Asianet News TeluguAsianet News Telugu

అమ్మో! ‘ఫొర్టిస్‌’కు ముంజాల్ - బర్మన్ జోడీ ‘రాంరాం’

ఇంతకుముందు దేశీయ అగ్రశ్రేణి హెల్త్‌కేర్ సంస్థల్లో ఒక్కటైన ఫొర్టిస్ హెల్త్ కేర్ బిడ్ కైవసం చేసుకుని ఆరోగ్య రంగంలోనూ సేవలందించాలని భావించిన ముంజాల్ - బర్మన్ జోడీ వెనుకడుగు వేసింది.

Munjal-Burman stays away from fresh bidding for Fortis; IHH, Manipal-TPG in fray

న్యూఢిల్లీ: ఇంతకుముందు దేశీయ అగ్రశ్రేణి హెల్త్‌కేర్ సంస్థల్లో ఒక్కటైన ఫొర్టిస్ హెల్త్ కేర్ బిడ్ కైవసం చేసుకుని ఆరోగ్య రంగంలోనూ సేవలందించాలని భావించిన ముంజాల్ - బర్మన్ జోడీ వెనుకడుగు వేసింది. రుణాల ఊబిలో చిక్కుకుని దివాళా అంచున నిలిచిన ఫొర్టిస్ హెల్త్ కేర్ (ఎఫ్‌హెచ్‌సీ) కొనుగోలు కోసం తాజాగా సవరించిన అంచనాలతో మలేషియా ఐహెచ్ హెచ్ హెల్త్ కేర్, మణిపాల్ - టీపీజీ జాయింట్ వెంచర్ సంస్థలు మళ్లీ బిడ్లు దాఖలు చేశాయి. 

బైండింగ్ బిడ్ల పూర్తి వివరాలు బయటపెట్టని ఫొర్టిస్


తాజాగా స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో ఫ్రెష్ బైండింగ్ బిడ్లు దాఖలయ్యాయని ఫొర్టిస్ హెల్త్ కేర్ మంగళవారం తెలిపింది. మలేషియా ఐహెచ్ హెచ్ హెల్త్ కేర్, మణిపాల్ - టీపీజీ జాయింట్ వెంచర్ సంస్థలు దాఖలు చేసిన బైండింగ్ బిడ్లు తమ బోర్డుకు అందాయని ఫొర్టిస్ హెల్త్ కేర్ ‘బీఎస్ఈ’ ఫైలింగ్‌లో పేర్కొన్నది. మిగతా వివరాలేవీ ఫొర్టిస్ హెల్త్ కేర్ ప్రకటించనే లేదు. తమ సలహాదారులతో సంప్రదించిన మీదట తాజా బైండింగ్ బిడ్ల విలువను లెక్కగట్టిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తాజా ప్రాధాన్యాల ప్రకారం పొటెన్షియల్ బిడ్డర్.. గెలుచుకుంటే ఫొర్టిస్ హెల్త్ కేర్‌లో ప్రిఫరెన్షియల్ షేర్ల కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

ఇలా ఫొర్టిస్ బ్రదర్స్ పరస్పర ఆరోపణలు


ఫొర్టిస్ బ్రదర్స్‌గా పేరొందిన మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ పరస్పర ఆరోపణలకు దిగారు. శివిందర్ సింగ్ సంస్థలో గత రెండేళ్లుగా జరుగుతున్న అవకతకవలకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అంతే కాదు ఫొర్టిస్ సంస్థ నుంచి తమ సోదరులకు చెందిన మూడు సంస్థల్లోకి రూ.445 కోట్ల నిధుల మార్పిడి విషయమై తనకు ఎటువంటి అధికారాలు లేవని చెప్పుకొచ్చారు. 2016 జనవరి నుంచి ఫొర్టిస్ సంస్థలో తాను నాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా మాత్రమే ఉన్నానన్నారు. గత ఫిబ్రవరిలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వైదొలిగిన మాల్విందర్ సింగ్ మాత్రం నిర్ణయాలన్నీ ఉమ్మడిగా తీసుకున్నవేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫొర్టిస్ బ్రదర్స్ మధ్య సంబంధ బాంధవ్యాల విషయమై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ద్రుష్టి సారించాయి. అంతర్గతంగా ఫొర్టిస్ యాజమాన్యం కూడా లా సంస్థ ‘లుథ్రా’ ఆధ్వర్యంలో విచారణ జరుపుతోంది. 

వెనక్కు తగ్గిన ముంజాల్ - బర్మన్


ఫొర్టిస్ హెల్త్ కేర్ కోసం బిడ్లు దాఖలు చేసిన ముంజాల్ - బర్మన్ జోడీ వెనుకకు తగ్గడానికి కారణాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పొరపాటు జరిగితే సంబంధిత సంస్థకు చెందిన అంతర్గత కార్పొరేట్ డిపాజిట్లు (ఐసీడీలు) విక్రయించడం ద్వారా మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ సారథ్యంలోని సంస్థలు రూ.500 కోట్లు రికవరీ చేసుకుంటాయని ఫొర్టిస్ హెల్త్ కేర్ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ఫొర్టిస్ హెల్త్ కేర్‌లో రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నది.  తొలుత దాఖలు చేసిన బిడ్లలో మణిపాల్ - టీపీజీ కూటమి మార్చి 23న ఆయాచితంగా నాన్ బైండింగ్ ఆఫర్ ప్రకటించింది.  అలాగే ఆర్‌హెచ్‌టీ హెల్త్‌ ట్రస్ట్‌ కొనుగోలుకు నిధుల సమీకరణ ప్రణాళిక, డయాగ్నస్టిక్స్‌ సేవల అనుబంధ సంస్థ ఎస్‌ఆర్‌ఎల్‌ నుంచి ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు వైదొలిగేందుకు అవకాశం కల్పించే ప్రణాళిక మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. 

హీరో మోటార్స్ అంటేనే పవన్ ముంజాల్


జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రముఖంగా పేరొందిన సంస్థ ‘హీరో మోటార్స్’కు సారథ్యం వహిస్తున్న ముంజాల్ కుటుంబం ద్విచక్ర వాహనాల సెగ్మెంట్‌లో సంచనాలు స్రుష్టించింది. దీనికి సారథ్యం వహించిన ముంజాల్ కుటుంబ సభ్యుడు సునీల్ ముంజాల్, వినియోగ వస్తువుల తయారీ సంస్థ ‘డాబర్ ఇండియా’తో జత కట్టింది. డాబర్ ఇండియా సంస్థ యజమాని  బర్మన్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థతో ‘ఫొర్టిస్ హెల్త్ కేర్’ను కైవసం చేసుకోవాలని భావించింది. అప్పుల ఊబిలో చిక్కుకుని  ‘ఫొర్టిస్ హెల్త్‌కేర్’ సంస్థ దివాళా దశకు చేరుకున్నది. 

మొహలి నుంచి ఫొర్టిస్ తొలిసేవలు ఇలా


2001లో మొహాలీలో తొలి ఆస్పత్రిని ప్రారంభించిన ఫోర్టిస్‌కు ప్రస్తుతం దేశవిదేశాల్లో 45 హెల్త్‌కేర్‌ కేంద్రాలు ఉన్నాయి. ఫొర్టిస్ హెల్త్ కేర్ ఆసియా ఖండంలో మూడో స్థానంలో నిలిచిన ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థ. దీని కోసం మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్ కేర్, సునీల్ ముంజాల్, ఆనంద్ బర్మన్, రేడియంట్ లైఫ్ కేర్, చైనాకు చెందిన ఫోసున్ ఇంటర్నేషనల్, మణిపాల్ హాస్పిటల్స్ పోటీ పడ్డాయి. 

హామీ ఆస్తుల విక్రయానికి ఇలా మాల్విందర్ మోహన్ సింగ్ 


రుణం ఎగవేత కేసులో ఫొర్టిస్ హెల్త్ కేర్ సహా వ్యవస్థాపకుడు మాల్విందర్ మోహన్ సింగ్.. హామీగా పెట్టిన విలువైన ఆస్తుల విక్రయ ప్రయత్నాలను ఢిల్లీ రుణాల రికవరీ ట్రిబ్యునల్ అడ్డుకున్నది. ‘యెస్ బ్యాంక్'లో ఆస్కార్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ అనే సంస్థ తీసుకున్న రూ.569.64 కోట్ల రుణానికి మాల్విందర్ మోహన్ సింగ్ ఢిల్లీలోని లుట్యెన్స్, ఇతర విలాసవంతమైన ఆస్తులను హామీగా పెట్టారు. కానీ ఈ రుణం ఇంకా చెల్లించనే లేదు. 

తమకేం తెలియదని వాదించిన ఫొర్టిస్ బ్రదర్స్


ఈ ఆస్తుల విక్రయానికి మాత్రం మాల్విందర్ మోహన్ సింగ్ ప్రయత్నాలు చేపట్టారు. ఫొర్టిస్ యాజమాన్యం వివిధ నియంత్రణ సంస్థల దర్యాప్తులో చిక్కుకున్నది. ఫొర్టిస్ వ్యవస్థాపకులైన మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ సోదరులు ఇద్దరు సంస్థ నుంచి నిధులు మాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు కంపెనీ నుంచి తప్పుకోవడంతోపాటు తమకేం తెలియదని బుకాయిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios