Asianet News Telugu

నిర్మలా జీ!!ఎఫ్‌డీ వడ్డీపై పన్ను మినహాయించండి:ఏఐబీఈఏ

వచ్చేనెలలో బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమ వర్గాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వసతి ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా మార్చాలని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం.. నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఇంకా బీమా, ఫిక్కీ తదితర సంస్థల ప్రతినిధులు కూడా ఆమెను కలిసి తమ అభ్యర్థనల చిట్టా అందజేశారు.

Make right to banking a fundamental right: AIBEA
Author
New Delhi, First Published Jun 14, 2019, 10:30 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వచ్చే వడ్డీని ఆదాయం పన్ను (ఐటీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. బ్యాంకింగ్‌ రంగం నుంచి సలహాలు, ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం లేఖ రాశారు. అందరికీ బ్యాంకింగ్‌ హక్కుగా మారాలని, సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును కనీసం రెండు బేసిస్‌ పాయింట్లు పెంచాలని కోరారు. 

వ్యవసాయ రుణాలు పెంచాలని ఏఐబీఈఏ అభ్యర్థన
వ్యవసాయ రుణాలను ఏడాదికి రెండు శాతం చొప్పున బ్యాంకులు పెంచుకుంటూ పోవాలని  ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం అభ్యర్థించారు.  వెనుకబడిన వర్గాలకు వచ్చే విద్యా రుణాలపై వడ్డీ మినహాయింపు పొడిగించాలని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులను ప్రభుత్వ రంగం కిందకు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ రంగ  బ్యాంకుల్లో ప్రభుత్వం 100 శాతం ఈక్విటీని ఉంచుకోవాలని, ఎటువంటి పెట్టుబడుల ఉపసంహరణ చేయకూడదని కోరారు. 
రుణ ఎగవేత దారులపై క్రిమినల్ చర్యలకు డిమాండ్
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగవేస్తే.. క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం సూచించారు. మరిన్ని రుణ రికవరీ ట్రైబ్యూనళ్లు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ.7.5 లక్షలకు పెంచాలని అన్నారు.

ఎన్‌బీఎఫ్‌సీలకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి 
ఆర్థిక రంగం, స్టాక్‌ మార్కెట్‌ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మూడో దఫా ముందస్తు బడ్జెట్‌ చర్చలు జరిపారు. స్టాక్‌ మార్కెట్లు, ఆర్థిక రంగం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్‌) సమస్యలను సమావేశంలో చర్చించారు. 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మూలధనం చొప్పించాలి
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మూలధనం చొప్పించాలని పరిశ్రమ ప్రతినిధులు కోరారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఫైనాన్షియల్‌ సెక్టర్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ క్రియాశీల పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నగదు లభ్యతకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీ రేట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని పరిశ్రమ ప్రతినిధులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు. 

ప్రత్యేక కమిటీతో బ్యాంకుల మొండి బాకీల కేటాయింపుపై సమీక్షించాలి
ఇంకా ప్రత్యేక కమిటీ ద్వారా బ్యాంకుల మొండి బకాయిల కేటాయింపులపై సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పరిశ్రమ ప్రతినిధులు సూచించారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు ప్రోత్సాహించడంతోపాటు నిధులు కేటాయించాలని, వ్యవసాయ మార్కెటింగ్‌కు ప్రోత్సాహాకాలు ఇవ్వాలని, ఎంఎస్‌ఎంఈ రంగంలో వాణిజ్య లైసెన్సు ఆన్‌లైన్‌లో తీసుకునే వసతి కల్పించాలని కోరారు.

దివాలా చట్టం వల్ల ఎదురవుతున్న నగదు లభ్యత ఇబ్బందులను తగ్గించాలని పరిశ్రమ ప్రతినిధులు కేంద్రాన్ని కోరారు. స్టాక్‌ మార్కెట్‌లో సెక్యూరిటీ లావాదేవీ పన్ను (ఎస్‌టీటీ) వంటి  పన్నులను హేతుబద్ధీకరించి, ప్రత్యేక బాండు ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేయాలి. ఇన్విట్‌ల్లో పెట్టుబడి పెట్టేందుకు బ్యాంకులను అనుమతించాలన్నారు. జీఎస్‌టీ విధానం సరళీకరించి, పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలన్నారు. 

బీమాలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాలి: ఫిక్కీ
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని ఫిక్కీ కోరింది. ఆహార రిటైల్‌లో 100 శాతం ఎఫ్‌డీఐ మాదిరిగానే, మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ ఉత్పత్తులను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని సూచించింది. రీఇన్సూరెన్స్‌ రంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతానికి పరిమితం చేయొచ్చని తెలిపింది.

కార్పొరేట్ బాండ్లపై పన్ను రాయితీలకు డిమాండ్
కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులపై రిటైల్‌ మదుపర్లకు పన్ను రాయితీలను పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మార్కెట్‌వర్గాలు కోరాయి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పథకాల్లో పెట్టుబడులపై రిటైల్‌ మదుపర్లకు మరిన్ని పన్ను రాయితీలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios