న్యూఢిల్లీ: భారత బీమా, అభివ్రుద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) ఆమోదం పొందిన తర్వాత అప్పుల ఊబిలో చిక్కుకున్న ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాల స్వాధీనానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వ రంగ జాతీయ బీమా సంస్థ (ఎల్ఐసీ) చేపట్టింది. మధ్యలో ఎటువంటి అంతరాయాలు, అడ్డంకులు తలెత్తకపోతే మాత్రం ఐడీబీఐ బ్యాంకులో వాటాల స్వాధీనం ప్రక్రియ సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

జాతీయ బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకుకు సంబంధించిన ఆస్తులు, రుణ లావాదేవీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు తదితర అంశాలపై ద్రుష్టి సారించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో మైనారిటీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. 

స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ టేకోవర్ కోడ్ నిబంధనల ప్రకారం ఒక నిర్దేశిత సంస్థను స్వాధీనం చేసుకోనున్న సంస్థ సంబంధిత సంస్థ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా 25 శాతం నుంచి ఆ పై వాటా హక్కులను ఎల్ఐసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన భారత బీమా నియంత్రణ అభివ్రుద్ధి సంస్థ (ఐఆర్డీఏ) సమావేశంలో ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ తనకు గల 10.82 శాతం వాటాలను 51 శాతానికి పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం లిస్టెడ్ ఆర్థిక సంస్థలో ఒక బీమా సంస్థ 15 శాతానికి పైగా వాటాలు కలిగి ఉండరాదు. బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టేందుకు ఎల్ఐసీ రంగం సిద్ధం చేసుకుంటున్నది. ప్రత్యేకించి ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా స్వాధీనం చేసుకునేందుకు సిద్దం అవుతున్నది. అప్పుల బారీన పడ్డ ఐడీబీఐ బ్యాంకుతో సమన్వితం చేసుకునే దిశగా అడుగులేస్తున్నది. 

ఒకవేళ ఒప్పందం సజావుగా పూర్తయితే ఎల్ఐసీ పరిధిలోకి ఐడీబీఐ బ్యాంకు శాఖలు జత కలుస్తాయి. ఎల్ఐసీ ఆధ్వర్యంలో భారీగా సమకూర్చుకున్న నిధులు బ్యాంకుకు దన్నుగా నిలిచాయి. ఎల్ఐసీకి చెందిన 22 కోట్ల పాలసీ హోల్డర్ల నిధులు బ్యాంకుకు అదనపు ఆకర్షణ కానున్నది. 

ఐడీబీఐ బ్యాంకు మొండి బకాయిలతో పెనుగులాడుతోంది. దీనికి తోడు ఇప్పటివరకు స్థూలంగా బ్యాంకు మొండి బాకీలు రూ.55,600 కోట్లకు చేరుకున్నాయి. దీంతో తదుపరి దశలో బ్యాంకు నిర్వహణకు అవసరమైన పెట్టుబడి కావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంకు నికర నష్టం రూ.5,663 కోట్లు ఉంటుందని అంచనా. బ్యాంకు పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా తగ్గించుకునేందుకు సిద్ధంగా లేదు. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 80.96 శాతం కలిగి ఉన్నది. బీమా సంస్థ ద్వారా నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తన వాటాను 50 శాతానికి దిగువకు తగ్గించుకోనున్నది. 

ఇదిలా ఉంటే ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గతంలో ఎల్‌ఐసీ పెట్టుబడుల పనితీరును ఉదహరించింది. ఈ బ్యాంకుల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో తుడిచిపెట్టుకు పోయిందని, అది తమ లాభాలపైనా ప్రభావం చూపుతుందని ఎల్‌ఐసీ క్లాస్‌–1 అధికారుల సంఘం ఎల్‌ఐసీ చైర్మన్‌కు లేఖ రాసింది.