Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ లైన్స్‌కు రిలీఫ్: తగ్గిన ఏటీఎఫ్ ధర.. బట్ పెట్రోల్ కాస్ట్‌లీ

అంతర్జాతీయ ధరల పుణ్యమా? అని విమానయాన సంస్థలకు భారీగానే ఉపశమనం లభించింది. విమాన ఇంధన ధర  14.7 శాతం తగ్గిస్తూ కేంద్ర ముడి చమురు సంస్థలు నిర్ణయించాయి. ఇది బహిరంగ మార్కెట్లో విక్రయించే పెట్రోలు, డీజిల్‌ కంటే తక్కువ. రెండో నెలలోనూ ఏటీఎఫ్ ధర తగ్గినా.. భారీగా తగ్గించడం ఇదే తొలిసారి.

Jet fuel price cut by 14.7%, costs less than petrol and diesel
Author
Delhi, First Published Jan 2, 2019, 7:43 AM IST

స్కూటర్ లేదంటే మోటార్ బైక్.. కాదంటే ఒక బస్సు నడపటం కంటే చాలా చౌకగా మారింది. అది ఇంధన వ్యయంలోనే సుమా! ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడమే దీనికి కారణం. తద్వారా నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలకు ఈ నెలకు మాత్రం. భారీగా ఊరట లభించేనట్లే. విమాన ఇంధన (ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరను మంగళవారం రికార్డు స్థాయిలో 14.7 శాతం మేర తగ్గించారు. ఇందువల్ల పెట్రోలు, డీజిల్‌ కంటే ఏటీఎఫ్‌ చౌకగా మారింది. 

లీటర్ ఏటీఎఫ్ రూ.58.07 మాత్రమే
ఏటీఎఫ్‌ ధరను కిలో లీటర్‌ రూ.9,990 తగ్గించి రూ.58,060.97గా చేశామని ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. అంటే లీటర్‌ రూ.58.07 మాత్రమే. స్కూటర్‌, బైక్‌లలో వాడుకునే పెట్రోల్‌ కంటే, బస్సులు-లారీల్లో వాడే డీజిల్‌ కంటే కూడా ఏటీఎఫ్‌ ధరే చౌకగా ఉంది. 

వరుసగా రెండో నెల.. భారీగా తొలిసారి ఎటీఎఫ్ తగ్గింపు
వరుసగా రెండో నెలలోనూ ఏటీఎఫ్‌ ధరలో కోత విధించగా, ఇంత భారీగా తగ్గించడం ఇదే తొలిసారి. డిసెంబర్ ఒకటో తేదీన కూడా ఏటీఎఫ్‌ కిలోలీటర్‌ ధరను రూ.8,327.83 (10.9 శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఇందువల్ల ఏడాది కాలంలో కనిష్ఠస్థాయికి ఏటీఎఫ్‌ ధర చేరింది. ఇందువల్ల దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల కంటే ఏటీఎఫ్‌ ధరే తక్కువకు చేరింది. 

కిరోసిన్ కంటే ఏటీఎఫ్ చౌక మరి
ముంబై వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో రాయితీ లేకుండా లభించే కిరసనాయిలు ధర కంటే కూడా తక్కువకే ఏటీఎఫ్‌ లభించనుంది. అధిక చమురు ధరలకు తోడు, రూపాయి క్షీణతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విమానయాన సంస్థలకు భారీ ఊరట కలిగించే పరిణామమిది. 

దిగి వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు
ముడిచమురు ధరలకు అనుగుణంగా, పెట్రోల్‌-డీజిల్‌ ధరలు కూడా దిగి వస్తున్నాయి. మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధరను 19 పైసలు, డీజిల్‌ ధరను 20 పైసల మేర తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) ప్రకటించాయి.

అక్టోబర్ నుంచి ఇలా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
అక్టోబర్ 18వ తేదీ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఇప్పటికి చూస్తే పెట్రోల్‌పై లీటర్‌కు రూ.14.18, డీజిల్‌పై లీటర్‌కు రూ.13.03 మేర ధర తగ్గింది. 

ఇలా ఏటీఎఫ్ ధరలు ఖరారు
అంతర్జాతీయ సగటు ధర, డాలర్‌పై రూపాయి మారకపు విలువలకు అనుగుణంగా ప్రతినెలా 1వ తేదీన ఏటీఎఫ్‌ ధరలను చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయిస్తుంటాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మాత్రం ముడి చమురు సంస్థలు ప్రతిరోజూ సవరిస్తున్నాయి.

ఇరాన్‌ చమురు పన్ను మినహాయింపు!
ఇరాన్‌ ప్రభుత్వ కంపెనీ ‘నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ (ఎన్‌ఐఓసీ)’ నుంచి కొనుగోలు చేసే ముడి చమురు కోసం రూపాయల్లో జరిపే చెల్లింపులపై ప్రభుత్వం పన్ను మినహాయించింది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 28వ తేదీతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఏదేని విదేశీ కంపెనీ భారత బ్యాంక్‌ ఖాతా ద్వారా అందుకునే ఆదాయంపై 40 శాతం విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios