Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్వేస్ నుంచి నరేశ్ గోయల్ ఔట్!: ఎతిహద్ చేతికే పగ్గాలు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ చేతులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. చైర్మన్ స్థానం నుంచి వైదొలిగేందుకు నరేశ్ గోయల్ సంసిద్దత వ్యక్తం చేయడంతో ఆసక్తిగల ఇతర సంస్థలు టేకోవర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటికే 24 శాతం వాటా గల ఎతిహాద్ సంస్థకే మరో 25 శాతం వాటాను గోయల్ విక్రయించనున్నారని వార్తలొచ్చాయి. 
 

Jet Airways may cede reins to Etihad, puts Tatas' proposal on back burner
Author
Mumbai, First Published Nov 29, 2018, 12:59 PM IST

ఎట్టకేలకు నరేశ్ గోయల్ సారథ్యం నుంచి ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్‌ఎయిర్‌వేస్‌’ చేతులు మారేందుకు దాదాపు రంగం సిద్ధమవుతున్నదా? అంటే పరిస్థితులు అవుననే అని చెబుతున్నాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ నుంచి వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ వైదొలగనున్నట్లు సమాచారం. 

జెట్ ఎయిర్వేస్ సంస్థలోని తన కీలక వాటాలను మాత్రం విక్రయించి నిర్వహణ నుంచి వైదొలగేందుకు నరేశ్ గోయల్ అంగీకరించినట్లు వార్తలు రావడంతో స్టాక్‌ మార్కెట్లో సంస్థ షేర్లు పుంజుకొన్నాయి.

ఈ విషయాన్ని టాటా సన్స్ గ్రూప్‌, ఎతిహాద్, ఎయిర్ ఫ్రాన్స్ ఆధ్వర్యంలోని కన్సార్టియం, కేఎల్ఎం, డెల్టా సంస్థలకు తెలిపినట్లు ఓ ఆంగ్ల వార్తా‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. కానీ వాటిని ఎవరికి విక్రయించేందుకు అంగీకరించారో మాత్రం బయట పెట్టలేదు. 

ఇంతకుముందు వరకు నరేశ్ గోయల్ తన మెజారిటీ వాటాల విక్రయానికి సుముఖత వ్యక్తం చేయలేదు. నష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు టాటా సన్స్ ముందుకు వచ్చినా సదరు సంస్థ ప్రమోటర్ విధించిన షరతులతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

అటు ఎతిహాద్ కూడా తొలుత మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినా చైర్మన్‌గా నరేశ్ గోయల్ కొనసాగేందుకు అయిష్టత చూపినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. 

నరేశ్ గోయల్ ఇటీవల ప్రతిపాదించిన సమాచారం ప్రకారం మెజారిటీ వాటా ఎతిహాద్‌కు విక్రయించి, చైర్మన్‌గా తానే ఉంటానని ప్రతిపాదించారు. కానీ తాజాగా వాటాలను విక్రయించడంతోపాటు చైర్మన్‌గా వైదొలుగనున్నట్లు నరేశ్ గోయల్ ప్రకటించడంతో జెట్ ఎయిర్వేస్ చైర్మన్ గా కొనసాగాలన్న ఆయన ఆశలు అడియాసలైనట్లు తెలుస్తోంది.

తాజా పరిస్థితుల్లో ఎతిహాద్, టాటా సన్స్ మరో రెండు సంస్థల్లో ఏ సంస్థ చేతుల్లోకి జెట్ ఎయిర్వేస్ వెళుతుందన్నదని త్వరలో తేలిపోనున్నది. ఇక జెట్ ఎయిర్వేస్ బోర్డులో స్థానం దక్కించుకొనేలా ఐదుశాతానికంటే తక్కువ వాటా షేర్లు ఉంచుకొని మిగతా షేర్లను నరేశ్ గోయల్ విక్రయించే అవకాశాలు ఉన్నాయి. 

ఈ వార్తలతో బుధవారం స్టాక్‌ మార్కెట్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటాలు దాదాపు 9శాతం ఎగిశాయి. గత రెండువారాల్లో ఆ షేర్లు ఒక్క అంతర్గత ట్రేడింగ్‌లో పెరిగిన అత్యధిక మొత్తం ఇది. ఈ వార్తలపై జెట్‌ ఎయిర్‌వేస్‌లో దాదాపు 24 శాతం వాటాలు ఉన్న ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం స్పందించలేదు.

ఇటీవల చమురు ధరలు పెరగడంతో జెట్‌ఎయిర్‌వేస్‌ ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతోపాటు దేశీయమార్కెట్‌లో పోటీ విపరీతంగా పెరడం కూడా ఈ సంస్థకు చేటు చేసింది. జెట్ ఎయిర్వేస్ సారథ్య బాధ్యతల నుంచి ఆయన వైదొలగడం చాలా అత్యవసరం అని సంస్థ సన్నిహిత వర్గాల కథనం.

ఒకవేళ ఈ ఒప్పందం ఖరారైతే ప్రస్తుతం 24 శాతంగా ఉన్న ఎతిహాద్ వాటా 49 శాతానికి చేరుకోనున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సివిల్ ఏవియేషన్ రంగంలో ఎఫ్డీఐలకు 49 శాతం మాత్రమే వాటా కొనుగోలుకు అవకాశం ఉన్నది. 

ఈ క్రమంలో ఎతిహాద్ మరో భారత విమానయాన సంస్థలో వాటాలు కొనుగోలు చేసినట్లవుతుందని సమాచారం. మరోవైపు 2010 నుంచి ఎయిర్ ఇండియా సంస్థలో స్వతంత్ర డైరెక్టర్ గా ఉన్న లులు గ్రూప్ యజమాని ఎన్నారై ఎంఎ యూసుఫ్ అలీతో ఎతిహాద్ సంప్రదింపులు జరుపడం ఆసక్తి కర పరిణామం.

కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టడంతోపాటు డైరెక్టర్ గానూ ఉన్నారు. కానీ ఎతిహాద్ ప్రతిపాదనలనపై యూసుఫ్ అలీ స్పందించలేదు. జెట్ ఎయిర్వేస్ సంస్థను ఎతిహాద్ టేకోవర్ చేయడం జరిగితే అది ఓపెన్ ఆఫర్ లోనే ఉంటుంది.

తాజా పరిణామాల ప్రకారం నరేశ్ గోయల్ వాటా 26 శాతానికి తగ్గిపోతుంది. కానీ పేరుకు సంస్థ చైర్మన్‌గా ఉంటారు. ఈ ఒప్పందం ఖరారు కావడానికి నాలుగు నుంచి ఆరు వారాల టైం పడుతుందని సమాచారం. జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎతిహాద్ 24 శాతం వాటాను 2013లో కొనుగోలు చేసింది. 

తాజా పరిణామాలపై స్పందించేందుకు టాటా సన్స్ నిరాకరించింది. టాటా సన్స్ ప్రతిపాదనలకు నరేశ్ గోయల్ ఆమోదం తెలుపక పోవడంతో జెట్ ఎయిర్వేస్ సంస్థను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను టాటా సన్స్ పక్కన బెట్టినట్లు సమాచారం. సంస్థలో 10 శాతం వాటా వరకు నరేశ్ గోయల్ కు కొనసాగిస్తూ ఆయన కొడుకు నివాన్‌కు బోర్డులో సభ్యత్వం కల్పించేందుకు టాటా సన్స్ ముందుకు వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios