డాలర్‌పై రూపాయి పతనం దెబ్బకు చమురు దిగుమతి బిల్లు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేకల్లా చమురు దిగుమతి కోసం అదనంగా 26 బిలియన్ డాలర్ల నిధులు వెచ్చించాల్సి రావచ్చునని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి. మన కరెన్సీలో ఇది రూ.1.80 లక్షల కోట్లు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.70.32కి పడిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు భగ్గుమనే అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుతం దేశీయంగా వినియోగిస్తున్న ఇంధనంలో 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 220.43 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకోవడానికి 87.7 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) నిధులను వెచ్చించిన కేంద్రం.. ఈ ఏడాది 227 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలల్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 65 డాలర్లు, డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు రూ.65గా ఉంటే చమురు దిగుమతి బిల్లు 108 బిలియన్ డాలర్లు(రూ.7.02 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా వేశాం కానీ, ప్రస్తుతం ఇవి రెండు రాకెట్ వేగంతో దూసుకెళ్లుండటంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడనున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నెల 14 వరకు సరాసరిగా రూపాయి మారకం రూ.67.6గా కొనసాగింది. మిగతా ఏడాదంతా రూ.70 స్థాయిలో కొనసాగితే చమురు బిల్లు 114 బిలియన్ డాలర్లకు పెరుగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా దేశాల్లో రూపాయి పనితీరు నిరాశాజనకంగా ఉన్నదని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8.6 శాతం మేర పతనమైందని చెప్పారు. దీంతో వాణిజ్యలోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం), కరెంట్ ఖాతాలోటు పెరుగుతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

కానీ రూపాయి తరుగుదల ఎగుమతి దారులకు భారీ ఊరట లభించనున్నది. ముఖ్యంగా దేశీయ చమురు దిగుమతి సంస్థలైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్(ఓఎన్‌జీసీ)కు అధిక లాభం చేకూరనున్నది. ఇప్పటికే రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు ఈ నెల చివరినాటికి మరింత భగ్గుమనే అవకాశాలున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా రోజువారి ధరలను ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయిస్తున్నాయి. దీంట్లోభాగంగా గురువారం ఇంధన ధరలు ఆరు పైసలు పెరుగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.77.20కి, డీజిల్ ధర రూ.68.78కి చేరుకున్నాయి. ఒకవేళ చమురు ధరలు, రూపాయి విలువ 70 స్థాయిలోనే కొనసాగితే రిటైల్ ఇంధన ధరలు 50-60 పైసల చొప్పున పెరిగే అవకాశం ఉన్నది.

రూపాయి పతనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై మోయలేని భారం పడుతుందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. రూపాయి విలువ పతనంతో ఉక్కు రంగంపై రెట్టింపు భారం పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ముడి ఇనుము దిగుమతితో రుణ వ్యయం, చెల్లింపుల భారం రెట్టింపవుతుందని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య నియంత్రణ సవాల్‌గా మారుతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ‘యూబీఎస్’ హెచ్చరించింది. వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆర్థిక రంగంలో నెలకొన్న అస్థిరతలు ఇబ్బందికరంగా మారతాయని ఆందోళనకారులు అంటున్నారు. 2019 - 20 నాటికి ద్రవ్యలోటు 6.5 శాతానికి పెరుగుతుందని అంచనా. 2018 - 19లో 5.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

ఇప్పటికే మారుతి సుజుకి కార్ల ధరలు రూ.6,100లకు పెరిగింది. డ్రగ్స్ ధరల నియంత్రణ సంస్థ ‘ఎన్పీపీఏ’ నిర్దేశించిన 92 ఔషధాల ధరలు క్రమంగా పెరుగుతాయి. ఇక క్యాన్సర్, హెపటైటిస్ సీ, మైగ్రేన్, మధుమేహం తదితర వ్యాధుల నివారణకు వ్యయం పెరిగిపోనున్నది.