న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ముడి చమురు ఎగుమతి దేశం అయిన సౌదీ అరేబియాతో ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ఉమ్మడి పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతోంది. పెట్రో కెమికల్స్‌, రిఫైనరీ ప్రాజెక్టుల్లో ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు జరుగుతున్నట్టు సౌదీ అరేబియా ఆయిల్‌ శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీహ్‌ తెలిపారు. 

పదేళ్లుగా అంబానీతో సాన్నిహిత్యం గల ఖలీద్‌ ఇటీవల ముకేశ్ గారాల పట్టి ఈశా అంబానీ పెండ్లికి ముందు ఈ నెల 8, 9 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో జరిగిన వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఆ సమయంలోనే అంబానీతో చర్చలు జరిపిన ఆయన ఉమ్మడి పెట్టుబడి అవకాశాలపై చర్చించినట్టు ఒక ట్విట్టర్‌ సందేశంలో తెలిపారు.
 
తాను అంబానీతో సమావేశమైన ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. రిలయన్స్‌ ఆ ఊసే ఎత్తలేదు. రిలయన్స్‌ సంస్థ జామ్‌నగర్‌లో ఏటా 6.82 కోట్ల టన్నుల సామర్థ్యం గల రెండు రిఫైనరీలు నడుపుతోంది. అలాగే కేవలం ఎగుమతుల కోసమే ఉత్పత్తి చేయతలపెట్టిన సెజ్‌లో ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న 3.52 కోట్ల టన్నుల నుంచి 4.1 కోట్ల టన్నులకు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. అంతే తప్ప కొత్త రిఫైనరీ ఏర్పాటు చేసే ప్రయత్నమే చేయడంలేదు. 

ప్రపంచంలోనే త్వరితగతిన వృద్ధి చెందుతున్న ఆయిల్‌ మార్కెట్‌ భారత్‌లో అడుగు పెట్టేందుకు సౌదీ ఆసక్తిగా ఉంది. సౌదీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్‌ కంపెనీ సౌదీ ఆరామ్‌కో, దాని భాగస్వామి అబుదాభి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (అద్నాక్‌) 4,400 కోట్ల డాలర్లతో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నిర్మించతలపెట్టిన రిఫైనరీలో 50 శాతం వాటాలు కొనుగోలు చేసినా స్థానిక రాజకీయవేత్తల నుంచి ఎదురవుతున్న నిరసనల వల్లే భూసేకరణ సమస్యలు ఎదుర్కొంటోంది.
 
ఏటా 1.8 కోట్ల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో పని చేస్తున్న పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ పక్కనే ఏడాదికి ఆరు కోట్ల టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ నిర్మించాలన్నది ప్రణాళిక. ఆ రిఫైనరీలో ప్రాసెసింగ్‌ చేయనున్న ముడి చమురులో సగానికి పైగా చమురు ఈ రెండు కంపెనీలు సరఫరా చేయాలని భావించాయి. భారత్‌లో ఏర్పాటు చేసే రిఫైనరీని అమెరికా, యూరోపియన్‌ దేశాలకు చమురు ఎగుమతి స్థావరంగా చేసుకోవాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. 

తాము సరఫరా చేసే ముడి చమురుకు బదులుగా తమకు రిఫైన్‌ చేసిన ఆయిల్‌లో అధిక శాతం అందించగల ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టాలని కువైట్‌ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం భారత్‌కు ఏడాదికి 2.47 కోట్ల టన్నుల రిఫైనింగ్‌ సామర్థ్యం ఉండగా డిమాండ్ 2.06 కోట్ల టన్నులుంది. 2040 నాటికి దేశంలో చమురు డిమాండు 4.58 కోట్ల టన్నులకు పెరుగుతుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.