Asianet News Telugu

ముద్రా మీన్స్ మొండి బాకే: రూ.2.5లక్షల కోట్లకు ‘టోపీ’

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాల్లో 92 శాతం మొండి బాకీలుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. అందునా గుజరాత్ పరిధిలో గత మార్చి త్రైమాసికంలో 34 శాతం రుణాలు మొండి బాకీలుగా మారిపోయాయి. మూడేళ్లలో రూ. 11,000 కోట్ల నిరర్థక ఆస్తులుగా నిలిచాయి. మరోవైపు గత 11 ఏళ్లలో ఘరానా మోసగాళ్లు శఠగోపం పెట్టడంతో బ్యాంకులకు రూ.2లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

Mudra loan NPAs soar 34% in Gujarat in March quarter
Author
New Delhi, First Published Jun 13, 2019, 11:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: బ్యాంకులకు మొండి బాకీల బెడద వదిలేలా కనిపించడం లేదు. రూ.లక్షల కోట్ల బకాయిలు పేరుకుపోయి, గుదిబండగా మారిన కార్పొరేట్‌ సంస్థల రుణాలకు కొన్ని త్రైమాసికాలుగా బ్యాంకులు భారీగా కేటాయింపులు జరిపి, ఉపశమనం కలిగించుకున్నాయి. ఇంతలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాలు మొండి బాకీలుగా మారుతుండటం బ్యాంకులకు కలవరం కలిగిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎస్‌ఎంఎంఈ) సంస్థలకు రూ.10 లక్షల వరకు రుణాలిచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ముద్రా పథకం బ్యాంకులకు మరో గుదిబండ అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ముద్రా రుణాలతో 12 కోట్ల మందికి ఉద్యోగాలు
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక, దేశీయ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశ జీడీపీలో మూడోవంతుకు పైగా వాటా కలిగిన ఈ రంగం 12 కోట్ల మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని మైక్రోసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ (ఎంఎస్‌ఎంఈ) 2017-18లో విడుదల చేసిన నివేదిక చెబుతోంది. ఉద్యోగాల కల్పనకు సంబంధించి 2015-16 నాటి గణాంకాలే శాఖ వద్ద ఉన్నాయి. తర్వాత కాలంలో ఉద్యోగాలు పెరిగి ఉండొచ్చు.

మొండి బాకీలు ఐదు శాతమేనని ఆర్థికశాఖ దాటవేత
ఇంత ప్రాధాన్యం కలిగిన ఈ రంగం వృద్ధి కోసం ప్రధాన్‌మంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015 ఏప్రిల్‌లో ప్రారంభించారు. వ్యాపారాభివృద్ధి కోసం ఎంఎస్‌ఎంఈలకు రూ.10 లక్షల వరకు రుణాలివ్వాలని నిర్దేశించారు. ఈ రుణాలపై వడ్డీరేట్లు 8-12 శాతంగా ఉన్నాయి. ఈ పథకం అమలు సంతృప్తికరంగా ఉందని, దీనికింద ఇచ్చిన రుణాల్లో ఒత్తిడికి గురవుతున్నవి ఐదు శాతమేనని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. 

92 శాతానికి చేరిన ముద్రా రుణాల మొండి బాకీలు
2016-17తో పోలిస్తే 2017-18లో ముద్రా రుణాల్లో మొండి బాకీల సంఖ్య 92 శాతం పెరగడం బ్యాంకర్లను ఆందోళనకు గురిచేసింది. దీంతో 2018-19లో ఈ రుణాల మంజూరులో బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రారంభించారు. అయినా గత ఆర్థిక సంవత్సర మొదటి మూడు త్రైమాసికాల్లో ముద్రా రుణాల్లో మొండి బాకీల సంఖ్య 50 శాతం పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. 2018 ఆగస్టు నాటికి 21 ప్రభుత్వరంగ బ్యాంకులు మూడేళ్లుగా ఇచ్చిన ముద్రా రుణాల్లో మొండి బాకీలు రూ.11 వేల కోట్లకు చేరాయన్నది బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం.

ముద్రా రుణాల్లో మొండి బాకీల ముప్పు
కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని చేపట్టినా, ప్రాధాన్యంగా పరిగణించి, రుణాలు విరివిగా మంజూరు చేయాలనే ఒత్తిళ్లు బ్యాంకర్లపై వస్తుంటాయి. ముద్రా పథకం కింద మంజూరవుతున్న రుణాల్లో నష్టభయం ఉందని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, పార్లమెంటరీ అంచనాల కమిటీకి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ గతేడాదే తేల్చి చెప్పారు. 

పరిశీలించకుండా రుణాల మంజూరుతో మొండి బాకీకి మార్గం
రుణ మంజూరుకు లక్ష్యాలు ఇచ్చి పూర్తిచేయమనడంతో, పూర్తిస్థాయి నిశిత పరిశీలన జరపకుండానే బ్యాంకర్లు జారీ చేస్తున్నారని రఘురామ్ రాజన్‌ తెలిపారు. ఇది భవిష్యత్తులో మొండి బాకీల పెరిగేందుకు కారణమవుతాయనీ హెచ్చరించారు. ముద్రా రుణాలతో పాటు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులనూ నిశితంగా పరిశీలించాలనే సలహా ఇచ్చారు. 

ముద్రా రుణాల మంజూరుపై ఆర్బీఐ ఆందోళన ఇలా
ఆర్‌బీఐ కూడా ముద్రా రుణాల విషయంలో తన ఆందోళనను ఆర్థిక శాఖకు తెలియపరచింది. మొండి బాకీలు భారీగా పెరిగేందుకు ఈ రుణాలు కారణమవుతాయని పేర్కొంది.  వ్యాపార సంస్థ స్థాయిని బట్టి ముద్రా రుణాల మంజూరు ఉంటుంది. శిశు విభాగంలో రూ.50 వేల వరకు, కిశోర్ విభాగంలో రూ.5 లక్షల వరకు, తరుణ్ విభాగంలో 10 లక్షల వరకు రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. 

