Asianet News TeluguAsianet News Telugu

మాంద్యంలోనూ ముకేశుడికే కుబేరపట్టాభిషేకం: ఇది జియో ఎఫెక్ట్ అయితే ..

ఫోర్బ్స్ జాబితాలో వరుసగా 12వ సారి చోటు దక్కించుకున్నారు. ఆయనే ముకేశ్ అంబానీ భారతీయ అపర కుబేరుడిగా అగ్రాసనాన్ని అందుకున్నారు. అయితే ఈ దఫా జియో స్రుష్టించిన సంచలనమే ఆయన్ను అగ్రస్థానంలో నిలిపిందని ఫోర్బ్స్ జాబితా పేర్కొంది. ఇక మౌలిక వసతుల సంస్థ ఆదానీ ఇన్ ఫ్రా అధినేత గౌతం ఆదానీ ఎనిమిది ర్యాంకులు పైకెగసి రెండో స్థానానికి చేరుకున్నారు. దాత్రుత్వానికి మారుపేరుగా నిలిచిన పారిశ్రామిక వేత్త విప్రో వ్యవస్థాపక అధినేత అజీం ప్రేమ్ జీ మాత్రం 17వ ర్యాంకుకు పడిపోయారు.

Mukesh Ambani Remains Richest Indian, Gautam Adani Jumps 8 Spots To No. 2
Author
Hyderabad, First Published Oct 12, 2019, 9:47 AM IST

ఆర్థిక మాంద్యంలోనూ పలువురు దేశీయ కుబేరుల ఆస్తులు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశీయ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రస్తుత సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ ఏడాది 51.4 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో నిలిచారు. టెలికం రంగంలో ప్రభంజనం సృష్టించిన జియోతో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగింది. 

మౌలిక సదుపాయాల టైకూన్ గౌతమ్ అదానీ ఈసారి రెండో స్థానానికి ఎగ బాకారు. గతేడాది ఎనిమిదో స్థానంలో ఉన్న గౌతమ్..15.7 బిలియన్ డాలర్లతో ద్వితీయ స్థానం వరించింది. గతేడాది ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ ఈసారి 17వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 

15.6 బిలియన్ డాలర్ల సంపదతో హిందుజా బ్రదర్స్ మూడో స్థానంలో నిలువగా, పల్లోంజి మిస్త్రీ 15 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో ఆ తర్వాతీ స్థానంలో నిలిచారు. దేశీయంగా నెలకొన్న ఆర్థిక మందకొడి పరిస్థితుల కారణంగా గతేడాదితో పోలిస్తే శ్రీమంతుల సంపాదన 8 శాతం తగ్గి 452 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 

ఈ వందమంది జాబితాలో సగం మంది నికర ఆస్తుల విలువ పడిపోవడం విశేషం. తొలిసారిగా టాప్-10లోకి చేరిన ఉదయ్ కొటక్‌ ఆస్తి 14.8 బిలియన్ డాలర్ల సంపాదనతో ఐదో స్థానం వరించింది.

ఈ జాబితాలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో 3.18 బిలియన్ డాలర్ల సంపదతో సింగ్ కుటుంబానికి 41వ స్థానంలో నిలువగా, 1.91 బిలియన్ డాలర్లతో బైజు రవీంద్రన్ 72వ స్థానం, 1.77 బిలియన్ డాలర్లతో అరిస్ట్రో ఫార్మాస్యూటికల్స్ చీఫ్ మహేంద్ర ప్రసాద్ 81వ స్థానం దక్కించుకున్నారు.

1.7 బిలియన్ డాలర్లతో హల్దీరామ్ స్నాక్స్ ప్రమోటర్లు మనోహర్ లాల్, మధుసూదన్ అగర్వాల్ 86వ స్థానం, 1.5 బిలియన్ డాలర్లతో రాజేష్ మెహ్రా 95వ స్థానం, 1.45 బిలియన్ డాలర్లతో సందీప్ ఇంజినీర్ 98వ స్థానం పొందారు. కనీసంగా 1.4 బిలియన్ డాలర్ల కంటే అధిక సంపాదన కల వారితో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.

ఇంకా 1.85 బిలియన్ డాలర్లతో కల్పతరు ఎండీ మోఫాట్రాజ్ మునూట్ 75వ ర్యాంక్, 1.69 బిలియన్ డాలర్ల సంపదతో యూపీఎల్‌కు చెందిన రాజు శరాఫ్ 87వ స్థానం, 1.4 బిలియన్ డాలర్లతో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎస్‌డీ శిబులాల్ 100వ ర్యాంక్ పొందారు. 

ఇంకా శివ్ నాడార్ 14.4 డాలర్లతో ఆరవ ర్యాంక్, రాధాకిషన్ దామానీ 14.3 బిలియన్ల డాలర్ల సంపదతో ఏడో స్థానం పొందారు. మరోవైపు గోద్రేజ్ కుటుంబం 12 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదవ ర్యాంక్, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ 10.5 బిలియన్ల డాలర్ల సంపదతో 9వ ర్యాంక్, కుమార మంగళం బిర్లా 9.6 బిలియన్ డాలర్లతో 10వ ర్యాంక్ పొందారు.

3.4 బిలియన్ డాలర్లతో దివీస్ ల్యాబ్ అధినేత మురళీ దివీస్ 37వ ర్యాంకు, 3.3 బిలియన్ డాలర్లతో మేఘా ఇంజనీరింగ్ చీఫ్ పీపీ రెడ్డి 39వ స్థానం పొందారు. ఇంకా అరబిందో ఫార్మా అధినేత పీవీ రాంప్రసాద్ రెడ్డి 2.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో 59వ ర్యాంక్, రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ అధినేతల్లో ఒకరు సతీష్‌రెడ్డి 1.76 బిలియన్ డాలర్లతో 82వ ర్యాంకు అందుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios