ఎట్టకేలకు దశాబ్ద కాలం తర్వాత యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్ల మధ్య వివాదం కొలిక్కివస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే ఒక వర్గమేమో సంధి చర్చలు మరింత ముందుకు వెళ్లాయని అంటుంటే..

మరో వర్గం మాత్రం చర్చలు కొనసాగుతున్నాయని మాత్రమే అంటోంది. రాణా కపూర్‌ సన్నిహిత వర్గాలైతే సెటిల్‌మెంట్‌ చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని ముసాయిదా షరతులను చర్చిస్తున్నామని పేర్కొన్నాయి.

సమాన హక్కుల కోసం మధుకపూర్ పోరాటం ఇలా
ఇక ప్రమోటర్లను అందరినీ సమానంగా చూడాలని వాదిస్తూ వస్తున్న మధు కపూర్‌ కుటుంబం మాత్రం ‘చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి’ అని పేర్కొంది. ‘ఇది అయిదేళ్ల యుద్ధం. ఒక కొలిక్కి రావడానికి సమయం పడుతుంది. సయోధ్యకు దగ్గరగా అయితే ఇంకా రాలేదు’అని మధుకపూర్‌ కుటుంబ సన్నిహితులు తెలిపారు. 

వచ్చే జనవరితో బ్యాంకు సీఈఓగా రాణా కపూర్ ఔట్
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం 2019 జనవరి 31వ తేదీన సీఈఓ కం బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌గా రాణా కపూర్‌ పదవీ కాలం ముగిసిపోతుంది. అయితే ఆయన కుటుంబానికి బ్యాంకులో 10.7 శాతం వాటా ఉండగా.. మరో వ్యవస్థాపకుడైన దివంగత అశోక్‌ కపూర్‌ భార్య మధుకపూర్‌ కుటుంబానికి 9.8 శాతం వాటా ఉంది. అశోక్‌ కపూర్‌ 26/11 ఉగ్రదాడిలో మరణించిన సంగతి తెలిసిందే. 

యస్ బ్యాంక్ రేటింగ్ తగ్గించిన ‘మూడీస్’
కాగా, గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ఈ బ్యాంకు రేటింగ్‌ను తగ్గించి వేసింది. వచ్చేనెల 13వ తేదీన జరిగే కీలక బోర్డు సమావేశానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం బ్యాంకింగ్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.  బోర్డు సమావేశంలో కొత్త సీఈఓ, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పేరును సిఫారసు చేసే అవకాశం ఉంది.

ఇలా వివాదం మొదలు
సరిగ్గా పదేళ్ల క్రితం ముంబైపై 26/11 ఉగ్ర దాడుల్లో అశోక్‌ కపూర్‌ దుర్మరణం పాలైన తర్వాత బ్యాంకులోని రెండు ప్రమోటర్ కుటుంబాల మధ్య వివాదం ప్రారంభమైంది. మధు కపూర్‌కు ప్రమోటర్‌గా అర్హత లేదంటూ 2012లో రాణా కపూర్‌ బాంబే హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆమెకే మద్దతు పలికింది.

అదే ఏడాది వార్షిక నివేదికలో ప్రమోటర్ల జాబితాలో ఆమె పేరును రాణా కపూర్‌ తొలగించారు. ఇక ‘సమాన హక్కుల’ కోసం మధు కపూర్‌ కుటుంబం కోర్టులో పోరాడుతున్నారు. చెరో బోర్డు సభ్యుడిని నామినేట్‌ చేయడంతో పాటు ఇరువురు ప్రమోటర్లు వర్గాలు కలిసి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, ఎండీ, సీఈఓలను సిఫారసు చేయాలని కోరుతున్నారు. 

స్వయంగా రాణా కపూర్ చొరవతో ముందడుగు
కాగా, ఈ వివాదం ఇపుడు తెరపడే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రమోటర్లు ఒక సెటిల్‌మెంట్‌ దిశగా చర్చలు జరుపుతున్నారని యెస్‌ బ్యాంకు గత వారం అధికారికంగా ప్రకటించింది. జనవరి 31 తర్వాత రాణా కపూర్‌ను కొనసాగించే విషయాన్ని పరిశీలించాలని రెండోసారి ఆర్బీఐ కోరిన తర్వాత రాణాకపూరే స్వయంగా ఈ సెటిల్‌మెంట్‌ వైపునకు మొగ్గుచూపడం గమనార్హం.

సయోధ్య చర్చలపై ఇరు వర్గాల అంగీకారం
మధుకపూర్‌తో సయోధ్య నిమిత్తం నిర్దిష్ట అంశాలపై చర్చలు జరిగినట్లు రాణా కపూర్‌ సన్నిహిత వర్గాలు గత గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. బాంబే హైకోర్టులో ఒకరిపై మరొకరు వేసుకున్న దావాలను ఉపసంహరించుకునే అంశంపైనా చర్చలు జరిగినట్లు ఆ సమయంలో ఆ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, మధుకపూర్‌ వర్గాలు మాత్రం అటువంటి పరిణామాలేవీ జరగలేదని చెబుతున్నాయి. ‘సయోధ్య షరతులను ముందుగా నిర్ణయించి, కోర్టు ముందు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాతే దావాల ఉపసంహరణ ఉంటుంద’ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సయోధ్య ఒప్పందం జరిగితే వచ్చేనెల 13వ తేదీన జరిగే సమావేశంలో ఓటింగ్‌ అంశం చర్చకు రావొచ్చని ఆ వర్గాలు అంటున్నాయి.