Asianet News TeluguAsianet News Telugu

ఎరిక్సన్ పేమెంట్ ఇష్యూ: అంబానీ బ్రదర్స్ కలుస్తారా?!!

ఎరిక్సన్ బకాయిల చెల్లింపు వివాదం అసలు సిసలు నిజాన్ని ఆవిష్కరించింది. ఆసియా ఖండంలోనే కుబేరుల కుటుంబంగా రికార్డులకెక్కిన ముకేశ్ అంబానీ.. సకాలంలో డబ్బు సాయం చేసి అనిల్ అంబానీ జైలుపాలవ్వకుండా అడ్డుకున్నారు. కానీ అనిల్ సారథ్యంలోని పలు కంపెనీలు రుణ ఊబీలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారానికి ముకేశ్ అంబానీ ముందుకు వస్తారా? అంటే అలా అని చెప్పలేమని కార్పొరేట్ వర్గాల మాట. అన్న దన్నుతో అనిల్ అంబానీ తిరిగి దూసుకెళ్తారా? అన్న సంగతి మున్ముందు గానీ తేలదు. కాకపోతే ఒక వివాదం అంబానీ బ్రదర్స్ మధ్య సయోధ్య కుదిరేందుకు కారణమైంది. 

Mukesh to the rescue: All you need to know about how Anil Ambani paid his dues
Author
Hyderabad, First Published Mar 20, 2019, 11:54 AM IST

రిలయన్స్ వ్యవస్థాపక అధినేత ధీరూభాయి అంబానీ మరణం తర్వాత కుదుపుకు లోనైంది సంస్థ. అన్నదమ్ములు ముకేశ్, అనిల్ మధ్య విభేదాలు ఇద్దరూ ఆస్తి, వ్యాపార పంపకాల వరకు వచ్చింది. తర్వాత న్యాయపోరాటాల బాట పట్టింది.

కానీ కాలక్రమంలో సీనియర్ అంబానీ ముకేశ్ నిలదొక్కుకుంటే.. జూనియర్ అనిల్ అంబానీ దూకుడుగా వెళ్లి రుణాల ఊబిలో చిక్కుకున్నారు. చివరకు జైలుపాలయ్యే దుస్థితి తెచ్చుకున్నారు. 

కానీ రక్త సంబంధం అనేది ముకేశ్ అంబానీలో వివేకాన్ని తట్టి లేపింది. చివరిక్షణంలో తమ్ముడిని ఆదుకున్నారు. సినిమాలో మాదిరిగా ఒకప్పుడు వ్యాపార పరంగా దూరమైన సోదరులు ముకేశ్‌, అనిల్‌ అంబానీ మధ్య బంధం తిరిగి బలపడేందుకు ఎరిక్సన్‌కు బకాయిల చెల్లింపు ఒక సానుకూల పరిణామం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్‌లో వీళ్లు కలిసి పనిచేసేందుకు ఇది ఓ కీలక మలుపు అవుతుందని భావిస్తున్నారు.

అనిల్‌ అంబానీ చెల్లించాల్సిన బకాయిలపై ఒక బ్యాంకర్ స్పందిస్తూ‘అతనెవరు? అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి. అటువంటిది తన కుటుంబ సభ్యుడు, తోబుట్టువు, ఆయన కంపెనీ దివాళా తీస్తుంటే అంబానీ కుటుంబం చూస్తూ ఊరుకుంటుందా? కచ్చితంగా ఆదుకోకుండా ఉంటుందా?’ అని అన్నారు.

చివరకు ఆ బ్యాంకర్ ఊహించినట్లే అనిల్‌ అంబానీ జైలుకు వెళ్లకుండా ఆఖరి నిమిషంలో ముకేశ్‌ ఆదుకున్నారు. ఎరిక్సన్‌కు అనిల్‌ చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో కలిపి తీర్చేసి తన తమ్ముడిని గట్టెక్కించారు. సరైన సమయంలో తనను ఆదుకున్నందుకు అనిల్‌ కూడా తన అన్న ముకేశ్‌కు, వదిన నీతా అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు.

2002లో తండ్రి ధీరూభాయి అంబానీ మరణించిన కొన్నాళ్లకే ఈ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. వ్యాపారాలు పంచుకున్నారు. అప్పుడప్పుడు బాహాటంగానే విమర్శించుకున్న సందర్భాలూ లేకపోలేదు. 

తర్వాత అంబానీ బ్రదర్స్ ఒకరిపై ఒకరు కోర్టుల్లో కేసులూ వేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు కలుసుకున్నా అన్యమనస్కంగానే పలుకరించుకున్నట్లు కనిపిస్తుండేది. కానీ ఆప్యాయతతో కాదనే మాట వినిపించేది. 

ఇటీవల ముకేశ్‌ - నీత గారాలపట్టి ఈశా, పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ వివాహ వేడుకలకు అనిల్‌ అంబానీ కుటుంబ సమేతంగా విచ్చేయడమే కాక పెళ్లి పనుల్లో పాలుపంచుకున్నారు. వ్యాపారపరంగా విభేదాలు ఉండొచ్చేమో కాని కుటుంబపరంగా తామంతా ఒకటేనని అంబానీల ఇంట జరిగిన పెళ్లి వేడుకలు చెప్పకనే చెబుతున్నాయి. 

ఇప్పుడు తాజాగా అనిల్‌కు ముకేశ్‌ చేసిన సాయం అన్నదమ్ముల మధ్య బంధం తిరిగి బలోపేతమయ్యేందుకు అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ధీరూభాయి అంబానీ మరణం తర్వాత చమురు, పెట్రో రసాయనాల వ్యాపారం ముకేశ్‌ వాటా కిందకు వెళ్లగా కొత్త వ్యాపారాలైన విద్యుత్‌, టెలికం, ఆర్థిక సేవల విభాగాలను అనిల్‌ అంబానీ తీసుకున్నారు. 

ముకేశ్, అనిల్ దాదాపు సమాన స్థాయిలోనే వ్యాపారాలు పంచుకున్నట్లు చెబుతుంటారు. ఇక్కడితోనే వీరి మధ్య విబేధాలు ముగిసిపోలేదు. ఒకరి మీద మరొకరు కేసులు వేసుకునే వరకు వెళ్లింది. 

అలా అంబానీ బ్రదర్స్ మధ్య దూరం పెరుగుతూ పోయింది. కాలక్రమంలో ముకేశ్‌ చమురు- పెట్రో రసాయనాల వ్యాపారం అభివృద్ధి చెందుతూ వచ్చింది. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ అవతరించారు. అటు అనిల్‌ అంబానీ సంపద హరించుకుపోయింది. అప్పుల్లో కూరుకుపోవడమే కాక ఆస్తుల అమ్మే పరిస్థితి తెచ్చుకున్నారు. 

2010లో టెలికం వ్యాపారంపై ఇరువురి మధ్య ఒప్పంద గడువు ముగియడంతో 2016లో ముకేశ్‌ జియోకు అంకురార్పణ చేశారు. అప్పటికే అప్పులతో సతమతం అవుతున్న అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు జియో చౌక టారీఫ్‌లతో మరింత కష్టాలు ఎదురయ్యాయి.

అనిల్ అంబానీకి 2010 నుంచే రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. కోర్టుల్లో కేసు వివాదాలు పెరిగాయి. రుణాలు చెల్లించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలూ చేశారు. ఆస్తులు అమ్మే ప్రయత్నం చేశారు. స్పెక్ట్రం ఆస్తుల విక్రయానికి రిలయన్స్‌ జియోతో రూ.17వేల కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు కూడా. ప్రభుత్వం, నియంత్రణ సంస్థల జాప్యంతో ఆ ఒప్పందం పక్కకుపోయింది. ఇలా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన బకాయిలతోనే అనిల్‌ అంబానీ అప్పుల నుంచి పూర్తిగా బయటపడ్డారని చెప్పలేం. అనిల్ అంబానీ సారథ్యంలోని మరికొన్ని కంపెనీలూ అప్పుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎరిక్సన్‌ విషయంలో మాదిరే ముకేశ్‌ అంబానీ ఇతర అప్పుల విషయంలోనూ వ్యవహరిస్తారా? అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. 

ముకేశ్‌ అంబానీ చెల్లిస్తారనే ఉద్దేశంతో అనిల్‌ అంబానీపై రుణ సంస్థలు ఒత్తిడి పెంచే అవకాశాలూ ఉన్నాయనే మాట కార్పొరేట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఈసారి ముకేశ్‌ ఆదుకున్నా.. మళ్లీమళ్లీ ఇదేవిధంగా వ్యవహరిస్తారని అనుకోలేమని కొందరు అంటున్నారు. సందర్భానుసారంగా స్పందించవచ్చని అనుకుంటున్నారు.

మరోవైపు ముకేశ్‌ ఎలాగో అండగా నిలుస్తారనే ఉద్దేశంతో ఆ భరోసాతో అనిల్‌ అంబానీకి రుణాలిచ్చేందుకు రుణ సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంటుందనే మాట కూడా వినిపిస్తోంది.  ఆ రుణాలను వ్యాపార విస్తరణకు ఉపయోగించుకొని, సంక్షోభంలో నుంచి బయటపడేందుకు అనిల్‌ అంబానీ ప్రయత్నించొచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఎరిక్సన్‌ పరిణామం అటు అన్నదమ్ముల మధ్య బంధం బలపడటానికే కాదు తమ్ముడు తిరిగి సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు దోహదం చేసే అవకాశం ఉందని కార్పొరేట్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios