న్యూఢిల్లీ: భారతీయ స్టాక్ మార్కెట్లపై జాతీయ రాజకీయాల ప్రభావం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందునా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత అనిశ్చితిగా ఉంటుందో వేరుగా చెప్పనక్కర్లేదు. జపాన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మేజర్ ‘నొమురా’ కూడా తాజాగా అదే విషయం తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు భారత స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి యధావిధిగానే కొనసాగుతుందని పేర్కొంది. ఎన్నికల ప్రభావం ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో భాగంగా ఉన్న రిటైల్ ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్, మౌలిక వసతులు, నిర్మాణ రంగం, ఆరోగ్య పరిరక్షణ రంగాలపై అదనపు భారం పడుతుందని నొమురా హెచ్చరించింది. 

విస్త్రుత ప్రాతిపదికన చూస్తే నిఫ్టీ ప్రస్తుతం 10,700 పాయింట్ల మధ్య కొట్టు మిట్టాడుతుందని నొమురా తెలిపింది. ఎప్పటికప్పుడు తలెత్తే రాజకీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో నిత్యం ఆందోళనను రేకెత్తిస్తాయని హెచ్చరించింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం మార్కెట్లపై 2019లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు వరకు కొనసాగుతుంది. మళ్లీ ఈ ప్రభుత్వం తిరిగి కొలువుదీరుతుందా? లేదా? అన్న విషయమై ఇన్వెస్టర్లు చివరి వరకూ ఆందోళన చెందుతూనే ఉంటారని తెలిపింది. డిసెంబర్ నాటికి నిఫ్టీ లక్ష్యం 11,380 పాయింట్లు కాగా, దాన్ని కూడా డిసెంబర్ నెలతో ముగిసే త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రభావితం చేస్తాయని నొమురా నివేదిక వివరించింది. 

బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ త్రుతీయ కూటమిగా కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ప్రత్యేకించి శివసేన వంటి పార్టీలు బయటకు వెళ్లిపోతామని బెదిరింపులకు దిగుతున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ 2019 మధ్య వరకు ప్రభావితం చేస్తుందని నొమురా హెచ్చరించింది. ఒకవేళ బీజేపీ అధికారం కోల్పోతే కేంద్రంలో అస్థిర కూటమి కొలువు దీరే పరిస్థితి నెలకొంటే మార్కెట్‌లో ఇన్వెస్టర్ల విశ్వాసం, నమ్మకం దెబ్బ తింటుందని తెలిపింది. స్టాక్స్ విలువ కూడా తగ్గుముఖ పట్టే అవకాశం ఉన్నదని, 2018 - 20 మధ్య నిఫ్టీ లాభాలు 24 శాతం ఉంటాయని నొమురా అంచనా వేసింది. అయితే రాజకీయ పరిణామాలతోపాటు క్షేత్రస్థాయిలో సూక్ష్మ, ఆర్థిక పరిస్థితులు కూడా సమీప భవిష్యత్‌లో మార్కెట్లను ప్రభావితం చేస్తాయన్నది. 

గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిళ్లు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కూడా తప్పనిసరిగా ఎన్నికల ఏడాదిలో స్టాక్స్ పైనా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల రూరల్ ఎకానమీ, మౌలిక వసతుల అభివ్రుద్ధి సాధించడానికి వీలవుతుందని పేర్కొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తే ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ట్రాక్టర్లు, ఆటోమొబైల్ విక్రయాలు పెరుగుతాయి. వ్యవసాయ, ట్రాక్టర్ల రుణ పరపతి కూడా పెరుగుతుందని నొమురా వ్యాఖ్యానించింది.