Asianet News TeluguAsianet News Telugu

రైతు కుటుంబాలను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి... 18 గంటలకో ఆత్మహత్య

పంటలకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ప్రకటిస్తామని ఘనంగా చెప్పుకునే నరేంద్రమోదీ సర్కార్ ఒకటిన్నర కాదు కదా.. అసలు పెట్టుబడి గిట్టుబాటయ్యే చర్యలే తీసుకోవడం లేదు. ప్రత్యేకించి ఉల్లిగడ్డల ధరలు క్వింటాల్ కు భారీగా పతనం అవుతోంది. రూ.250లకు వ్యాపారులు కొనుగోలు చేస్తే రైతుల కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఉల్లి అధికంగా పండించే మహారాష్ట్రలో గత 25 రోజుల్లో 18 మంది మృతి చెందడమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

Maharastra Farmer's Shattered Hopes in Onion Fields
Author
Maharashtra, First Published Jan 28, 2019, 1:37 PM IST

ముంబై: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు పంటకు కనీస పెట్టుబడి మద్దతు ధర 1.50 రెట్లు పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నా.. ఆచరణలో ఉల్లి పంటను నమ్ముకుని సాగు చేస్తున్న మహారాష్ట్ర రైతులు పెట్టుబడులు సైతం రాక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన నెలలో మహారాష్ట్రలో 18 మంది ఉల్లి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డరంటే పరిస్థితి తీవ్రతను అవగతమవుతోంది. 

మార్కెట్‌కు క్వింటాళ్ల కొద్ది తీసుకొచ్చిన ఉల్లి పంటను అమ్మితే రూ.1000 కూడా రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్‌లో నాసిక్‌కు చెందిన ఓ రైతు.. క్వింటాల్‌ ఉల్లి పంట అమ్మి తనకు వచ్చిన రూ. 700 లను ప్రధానమంత్రి కార్యాలయానికి మనీ ఆర్డర్‌ చేసినా ప్రధాని మోడీ, రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌కు ఈ విషయంపై దృష్టి సారించే ఓపిక లేకపోవడం ఆసక్తికర పరిణామం.

 దేశంలో ఉల్లి పంటను ప్రధానంగా పండించే రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నది. కరువు ప్రాంతమైన నాసిక్‌ జిల్లా పరిధిలో ఉండే నాలుగు జిల్లాలలో రైతులు ఈ పంటను అధికంగా సాగుచేస్తారు. తీవ్ర నష్టాలకోర్చి రైతులు ఉల్లిని సాగు చేసి దానిని విపణికి తీసుకొస్తే వారికి పెట్టుబడి ఖర్చులు రాకపోగా.. కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు. 

గతవారం నాసిక్‌ జిల్లా మాలేగావ్‌ తాలూకా కందేర్‌ గ్రామానికి చెందిన రైతు ధ్యనేశ్వర్‌ (35) తాను పండించిన పంటకు పెట్టుబడి కూడా రాలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ధ్యనేశ్వర్‌ మాదిరిగానే గడిచిన  నెల రోజులలో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీస ధరలు కూడా రాక రైతులు తమ పంటలను పశువులకు మేతగా వేస్తున్నారు.

అహ్మద్‌నగర్‌ జిల్లా రహురి గ్రామానికి చెందిన ఉల్లి రైతు సురేశ్‌ కరాలే తాను సాగు చేసిన ఉల్లి పంటను గొర్లకు మేతగా వేశాడు. రూ. 60వేల పెట్టుబడితో పంట పండిస్తే దానిని అమ్మితే రూ. 10 వేలు కూడా వచ్చేలా లేవని సురేశ్‌ అన్నాడు. గతేడాది నవంబర్‌, డిసెంబర్‌లలో నాసిక్‌కు చెందిన ఇద్దరు రైతులు.. ఉల్లి పంట అమ్మగా వచ్చిన కొద్ది మొత్తాన్ని మోడీకి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపారు. అయినా కేంద్ర, రాష్ట్రాలలో అధికారరలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదంటున్నారు. 

ఈ సమస్యను అరికట్టాలన్నా రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా ఉల్లి రైతులను కేంద్ర, రాష్ట్ర సర్కారులు ఆదుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికి ఒకరేటును నిర్ణయించి దానికి తగిన విధంగా రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయాలని నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (నాఫెడ్‌) డైరెక్టర్‌ నానాసాహెబ్‌ పాటిల్‌ అన్నారు. ఒకవేళ కిలో ఉల్లికి రూ. 8 గా నిర్ణయిస్తే, మార్కెట్లో రైతుకు రూ. 4 వస్తే మిగతా నాలుగు రూపాయలను ప్రభుత్వమే రైతులకు చెల్లించాలని తెలిపారు. ఇలాంటి విధానాల ద్వారానే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని స్పష్టం చేశారు.

ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) మహారాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ డాక్టర్‌ అజిత్‌ నవలే మాట్లాడుతూ.. సర్కారు చెబుతున్నట్లు దిగుబడులు పెరగడంతో ఈ సమస్య రాలేదని అన్నారు. ప్రభుత్వ విధానాలే ధరల పతనానికి కారణమని తెలిపారు. అధిక దిగుబడి, ధరల పతనం వంటివి ఎన్నో ఏండ్లుగా ఉన్నాయని.. కానీ, దీనిపై సరైన విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.

దేశంలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోతున్నాయి. రైతులు క్వింటాల్‌ ఉల్లి అమ్మితే కనీసం రూ. 100 కూడా రాని పరిస్థితి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ఉన్నది. గతేడాది దేశవ్యాప్తంగా 220 లక్షల టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. ఇది దేశ అవసరాల (170 లక్షల టన్నులు)కు మించి 50 లక్షల టన్నులు అధికం. అధిక ఉత్పత్తి రావడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా దారుణంగా పతనం అయ్యాయి. గత 18 నెలల్లోలో ఉల్లి ధరలు పడిపోయినంతగా దేశంలో మరే వస్తువు ధరలు పతనమవలేదు. 

2017 జూలైలో క్వింటాల్‌కు రూ. 2,500 ఉన్న ఉల్లి ధర ఈ ఏడాది జనవరి నాటికి పలు మార్కెట్‌లలో రూ. 150కి పడిపోయింది. ఇదిలాఉంటే ఉల్లి ఎగుమతుల మీద కూడా మోదీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. అధిక ఉత్పత్తికి తగ్గట్టు ఎగుమతులను పెంచడం లేదు. 2016-17లో 34 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసిన కేంద్రం.. తర్వాతి ఏడాది దానిని 16.7 లక్షల టన్నులకు తగ్గించింది. 

ఇక 2018లో ఉల్లి ఎగుమతి మరింత దిగువకు పడిపోయింది. కేవలం 12 లక్షల టన్నుల ఉల్లిని మాత్రమే కేంద్రం ఎగుమతి చేసింది. కాగా, ఈ ఎగుమతులపై పదిశాతం సబ్సిడి ఇవ్వాలని ఎగుమతిదారులు డిమాండ్‌ చేస్తున్నా సర్కారు మాత్రం 5 శాతం ఇచ్చి చేతులు దులుపుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios