Asianet News Telugu

నరేశ్ గోయల్ ఔట్: ఇతేహాద్‌కే జెట్‌ ఎయిర్వేస్‌పై పెత్తనం?

ఎట్టకేలకు జెట్ ఎయిర్వేస్ ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయల్ మెట్టుదిగినట్లు కనిపిస్తున్నారు. నియంత్రణ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సంస్థను రుణ బాధల నుంచి బయటపడవేసేందుకు బ్యాంకర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మరో రూ.3000 కోట్ల నిధులు రానున్నాయి. ఇతేహాద్, ఎన్ఐఐఎఫ్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. రుణాలను ఈక్విటీగా మార్చుకోనున్న బ్యాంకర్లు. ఎన్ఐఐఎఫ్ సంస్థలు మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జెట్ ఎయిర్వేస్ నిర్వహణ బాధ్యతను మరో సంస్థకు అప్పగించే అవకాశం ఉన్నది. అది ఇతేహాద్ అవుతుందా? మరొక సంస్థకు అప్పగిస్తారా? అన్న సంగతి తేలాలి. ఇతేహాద్ నియంత్రణకు అప్పగిస్తే విపక్షాల నుంచి ప్రభుత్వానికి విమర్శలు తప్పకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Jet Airways likely to get over Rs 3,000 crore funds
Author
New Delhi, First Published Feb 18, 2019, 11:24 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్వేస్‌ ఆర్థిక కష్టాలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఇటీవల కుదిరిన రుణ పునర్వ్యవస్థీకరణ ఒప్పందం మేరకు సంస్థకు మరో రూ.3,000 కోట్ల నిధులు అందనున్నాయి.

ఆ సంస్థ భాగస్వామి ఎతిహాద్‌ ఎయిర్వేస్‌తోపాటు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) సంస్థ నుంచి ఈ నిధులు జెట్ ఎయిర్వేస్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఎన్ఐఐఎఫ్‌లో అబుదాబీ ప్రభుత్వం భాగస్వామి. ఎన్ఐఐఎఫ్‌ ద్వారా వాటాలు కొనుగోలు చేసి.. పెత్తనం ఎతిహాద్ సంస్థకు అబుదాబీ సర్కార్ అప్పగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అబుదాబి కేంద్రంగా పనిచేసే ఎతిహాద్‌కు ప్రస్తుతం 24 శాతం వాటా ఉంది. రుణాల పునర్వ్యవస్థీకరణ పేరిట మరికొంత వాటాను ఈ సంస్థ పొందనున్నది. ఇందుకు మరో రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. ఇందువల్ల ఈ సంస్థ వాటా గణనీయంగా పెరగబోదని, అందువల్ల ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఈ నెల 14వ తేదీన కుదిరిన ఒప్పందం ప్రకారం జెట్‌ ఎయిర్వేస్‌కు రుణాలు సమకూర్చిన ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం, తమ రుణాలను ఈక్విటీగా మార్చుకోనున్నది. ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా మరిన్ని రుణాలు సమకూర్చేందుకూ బ్యాంకులు అంగీకరించినట్టు సమాచారం. ఇక స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.600 కోట్ల రుణాన్ని వాటాగా మార్చుకుంటుందని సమాచారం. 

ఇందుకోసం జెట్‌ ఎయిర్‌వేస్‌ 11.4 కోట్ల ఈక్విటీ షేర్లను, ఒక్కోటి రూపాయి చొప్పున బ్యాంకులకు జారీ చేస్తుంది. ఈ నెల 21వ తేదీన వాటాదార్ల నుంచి అనుమతి పొందాక, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణంలో కొంతమేర 11.4 కోట్ల షేర్లుగా మారతాయి. ఆపై జెట్‌ ఎయిర్వేస్‌కు మళ్లీ తాత్కాలిక రుణ స్వీకరణ అవకాశాలు లభిస్తాయి.

బ్యాంకర్లతో కుదిరిన ఒప్పందాన్ని జెట్ ఎయిర్వేస్ వాటాదారులు ఆమోదిస్తే, బ్యాంకులు జెట్‌ ఎయిర్వేస్‌కు మరిన్ని నిధులు సమకూరుస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌, బ్యాంకులు అధికారికంగా స్పందించడం లేదు.

ఎన్‌ఐఐఎఫ్‌ కూడా రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రతిఫలంగా జెట్‌ ఎయిర్వేస్‌లో 19 శాతం వాటా లభించనుంది. ఎన్‌ఐఐఎఫ్‌లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ కీలక భాగస్వామి కావడం గమనార్హం. మొత్తంమీద రూ.3400 కోట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌కు సమాకూరవచ్చు.

ఈ రుణ పునర్వ్యవస్థీకరణతో జెట్‌ ఎయిర్వేస్‌ ప్రధాన ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అతని కుటుంబ సభ్యుల వాటా 20 శాతానికి తగ్గుతుందని సమాచారం. ప్రస్తుతం జెట్‌ ఎయిర్వేస్‌లో 51 శాతం వాటా వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు ఉంది. 

నిన్న మొన్నటి వరకు తన వాటా తగ్గించుకునేది లేదని భీష్మించుకు కూర్చున్న నరేశ్ గోయల్‌ పరిస్థితులు చేజారిపోతుండటంతో ఇందుకు అంగీకరించారు. దీంతో గోయల్‌ కనీసం జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌గానైనా కొనసాగుతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తం మీద ఈ రుణ పునర్‌ వ్యవస్థీకరణతో ఎతిహాద్‌ ఎయిర్‌లైన్సే పరోక్షంగా జెట్‌ ఎయిర్వేస్‌ను నడిపించబోతోంది. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణలో ఏ మాత్రం అనుభవం లేదని రుణదాతల కంటే ఇదే మేలని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌పై పెత్తనాన్ని విదేశీ విమానయాన సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు కట్టబెట్టడంపై విపక్షాలు ఎలా స్పందిస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజా పరిణామాలతో జెట్‌ ఎయిర్వేస్‌ కష్టాల నుంచి బయట పడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వంటివి అంచనా వేస్తున్నాయి. రుణాన్ని వాటాగా మార్చుకున్నాక, అతిపెద్ద వాటాదార్లుగా మారే ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల బృందం ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ బాధ్యతలను ఎతిహాద్‌తో పాటు మరో భాగస్వామి’కి అప్పగిస్తారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పేర్కొన్నాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసానీ స్పందిస్తూ ‘ప్రస్తుత ప్రమోటర్ల నిర్వహణలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కోలుకునే అవకాశం లేదు. రుణదాతలు, వాటాదారులు నిర్వహణ చేపట్టినా, అదనంగా చేకూరే ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో ఈ రంగంలో అనుభవంతో పాటు కంపెనీ ఈక్విటీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్‌ ఎయిర్‌లైన్సే ముందుకు వచ్చి జెట్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీని నడిపించాలి’ అని సూచించారు.  
 
జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ కుమార్ మాట్లాడుతూ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ కొద్ది సంవత్సరాలుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ రుణ పునర్‌ వ్యవస్థీకరణతో కంపెనీ ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios