్గు చూపడం వంటి వివిధ పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ షేర్ గత కొద్దిరోజుల్లోనే 30 శాతానికి పైగా ఎగిసింది.

వారేమన్నారంటే..?

ట్విట్టర్ ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే లక్ష్యాన్ని, ఔచిత్యాన్ని కలిగి ఉందని, మా టీమ్ పట్ల తాము ఎంతో గర్వంగా ఉన్నామని, అదే సమయంలో ఎలాన్ మస్క్ ప్రతిపాదన పట్ల ట్విట్టర్ బోర్డు సమగ్రమైన సమాలోచన జరిపిందని, ప్రతిపాదిత ట్రాన్సాక్షన్ గణనీయమైన నగదు ప్రీమియంను అందిస్తుందని, ఇది ట్విట్టర్ స్టేక్ హోల్డర్లకు ఉత్తమమైన మార్గమని తాము విశ్వసిస్తున్నామని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ ఇండిపెండెంట్ బోర్డ్ చైర్ బ్రెట్ టేలర్ అన్నారు.

ట్విట్టర్.. మస్క్ సొంతం 

ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాలను కొనుగోలు చేశారు మస్క్. దీంతో ఆయన ట్విట్టర్‌లో రెండో అతిపెద్ద వాటాదారు అయ్యారు. ట్విట్టర్‌లో 10.3 శాతం వాటాతో వాన్‌గార్డ్ గ్రూప్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు మొత్తం వాటాలను మస్క్ కొనుగోలు చేశారు. నిన్నటి వరకు టాప్ 5 షేర్ హోల్డర్లలో వాన్ గార్డ్ గ్రూప్, ఎలాన్ మస్క్, మోర్గాన్ స్టాన్లీ, బ్లాక్ రాక్ ఇంక్, స్టేట్ స్ట్రీట్ కార్ప్ వరుసగా ఉన్నాయి. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంస్థ మొత్తాన్ని తన ఆదీనంలోకి తీసుకున్నారు. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ఈ ఒప్పందం కుదిరింది. వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్‌ను తీర్చి దిద్దుతానని మస్క్ ప్రకటించారు.

ట్విట్టర్ షేర్ జంప్ 

ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారనే వార్తల నేపథ్యంలో ట్విట్టర్ షేర్ క్రితం సెషన్‌లో దాదాపు 6 శాతం పెరిగింది. 5.66 శాతం లేదా 2.77 డాలర్లు లాభపడి 51.70 వద్ద ముగిసింది. ఫేస్‌బుక్, టిక్ టాక్‌తో పోలిస్తే తక్కువ మంది యూజర్లు ఉన్నప్పటికీ ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేథావి వర్గం ఖాతాలతో ట్విట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది.

డీల్ తరువాత ఎలాన్ మస్క్ ట్వీట్

"ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా ప్రసంగం పునాదిగా ఉంటుంది. ట్విట్టర్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫామ్. ట్విట్టర్ వేదికలో మానవాళికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి" అని ఎలాన్ మస్క్ సోమవారం ఒక ప్రకటనలో తెలుపుతూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కంపెనీకి అద్భుతమైన సామర్థ్యం ఉంది. ట్విట్టర్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మస్క్ అన్నారు.