ముద్ర రుణాలు పొందే రంగాలిలా..
ఇంకా ముద్రా పథకం కింద తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా వర్కింగ్‌ క్యాపిటల్‌, నిర్దిష్ట గడువు గల రుణాలుగా మంజూరు చేయాలి. ఆదాయ ఆర్జన, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ రుణాలివ్వాల్సి ఉంది. దుకాణదారులు, స్వర్ణకారులు, కోళ్లఫారాలు, చేపల పెంపకందారులు కూడా పొందొచ్చు. 

ముద్రా కింద బ్యాంకులు, బ్యాంకేతర సంస్థల్లో రుణాలు
ముద్రా అనేది రీఫైనాన్సింగ్‌ సంస్థ మాత్రమే. ఏ సంస్థ, వ్యక్తికీ రుణాలు నేరుగా ఇవ్వదు. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ), చిన్న రుణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ), సూక్ష్మరుణ సంస్థ (ఎంఎఫ్‌ఐ)లే రుణాలు మంజూరు చేస్తాయి. రుణాలు అవసరమైన వారు సమీపంలోని ఈ సంస్థల శాఖలను ఆశ్రయించాల్సి ఉంటుంది.

ముద్రాకు పూచీకత్తు లేదు.. ఏజంట్లు అవసరం లేదు
ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండా ముద్రా రుణం మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ప్రాసెసింగ్‌ ఛార్జీలు కూడా లేవు. సూక్ష్మ సంస్థల రుణ పూచీ (సీజీఎఫ్‌ఎంయూ), నేషనల్‌ క్రెడిట్‌ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) వీటికి పూచీకత్తు ఇస్తున్నాయి.  ఇప్పుడు నేరుగా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. www.mudramitra.in పోర్టల్‌ను ఇందుకు వినియోగించుకోవచ్చు. ఈ రుణాల మంజూరుకు ఏజెంట్లు ఎవరూ లేరు. కొందరు తమకు తాము ముద్రా ఏజెంట్లుగా చెప్పుకుంటూ, మోసగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. 

మార్చి త్రైమాసికంలో గుజరాత్‌లో రూ.512 కోట్ల మొండి బాకీలు
ఒక్క గుజరాత్‌లోనే జనవరి-మార్చి త్రైమాసికంలో ముద్రా ఎన్‌పీఏలు రూ.516.32 కోట్లకు చేరాయి. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం నాటి మొండి బాకీలతో పోలిస్తే, ఇవి 34 శాతం అధికమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తేల్చి చెప్పింది. ఇందులో అధిక వాటా తక్కువ మొత్తం రుణాలు పొందే శిశు విభాగానిదే. ఈ విభాగం నుంచే రూ.210 కోట్లు మొండి బాకీలు అయ్యాయి. ఇదే సమయంలో వసూలు కావాల్సిన మొత్తం రూ.8671 కోట్ల నుంచి రూ.10,085 కోట్లకు చేరింది.

కార్పొరేట్ సంస్థలకు రుణాల మంజూరు కారణాలివే
కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంకులు భారీమొత్తంలో రుణాలిచ్చేందుకు ప్రధాన కారణం.. పరిశీలన సులభం అవుతుంది, ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉండదు. చిన్నమొత్తం రుణాలు ఎక్కువమందికి ఇస్తే, ఆయా ఖాతాలు, వ్యాపార సంస్థల పరిశీలన, వసూళ్ల అనుశీలనకు అత్యధిక సిబ్బంది అవసరమవుతారు. ఇది కష్టం కావడం వల్లే, ముద్రాలో శిశు, కిశోర్‌ విభాగాల్లోనే మొండి బకాయిలు  అధికమవుతున్నాయన్నది బ్యాంకర్ల సమాచారం. ఎటువంటి పూచీకత్తు లేని నేపథ్యంలో, రికవరీ కష్టంగా మారిందనీ చెబుతున్నారు.

11 ఏళ్లలో 50 వేల మోసాలతో రూ.2 లక్షల కోట్ల నష్టాలు
దేశీయంగా గత 11 ఏళ్లలో బ్యాంకుల్లో 50,000కు పైగా మోసాలు చేసుకున్నాయని, వీటి విలువ రూ.2.05 లక్షల కోట్లని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో కూడా అధిక సంఖ్యలో మోసాలు చోటుచేసుకున్నాయని సమాచారం. 2008-09 నుంచి 2018-19 వరకు మొత్తం 53,334 మోసం కేసులు నమోదు అయ్యాయి. వీటిల్లో రూ.2.05 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

ఐసీఐసీఐ కంటే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎక్కువ నష్టం
మోసాల సంఖ్యా పరంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో అధికంగా చోటుచేసుకున్నా, విలువ పరంగా చూస్తే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఎక్కువమొత్తం నష్టం వాటిల్లింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో  2497 కేసుల్లో రూ.1200.79 కోట్ల నష్టం వాటిల్లింది. విదేశీ బ్యాంకుల్లోనూ మోసాలు జరిగిన వాటిల్లిన నష్టం మొత్తం తక్కువగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలోనే షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థల్లో చోటుచేసుకున్న 6801 మోసాల్లో రూ.71,542.93 కోట్ల నష్టం వాటిల్లిందని వార్తలు రావడంతో, ఆర్థిక మోసాలపై శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్లూ వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios