టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్న కొద్దీ.. ఆర్థిక నేరాలు కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి. నకిలీ లింక్‌లు, యాప్‌లతో ప్రజలను టార్గెట్ చేసే KYC మోసాలు పెరుగుతున్నాయని సైబర్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాటి నుంచి రక్షణ పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. 

ఇటీవలి కాలంలో Know Your Customer (KYC) ఆధారిత మోసాలు విపరీతంగా పెరిగాయి. పిక్ పాకెట్ దొంగతనాలు జరుగుతున్నంత ఈజీగా ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఇండియాలో రోజుకు లక్షలాది మంది యూజర్లు బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు, ఫైనాన్షియల్ యాప్స్ వాడుతుండటంతో మోసగాళ్లు వారి వ్యక్తిగత సమాచారాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు, KYC మోసాలు పెరుగుతున్నాయి. 

KYC మోసం ఎలా జరుగుతుంది?

కేవైసీ మోసం అంటే యూజర్లను వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, OTPలు, పాస్‌వర్డ్స్ అడగడం, అకౌంట్ సస్పెండ్ అవుతుందని చెప్పి, OTPలు, CVV లాంటి వ్యక్తిగత, బ్యాంక్ సమాచారాన్ని తెలుసుకోవడం. ఇలాంటి మోసాల్లో సాధారణంగా మోసగాళ్ళు తరచుగా బ్యాంక్ అధికారుల్లా నటిస్తారు. భయాన్ని కలిగించడానికి అత్యవసర సందేశాలను ఉపయోగిస్తారు. 

ఇలాంటి మెసేజ్‌లు పంపుతారు

ఉదాహరణకు "ప్రియమైన కస్టమర్, మీ అకౌంట్ సాయంత్రం 5:30 గంటలకు బ్లాక్ అవుతుంది. ఇక్కడ ఉన్న లింక్‌పై క్లిక్ చేసి మీ KYCని అప్‌డేట్ చేయండి." ఇలాంటి మెసేజ్ లు పంపిస్తారు.

ఆ లింక్స్ లో అనుమానాస్పద లింక్‌లు లేదా APK ఫైల్‌లను ఇన్‌స్టాల్ చేయమని అడుగుతారు. అలాంటి లింక్‌పై క్లిక్ చేసి, యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కెమెరా, మైక్రోఫోన్, ఎస్ఎంఎస్ ఇన్‌బాక్స్ లేదా కాంటాక్ట్ లిస్ట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతులు అడుగుతారు. దీని ద్వారా మోసగాళ్ళు మీ మొబైల్ నంబర్ కి వచ్చే ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను దొంగిలించి మీ అకౌంట్స్ ఖాళీ చేస్తారు.

ఈ బ్యాంకులు అలాంటి మెసేజ్‌లు పంపవట

ICICI, Axis, HDFC వంటి బ్యాంకులు థర్డ్ పార్టీ యాప్స్ లేదా ఎస్ఎంఎస్ లింక్‌ల ద్వారా కేవైసీ అప్‌డేట్‌లను అడగవని చెప్పాయి. ఇలాంటి ఫ్రాడ్స్ పై కస్టమర్లకు హెచ్చరిక ఇ-మెయిల్‌లు కూడా పంపుతున్నాయి.

ఇలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేయకండి

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ వంటి అధికారిక యాప్ స్టోర్‌ల వెలుపల షేర్ చేసే కొన్ని నకిలీ యాప్‌లు ఆండ్రాయిడ్ భద్రతా నియమాలను పాటించవు. అలాంటి లింక్స్ లో వచ్చే యాప్స్ ని పొరపాటున కూడా ఇన్‌స్టాల్ చేయకూడదు. అలా చేస్తే ఆ యాప్స్ మీ డేటాను దొంగిలిస్తాయి. మీకు తెలియకుండానే మనీ ట్రాన్సాక్షన్స్ చేసేస్తాయి. ఏ యాప్ ఇన్ స్టాల్ చేయాలనుకున్నా అది ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లో ఉంటేనే చేయాలి. 

మీ డివైజ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి

ఆండ్రాయిడ్, యాపిల్, క్రోమ్‌లోని భద్రతా లోపాల గురించి CERT-In వంటి సంస్థలు మొబైల్ వినియోగదారులను హెచ్చరిస్తున్నాయి. డేటా దొంగతనం, సిస్టమ్ హ్యాకింగ్‌ను నివారించడానికి వినియోగదారులు తమ డివైజ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.

ఇలా చేస్తే మీరు, మీ డేటా, డబ్బు సేఫ్ 

మెసేజ్‌ల్లోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. APKలను ఇన్‌స్టాల్ చేయవద్దు.

OTPలు, CVVలు, PINలు వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని షేర్ చేయవద్దు.

KYC లేదా ఇతర అప్‌డేట్‌ల కోసం అధికారిక బ్యాంక్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించండి.

అనుమానాస్పద మెసేజ్‌లను నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930) లేదా www.cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి.

అనుమానం ఉంటే మీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి.

ఫిషింగ్ ప్రయత్నాలను sancharsaathi.gov.in లోని ‘Sanchar Saathi’ కి రిపోర్ట్ చేయండి లేదా మీ బ్యాంక్ మోసం రిపోర్టింగ్ ఇ-మెయిల్‌కు పంపండి.

ఉదాహరణకు మీరు ICICI బ్యాంక్ కస్టమరైతే మీ ప్రశ్నలను antiphishing@icicibank.com కి ఇ-మెయిల్ చేయవచ్చు. 

గమనిక: ఇక్కడ తెలిపిన వివరాలు ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే. భయపెట్టడానికి కాదు. నిర్థిష్టమైన సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్స్ లేదా మీ బ్యాంక్‌ను సంప్రదించండి.