Asianet News TeluguAsianet News Telugu

McDonald's To Exit Russia: రష్యాలో మెక్ డొనాల్డ్స్ వ్యాపారం బంద్, ఉక్రెయిన్ పై దాడికి నిరసనగా నిష్క్రమణ

McDonald's To Exit Russia: అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ రష్యన్ మార్కెట్ నుండి నిష్క్రమించనుంది. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా రష్యాలో తన వ్యాపారాన్ని స్థానిక కొనుగోలుదారుకు విక్రయిస్తామని కంపెనీ సోమవారం తెలిపింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత, చాలా పాశ్చాత్య కంపెనీలు రష్యా నుండి నిష్క్రమిస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి మెక్ డొనాల్డ్స్ వచ్చి చేరింది.

McDonalds Decided To Leave Russia The Company Says Will Sell Business To Local Buyer
Author
Hyderabad, First Published May 16, 2022, 8:57 PM IST

McDonald's To Exit Russia: ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ మెక్‌డొనాల్డ్స్ రష్యాలో తన వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయబోతోంది. Mc Donalds రష్యా వ్యాపారాన్ని విక్రయించే ప్రక్రియను ప్రారంభించినట్లు కంపెనీ సోమవారం తెలిపింది. రష్యాలో కంపెనీకి మొత్తం 850 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో 62,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మెక్‌డొనాల్డ్స్ ఉక్రెయిన్ ఆక్రమణ అనంతరం  రష్యా నుంచి వైదొలిగిన మరొక  పశ్చిమ దేశాల మల్టీనేషనల్  కంపెనీ కావడం విశేషం. రష్యాలో మెక్‌డొనాల్డ్ వ్యాపారం చేయడం ఇకపై "సముచితమైనది కాదని, తమ విలువలకు అనుగుణంగా లేదు" అని చెబుతూ, యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని కంపెనీ ఎత్తి చూపింది.

చికాగోకు చెందిన మెక్‌డొనాల్డ్ కంపెనీ మార్చి ప్రారంభంలో రష్యాలోని తన దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది, అయితే ఉద్యోగులకు జీతాల చెల్లింపు కొనసాగుతుందని పేర్కొంది. అయితే రష్యాకు చెందిన కొత్త నిర్వాహకుల దొరికేవరకు కార్మికులను  వేతనం చెల్లిస్తామని తెలిపింది. సంస్థ ఔట్ లెట్స్, వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టి కొత్త ఓనర్ కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ సోమవారం తెలిపింది. విక్రయం ముగిసే వరకు కార్మికులు ఆందోళన చెందనవసరం లేదని కంపెనీ తెలిపింది.

మెక్‌డొనాల్డ్స్ ఎవరు కొనుగోలు చేస్తున్నారు అనే విషయం ఇంకా వెల్లడించలేదు. మెక్‌డొనాల్డ్స్‌ ఉద్యోగులు అలాగే లక్షలాది రష్యన్ కస్టమర్ల అభిమానం ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదని, ఇది చాలా కఠినమైన నిర్ణయమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) క్రిస్ కెంప్‌జిన్స్‌కి తెలిపారు. "అయితే, మాకు ప్రపంచ సమాజం పట్ల నిబద్ధత ఉంది.  మేము మా విలువలకు కట్టుబడి ఉండాలి" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

రష్యాలో అమెరికా ఎత్తుగడలకు చైనా చెక్...
ఇదిలా ఏంటూ ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత.. రష్యాకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విధించిన ఆంక్షలు ఇప్పుడు అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, అమెరికా ఆంక్షల వల్ల రష్యాలోని శూన్యతను పూరించడానికి చైనా చాలా వేగంగా కృషి చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత, రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో అమెరికా అనేక ఆంక్షలు విధించింది. దీనితో పాటు, అనేక అమెరికన్ బహుళజాతి కంపెనీలు కూడా తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రష్యాలో తమ సేవలను నిలిపివేసాయి. వీటిలో మాస్టర్, వీసా కార్డులు కూడా ఉన్నాయి. అమెరికన్ కంపెనీల ఈ చర్య రష్యాలో చైనా కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను తెరిచింది. దీనివల్ల చైనాకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

మాస్టర్, వీసా కార్డ్ బదులుగా రష్యాలో చైనా యూనియన్ పే సేవలు..
వీసా, మాస్టర్ కార్డ్ చెల్లింపు వ్యవస్థలకు బదులుగా వినియోగదారులందరికీ చైనీస్ యూనియన్ పే కార్డ్‌లను ఇవ్వాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది.  వాస్తవానికి, మాస్టర్ మరియు వీసా కార్డ్ రష్యాపై విధించిన ఆంక్షలకు సహకరిస్తూ మార్చి 9 నుండి రష్యాలో తమ సేవలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రష్యాకు మార్చి 6న అందించింది. దీనితో పాటు, రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఈ నిషేధ వార్త తర్వాత, కొంతమంది స్థానిక సర్వీస్ ప్రొవైడర్లు చైనీస్ యూనియన్ పేని స్వీకరించడానికి మాట్లాడినట్లు సమాచారం. 

మాస్టర్, వీసా కార్డులను నిషేధించడాన్ని రష్యా సెంట్రల్ బ్యాంక్ తన వంతుగా తోసిపుచ్చింది. ఈ రెండు కార్డులు గడువు ముగిసే వరకు పని చేస్తూనే ఉంటాయని బ్యాంక్ తెలిపింది. దీనితో పాటు, మాస్టర్, వీసా కార్డులపై ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి నిషేధానికి ముందు నగదు ఉపసంహరించుకోవాలని బ్యాంక్ తన పౌరులను కోరింది.

యూనియన్ పే 180 దేశాల్లో పని చేస్తోంది
ప్రపంచంలోని 180 దేశాలలో ఉన్న చైనీస్ యూనియన్ పేని స్వీకరించడాన్ని రష్యన్ బ్యాంకులు పరిశీలిస్తున్నాయని రష్యన్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అనేక రష్యన్ బ్యాంకులు ఇప్పటికే చైనీస్ యూనియన్ పే కార్డ్‌ని ఉపయోగిస్తున్నాయని రష్యన్ బ్యాంక్ కూడా తెలియజేసింది. 

విదేశాల్లో చిక్కుకుపోయిన రష్యా పౌరులు, వీలైనంత ఎక్కువ నగదును ఉపసంహరించుకోవాలని రష్యా సెంట్రల్ బ్యాంక్ సూచించింది. వాస్తవానికి, రష్యాపై విధించిన ఆంక్షల దృష్ట్యా, యూరప్, అమెరికాలోని చాలా దేశాలు రష్యన్ ఎయిర్‌లైన్స్ కోసం తమ గగనతలాన్ని మూసివేసాయి, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెలవులకు వెళ్లిన రష్యన్ పౌరులు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios