Asianet News TeluguAsianet News Telugu

మైండ్‌ట్రీలో బిగిసిన ఎల్&టీ పట్టు: నలందాతో 48కి చేరువలో ఇన్‌ఫ్రా మేజర్ షేర్


మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’పై ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ పట్టు బిగిస్తోంది. నలందా క్యాపిటల్ షేర్ల కొనుగోలుతో ఎల్ అండ్ టీ వాటా 48 శాతానికి దగ్గరవుతోంది. మొత్తం 66 శాతం వాటా కైవసంతో యాజమాన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ఎల్ అండ్ టీ వ్యూహం. 

L&T tightens its grip on Mindtree, buys out Nalanda Capital's stake
Author
Mumbai, First Published Jun 25, 2019, 10:08 AM IST

ముంబై: ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’పై ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ పట్టు బిగిస్తోంది. తద్వారా భారత ఐటీ రంగంలో ఫస్ట్ హోలిస్టిక్ టేకోవర్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగా సింగపూర్‌ కేంద్రంగా పని చేస్తున్న  నలందా క్యాపిటల్‌ మైండ్‌ట్రీలో ఉన్న పూర్తి వాటాలను ఎల్ అండ్ టీ సంస్థకే విక్రయించేస్తోంది. ఈ సంస్థకు మైండ్‌ట్రీలో 10.61శాతం వాటా ఉంది. దాని విలువ రూ.1,706.46 కోట్లు. ఎల్ అండ్ టీ సంస్థకు నలందా క్యాపిటల్ సంస్థ షేర్లను విక్రయిస్తున్నదని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 


ఎల్‌అండ్‌టీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌లో షేర్‌ హోల్డర్లు తమ వాటాలను విక్రయించకుండా చేసేందుకు నలందా క్యాపిటల్‌ ప్రయత్నిస్తోందని సెబీ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఓపెన్ ఆఫర్‌లో మైండ్ ట్రీ షేర్ విలువ రూ.980గా నిర్ణయించింది. 


అయితే ఓపెన్ ఆఫర్‌లో ఎల్ అండ్ టీకి తమ వాటాలు విక్రయించకుండా వాటాదారులను అడ్డుకుంటున్నదని నలందా క్యాపిటల్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత గురువారం పులక్‌ చందన్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని నలందా క్యాపిటల్‌కు సెబీ నోటీసు జారీ చేసింది. ఎటువంటి కౌంటర్‌ ఆఫర్‌ ఇవ్వకుండా ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ ఆఫర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని పేర్కొంది. ఇప్పుడు నలందా క్యాపిటలే మొత్తం వాటాలను ఎల్‌అండ్‌టీకి విక్రయిస్తోంది. నలందా క్యాపిటల్‌ ఎఫ్‌పీఐగా సెబీవద్ద రిజిస్టర్‌ అయింది. 


నలందా క్యాపిటల్ తీరుపై మైండ్ ట్రీ ఇన్వెస్టర్లు గత వారం సెబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఈ నెల 20న సెబీని ప్రాక్సీ అడ్వైజరీ ఫొరం ఇన్ గవర్న్ రీసెర్చ్ కోరింది. నలందా క్యాపిటల్ తీరు మైండ్ ట్రీలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలకు హానికరంగా ఉన్నదని పేర్కొంది. ఎల్ అండ్ టీ రూ.980పై అదనంగా షేర్‌పై 20 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాలని నలందా క్యాపిటల్ చేసిన ప్రతిపాదనకు ప్రాతిపదిక ఏమిటని సెబీ నిలదీసింది. అయితే మొత్తం షేర్లన్నీ ఎల్ అండ్ టీకి విక్రయించినా.. ఎఫ్‌పీఐగా నలందా క్యాపిటల్ యాజమాన్యం.. సెబీ నోటీసుపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నోటీసులు జారీ చేసిన విషయమై ఇటు నలందా క్యాపిటల్ గానీ, అటు సెబీ గానీ ప్రతిస్పందించలేదు. 


తాజాగా ఎల్ అండ్ టీకి మైండ్ ట్రీలోని తన వాటాను నలందా క్యాపిటల్ విక్రయించడం ఖరారు కావడంతో ఇన్ ఫ్రా మేజర్ లక్ష్యానికి చేరువలో ఉన్నది. తొలుత నలందా క్యాపిటల్ తోపాటు మొత్తం 31 శాతం పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి ఓపెన్ ఆఫర్‌లో షేర్లు కొనాలన్నది ఎల్ అండ్ టీ వ్యూహం. గతవారం ఏడు శాతం వాటా ఆల్రెడీ ఎల్ అండ్ టీ కొనేసింది. 

 

నలందాతోపాటు అమన్షా హోల్డింగ్స్ నుంచి 2.77, కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ నుంచి షేర్లను ఎల్ అండ్ కొనుగోలు చేసింది. తద్వారా మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 48 శాతానికి చేరువలో ఉన్నది. 

 

ఇక మైండ్ ట్రీ వ్యవస్థాపకులు ఎన్ క్రుష్ణ కుమార్, ఎన్ఎస్ పార్థసారథి, సుబ్రతో బాగ్చి, రొస్తోవ్ రావణన్ లతోపాటు వారి కుటుంబ సభ్యులకు కలిపి 13.32 శాతం వాటా ఉంది. గత రెండు నెలల్లో ఎల్ అండ్ టీ తన వాటాను 28.90 శాతానికి పెంచుకున్నది. బహిరంగ మార్కెట్లో మరో 15 శాతం.. మిగతా 31 శాతం ఓపెన్ ఆఫర్‌లో కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ వ్యూహం. ఏతావాతా మైండ్ ట్రీలో 66 శాతం వాటా కొనుగోలు చేసి, యాజమాన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఎల్ అండ్ టీ తహతహలాడుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios