Asianet News TeluguAsianet News Telugu

మాంద్యం మామూలుగా లేదు.. ఆభరణాల పరిశ్రమలోనూ ఉద్యోగాల కోతే?

ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశీయంగా స్వర్ణకారులకు ఉపాధి దూరం కావచ్చునని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) సంకేతాలిచ్చింది. దేశీయ ఎగుమతుల్లో భారత ఎగుమతుల్లో జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగం వాటా 970 కోట్ల డాలర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో దేశ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం తగ్గాయి.

Jewellery industry hit by recession job losses likely GJC
Author
Hyderabad, First Published Sep 10, 2019, 2:00 PM IST

కోల్‌కతా: మాంద్యం ముప్పును ఎదుర్కోనున్న తర్వాతి రంగం.. ఆభరణాల పరిశ్రమేనా?. ఈ ప్రశ్నకు అవును అంటున్నది అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ). మార్కెట్‌లో నెలకొన్న మందగమన పరిస్థితులు.. జ్యుయెల్లరీ ఇండస్ట్రీని కమ్ముకుంటున్నాయని, దీనివల్ల నైపుణ్యం ఉన్న ఎంతోమంది స్వర్ణకారులు ఉపాధిని కోల్పోయే వీలుందని జీజేసీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ సేన్‌ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు.

దిగుమతి బంగారంపై కస్టమ్స్‌ సుంకం, ఆభరణాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ప్రకటించిన బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. 

ఇక మునుపటి విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) విధానంలో 1 శాతంగా ఉన్న పన్ను భారం.. జీఎస్టీ రాకతో 3 శాతానికి చేరింది. ఇదిలావుంటే నగల కొనుగోలుకు పాన్‌ కార్డు తప్పనిసరి అన్న నియమాన్ని రూ.5 లక్షలు, ఆపై నుంచి వర్తింపజేయాలని సేన్‌ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు.

ప్రపంచంలోని అతిపెద్ద జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఇండస్ట్రీల్లో భారత్‌ ఒకటి. అంతర్జాతీయ ఆభరణాల వినియోగంలో మన ఇండస్ట్రీ వాటా 29 శాతం. 2018లో రూ.5.32 లక్షల కోట్ల స్థాయికి చేరిన మార్కెట్‌ సైజు 2025 నాటికి రూ.7.10 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. 3 లక్షలకు పైగా వర్తకులున్న ఈ రంగం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7 శాతం వాటా కలిగి ఉంది. 46.4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.

మాంద్యం ప్రభావం నేపథ్యంలో ఆభరణాల రంగాన్ని ఆదుకునేందుకు దిగుమతి బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించడంతోపాటు జువెలరీ విక్రయాలపై జీఎస్టీ భారం తగ్గించాలని  ఈ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. బంగారు నగల విక్రయాలపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు.

జీఎస్టీకి ముందు హయాంలో వీటిపై వ్యాట్‌ (విలువ ఆధారిత సేవా పన్ను) ఒక శాతంగా ఉండేది. ఒకవైపు పన్నుల మోత, పెరుగుతున్న బంగారం ధరలు.. మరోవైపు తగ్గిన డిమాండ్‌. అన్నీ వెరసి తమ వ్యాపారాలను సంక్షోభంలోకి నెట్టాయని ఆభరణ రంగ వర్గాలు వాపోతున్నాయి.
 
బంగారంపై దిగుమతి సుంకాన్ని మళ్లీ 10 శాతానికి తగ్గించాలని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) కోరింది. జీఎస్టీని ఒక శాతానికి కుదించాలని అభ్యర్థించింది. బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 

బంగారాన్ని అసెట్‌ క్లాస్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆభరణాల కొనుగోళ్లకూ నెలవారీ కిస్తీ (ఈఎంఐ) చెల్లింపు పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలిపింది. ప్రస్తుతం రూ.2 లక్షల విలువైన ఆభరణ కొనుగోళ్లకు పాన్‌ కార్డు వివరాలివ్వడం తప్పనిసరన్న నిబంధనను రూ.5 లక్షలకు పెంచాలని జీజేసీ కోరింది.

గిరాకీ తగ్గడంతో ప్రస్తుతం ఆభరణ పరిశ్రమ మాంద్యం పరిస్థితులను దుర్కొంటోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడి ఉన్న వేలాది మంది స్వర్ణకారుల ఉపాధికి ముప్పు ఏర్పడింది. కస్టమ్స్‌ సుంకం పెంపు, అధిక జీఎస్టీతో ఆభరణాల రేట్లు పెరిగాయి. దాంతో వినియోగదారుల సెంటిమెంట్‌కు గండిపడిందని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెలరీ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ సేన్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios