Asianet News TeluguAsianet News Telugu

బ్రెగ్జిట్‌ ఎఫెక్ట్: బ్రిటన్‌లో రూ.7.3 లక్షల యూనిట్‌కు జాగ్వార్ ‘రాంరాం’

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలుగుతూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయం పట్ల టాటా సన్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రెగ్జిట్ వల్ల ఎవరికి ఒనగూడే ప్రయోజనమేమీ లేదని తేల్చి చెప్పింది. 

JLR warns bad Brexit deal will put £80 billion UK investment plan in jeopardy

లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి ‘బ్రెగ్జిట్’ పేరిట బ్రిటన్ వైదొలగడం వల్ల అన్ని దుష్పరిణామాలేనని టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెగ్జిట్‌ నిర్ణయం ఓ చెత్త నిర్ణయం అని జేఎల్‌ఆర్ అభిప్రాయ పడింది. ఇది బ్రిటన్‌లో తమ పెట్టుబడులకు విఘాతం కలిగించవచ్చని, చివరకు మరో దేశానికి తమ ప్లాంట్లను తరలించొచ్చని హెచ్చరించింది. బ్రెగ్జిట్ అమలులోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రూ.7.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన జాగ్వార్ లాండ్ రోవర్ ప్లాంట్ గండంలో పడిందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాల్ఫ్ స్పేథ్ చెప్పారు.

బ్రిటన్‌లో జేఎల్‌ఆర్ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈయూలో బ్రిటన్‌కు సభ్యత్వం ఉండటంతో మిగతా సభ్య దేశాలతో జేఎల్‌ఆర్ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సులువుగా సాగాయి. అయితే ఈయూ సభ్యత్వాన్ని బ్రిటన్ రద్దు చేసుకోవడం, వచ్చే ఏడాది మార్చిలో ఈ 28 దేశాల కూటమికి బ్రిటన్‌కు ఉన్న 40 ఏండ్లకు పైగా సంబంధం తెగిపోనున్నది. దీంతో జేఎల్‌ఆర్ మార్కెట్ ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం తమ వ్యాపారాన్ని సమస్యల్లో పడవేయవచ్చన్న ఆందోళనను జేఎల్‌ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఈయూ లావాదేవీలపై బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే కీలక సమావేశాన్ని జరుపుతుండగా స్పెత్ ఆందోళన ప్రాధాన్యతను సంతరించుకున్నది. బ్రెగ్జిట్ నిర్ణయం బ్రిటన్‌కు పరిశ్రమలను దూరం చేయవచ్చన్నారు. ఇతర ఈయూ దేశాలతో వ్యాపార సంబంధాలను కొనసాగించడానికి బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదనడం గమనార్హం. 

తాము బ్రిటన్‌ను వదులుకోబోమన్న ఆయన బ్రెగ్జిట్‌తో కొన్ని ప్లాంట్లు ఇతర ఈయూ దేశాలకు వెళ్లవచ్చన్న సంకేతాల్ని మాత్రం ఇచ్చారు. పదేళ్ల క్రితం ఫోర్డ్ నుంచి జేఎల్‌ఆర్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఏటా దీని లాభం 1.2 బిలియన్ డాలర్లకు పైగా నమోదవుతున్నది. ఒక్క బ్రిటన్‌లోనే సంస్థకు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ బ్రెగ్జిట్ వల్ల ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు. ఆటోమొబైల్ రంగంలో పోటీ తత్వాన్ని పెంపొందించే బ్రెగ్జిట్ బ్యూరోక్రసీని పెంపొందిస్తుందని జాగ్వార్ లాండ్ రోవర్ సీఈఓ రాల్ఫ్ స్పెత్ చెప్పారు. గత ఐదేళ్లలో జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ కోసం 50 బిలియన్ల ఫౌండ్లు ఖర్చు చేసింది. బ్రెగ్జిట్ అమలులోకి వచ్చిన తర్వాత తమ వ్యాపార లావాదేవీల విషయమై బ్రిటన్‌పై ఆధారపడటం తగ్గించి, ఉత్పత్తి ఇతర దేశాలకు మళ్లించాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ పీ బాలాజీ తేల్చి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios