పేద కుటుంబం నుంచి వచ్చి, క్యాన్సర్ జయించి నేడు 10 విమానాలకు అధిపతిగా మారిన మహిళ...ఇంతకీ ఎవరామె..ఆమె కథేంటి..?
జీవితం ఒక పోరాటం తన స్వంత విమానయాన కంపెనీని ప్రారంభించాలనే ఆమె కలకి క్యాన్సర్ బ్రేక్ వేసింది. కానీ, ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయటపడిన ఆమె ఎట్టకేలకు తన కలను నిజం చేసుకుంది.
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు ముఖ్యంగా వ్యాపార రంగంలో మన దేశంలో మహిళలు రాణించడం అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన దేశంలో మహిళలకు వివిధ రంగాల్లో రాణించేందుకు పెద్దగా ప్రోత్సాహం లభించదనే పేరు ఉంది. అయినప్పటికీ ఓ మహిళ తన స్టార్టప్ ద్వారా, రాణించి దేశంలోనే ఒక సంచలనంగా నిలిచింది. ఆమె ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్‌లలో చదవకపోయినా, ఈరోజు ఆమె 10 ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉంది. చిన్న వయస్సులోనే తన స్వంత ఏవియేషన్ స్టార్టప్‌ను స్థాపించిన ఆమె ప్రస్తుతం 10 ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉంది. ఆమె మొత్తం సంపద విలువ 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఆమె పేరే కనికా టేక్రివాల్. జెట్ సెట్ గో CEOగా ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా పేరు సంపాదించారు.
జెట్ సెట్ గో కంపెనీ కస్టమర్లు, సంస్థలు, వ్యాపారవేత్తలకు విమానం, హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎయిర్‌లైన్ కాంట్రాక్ట్ ఆధారిత కంపెనీ, సుమారు లక్ష మంది ప్రయాణికులకు ఇప్పటివరకు సేవలు అందించింది.
కనికా టేక్రివాల్ తన 22 ఏళ్ల వయసులో 2012లో జెట్ సెట్ గోను ప్రారంభించింది. కంపెనీ విమాన, హెలికాప్టర్ సేవలను అందించే ఫ్లైట్ అగ్రిగేటర్ స్టార్టప్ ఇది కావడం విశేషం. భోపాల్‌లో జన్మించిన టేక్రివాల్ తన ప్రాథమిక విద్యను లారెన్స్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత భోపాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సీనియర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత కోవెంట్రీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేశారు..
ఏవియేషన్ ఆధారిత సొంత కంపెనీని నెలకొల్పాలని మూడేళ్లుగా కనికా కలలు కన్నారు. అయితే, తన కలల బ్లూప్రింట్‌పై పని చేయడం ప్రారంభించినప్పుడు, ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ఆమెను ఒక సంవత్సరం వెనక్కి నెట్టింది. అదృష్టవశాత్తూ, తన క్యాన్సర్ చికిత్స ముగిసే వరకు దేశంలో ఎవరికీ ఈ స్టార్టప్ చేయాలనే ఆలోచన రాలేదని ఆమో తెలిపారు. క్యాన్సర్‌తో పోరాడిన కనికా తన డ్రీమ్ కంపెనీని స్థాపించి కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కనికా టేక్రివాల్, కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ టాప్ రిచ్ ఉమెన్ లిస్ట్ 2021 ద్వారా భారతదేశపు అత్యంత పిన్న వయస్కురాలిగా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందింది. ఆమె వ్యాపార చతురతకు గుర్తింపుగా, కనికా అనేక అవార్డులు మరియు బహుమతులతో సత్కరించారు. వీటిలో భారత ప్రభుత్వ జాతీయ పారిశ్రామికవేత్త అవార్డు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు ఉన్నాయి.ఆమెను 'ది స్కై క్వీన్' బిరుదుతో కూడా సత్కరించారు. ఇండియన్ చార్టెడ్ ప్లేన్ సెక్టార్‌ను మార్చినందుకు పూర్తి క్రెడిట్ కనికా టెక్రివాల్‌కి చెందుతుంది. ఒక ఆలోచన జీవిత దిశను ఎలా మార్చివేస్తుందో, విజయానికి దారితీస్తుందో చెప్పడానికి కనికా టేక్రివాల్ ఉత్తమ ఉదాహరణ.